దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం బీహార్ అసెంబ్లీ 18వ ఎన్నికల ప్రచారం రెండు ప్రధాన కూటముల మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్నది. ఇప్పటికీ 17 సంవత్సరాలకు పైగా పాలక ఎన్డీయే (జేడీయూ, బీజేపీ కూటమి) ముఖ్యమంత్రిగా ఉన్న జేడీయూ నేత నితీశ్ కుమార్ నవంబర్ 6, 11వ తేదీలలో పోలింగ్ జరిగే శాసనసభ ఎన్నికల్లో గెలిచి పదోసారి సీఎం గద్దెనెక్కాలని ఆశపడుతున్నారు. మరోపక్క ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇతర పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ నేత, ఆర్జేడీ స్థాపకుడు లాలూ ప్రసాద్ చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ యాదవ్ తన కూటమి విజయం సాధిస్తే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
2000 మార్చిలో బీజేపీ-జేడీయూ కూటమి నేతగా నితీశ్ మొదటిసారి సీఎం పదవి చేపట్టారు. తర్వాత 2005 నుంచి 2014 వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అనంతరం రెండుసార్లు ఎన్డీయే నుంచి వెలుపలికి వచ్చి ఆర్జేడీ, దాని మిత్రపక్షాలతో కలిసి (2015-2017, 2022-2024 జనవరి వరకు) నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా బీజేపీ, ఆర్జేడీలతో వివిధ సమయాల్లో జట్టుకట్టిన జేడీయూ నేతకు ఇవే చివరి ఎన్నికలుగా భావిస్తున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెల్లడవుతాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన అనేక సర్వేలు ఎన్డీయే కూటమికి విజయావకాశాలు ఉన్నాయని అంచనావేశాయి. కొన్ని సర్వేలు రెండు కూటముల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు జోస్యం చెప్పాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, మహా ఘట్బంధన్ మధ్య ఓట్ల శాతంలో తేడా అతి స్వల్పం కావడంతో ఈసారి విజయం ఏ కూటమిదో కచ్చితంగా అంచనా వేయడం కష్టమే. అయితే, 2005 ఎన్నికల నుంచీ దాదాపు 20 ఏండ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కారణంగా నితీశ్ కుమార్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాను సీఎం పదవిలో కొనసాగడానికి ఉపకరించే కూటమిని అసెంబ్లీ ఎన్నికల ముందు చక్కగా గుర్తించే సామర్థ్యం ‘సుశాసన్ బాబు’గా పేరుమోసిన ఈ జేడీయూ నేతకు ఉంది. అందుకే 2015 ఎన్నికల్లో ఆర్జేడీ, దాని మిత్రపక్షాలతో చేతులు కలిపి సాధించిన విజయంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. తిరిగి 2020 అసెంబ్లీ ఎన్నికలకు మూడేండ్ల ముందు 2017లో ‘మహా’ కూటమికి చెల్లుచీటీలు ఇచ్చి బీజేపీతో చేతులు కలిపారు. అయితే, నితీశ్‌పై ఆగ్రహంతో లోక్‌జన్ శక్తి (ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ జేడీయూ పోటీలో ఉన్న స్థానాల్లో కిందటి ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించారు. ఫలితంగా 2020 శాసనసభ ఎన్నికల్లో జేడీయూ బలం 71 నుంచి 43కు దిగజారింది. బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 74కు పెరిగింది. అప్పటి నుంచీ బీహార్ ఎన్డీయే సర్కారులో పెత్తనం బీజేపీ చేతుల్లోకి పోయింది. 2022లో మరోసారి జేడీయూ సీఎం పాత మిత్రపక్షమైన మహా కూటమిలో చేరి లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకూ (2024 జనవరి) కొనసాగారు. కిందటి పార్లమెంటు ఎన్నికల ముందు ఎన్డీయేలో చేరి తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అలాగే, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110, జేడీయూ 115 స్థానాలకు పోటీచేశాయి. కానీ, 2025 ఎన్నికల్లో రెండు పార్టీలూ 101 సీట్ల చొప్పున సమానంగా పోటీచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ బలం తగ్గిపోయి, ఎన్డీయేకు మెజారిటీ వస్తే నితీశ్ కుమార్‌కు పదోసారి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవచ్చు. ఈ మధ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్డీయే కూటమి నేత నితీశ్ కుమారేనని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రకటించారు. కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఎన్నికల తర్వాతే ఎన్డీయే సీఎం ఎవరో నిర్ణయిస్తామని సూచనప్రాయంగా తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లు కేటాయించగా, మరో రెండు చిన్న భాగస్వామ్యపక్షాలైన రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందూస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం)లకు ఆరేసి స్థానాలను ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహా ఘట్బంధన్ విజయం తథ్యమని వేసిన అంచనాలను కాంగ్రెస్ అత్యాశ, అసమర్థత దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బీహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తూ జరిపిన ‘ఓట్ అధికార్ యాత్ర’తో పార్టీ బలోపేతమైందనే భ్రమలు హస్తం పార్టీకి శాపంలా మారాయి.
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 27 శాతం స్ట్రయిక్ రేట్‌తో మహాకూటమి కొంపముంచింది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కొద్ది స్థానాల్లో పోటీపడుతున్న ఈ పార్టీ గతంలో మాదిరిగానే 20లోపు సీట్లకే పరిమితమవుతుందని భావిస్తున్నారు. 1995 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికల్లోనూ కనీసం 35 సీట్లయినా దక్కించుకోలేని కాంగ్రెస్ బలహీనతే తేజస్వీ యాదవ్ విజయానికి ప్రధాన అడ్డంకి అవుతుందని ఎన్నికల విశ్లేషకుల అంచనా.
ఈ ఏడాది ఆరంభంలో బీహార్ పార్టీ ఇన్చార్జిగా కర్ణాటకకు చెందిన పూర్వ కార్పొరేట్ కన్సల్టెంట్ కృష్ణ అల్లవారును కాంగ్రెస్ హైకమాండ్ నియమించడంతో మహా కూటమిలో సంక్షోభానికి పునాదులు పడ్డాయి. అరవైకి పైగా సీట్లలో తమ పార్టీ పోటీచేయాలనే ఆయన మంకు పట్టుదల వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు, కూటమిలో సంక్షోభం తలెత్తాయి. చివరికి ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ మొన్నీమధ్య రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్‌ను ఆగమేఘాల మీద పట్నా పంపించి తేజస్వీతో రాజీ చేసుకుంది. అయితే, ‘తేజస్వీ ప్రాణ్’ పేరుతో రూపొందించిన మహా కూటమి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాహుల్‌గాంధీ రాకపోవడం ఈ ఎన్నికలపై హస్తం పార్టీకి ఏ మాత్రం శ్రద్ధ లేదని రుజువు చేస్తున్నది. ఈ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ మెజారిటీ సీట్లు గెలుచుకోకపోతే దానికి కాంగ్రెస్సే కారణమని చెప్పక తప్పదు.
బీహార్ మహిళలకు మేలు చేసే ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజనను ఎన్డీయే సర్కారు సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటికే రూ.10,000 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో నితీశ్ ప్రభుత్వం జమ చేసింది. దీనికి పోటీగా తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అంతేగాక బీహార్‌లో కోట్లాది మంది ఆడబిడ్డల సంక్షేమానికి నిరంతరం పాటుపడే 1.40 లక్షల మంది జీవికా దీదీల వేతనాలు పెంచి, వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని కూడా మహా కూటమి ప్రకటించింది.
రాష్ట్రం నుంచి కార్మికుల వలసలు నిరంతరాయంగా కొనసాగడం, నిరుద్యోగం వంటి సమస్యలు యువతను బాధిస్తున్నాయి. ఎన్డీయే గనుక ఎన్నికల్లో ఓడిపోతే దానికి ప్రధాన కారణం నిరుద్యోగమే అవుతుందని భావిస్తున్నారు. అంతేగాక జనాభాలో 15 శాతం వరకూ ఉన్న యాదవులు మాత్రమే ఆర్జేడీ పాలనలో ఎక్కువ లబ్ధి పొందారనే భావన జనంలో బలంగా ఉంది. అదీగాక నితీశ్ పాలనలో ఈబీసీలకు మేలు చేసే పథకాలను అమలు చేయడం ఎన్డీయేకు అనుకూలాంశం. ఆర్జేడీ అంటే కేవలం యాదవులు, ముస్లింల (దాదాపు 20 శాతం జనాభా) పార్టీ అనే ప్రచారం నిజం కాదని నిరూపించేందుకు తేజస్వీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అగ్రకులాల ఓట్లు, యాదవేతర బీసీ కులాలు, ఈబీసీల మద్దతుతో తన చివరి ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమా నితీశ్‌లో కనిపిస్తున్నది. 19952005 మధ్యకాలంలో పదిహేనేండ్లు లాలూ ప్రసాద్, ఆయన భార్య రాబ్రీ దేవి పాలనలో బీహార్‌లో ‘ఆటవిక పాలన’ (జంగిల్‌రాజ్) సాగిందనే విమర్శను, ప్రచారాన్ని ఎన్డీయే నేతలు బాగా వాడుకుంటున్నారు. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) నేత ముఖేశ్ సహానీని మహా ఘట్బంధన్ ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం సానుకూల అంశమే గానీ, ఆ పార్టీకి బలమైన పునాదులు లేవు. ఈ కూటమిలో ఆర్జేడీ, సీపీఐ (ఎంఎల్)-లిబరేషన్ మినహా బలమైన పార్టీలు లేకపోవడం ఎన్డీయేకు కలిసొచ్చే అంశం.
జగమెరిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి ఏడు నుంచి పది శాతానికి మించి ఓట్లు పడవచ్చని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. జన్ సురాజ్‌ను మూడో ప్రత్యామ్నాయంగా ఈ ఎన్నికల్లో జనం ఆదరించకపోవచ్చనే అభిప్రాయం వ్యాపించింది. సీమాంచల్, మరికొన్ని ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్న స్థానాల్లో హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఈసారి 30కి పైగా సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ జన్‌శక్తి జనతాదళ్ ప్రభావం లేదనే చెప్పవచ్చు. మొత్తంమీద ప్రస్తుత ఎన్నికల ప్రచార సరళి, జనాభిప్రాయాలు, కూటముల వ్యూహాలు, ప్రచారం జోరును బట్టి చూస్తే పాలక జేడీయూ-బీజేపీ కూటమికే మహాఘట్ బంధన్‌పై స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నదని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీ వాడ్రాలు హఠాత్తుగా ఢిల్లీ నుంచి బీహార్‌లోకి ఊడిపడే పర్యటనలు మినహా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో సరైన పునాదులు, నిర్మాణం లోపించడం కూడా తేజస్వీకి గుబులు పుట్టించే అంశం.