ఏప్రిల్ నెల బడుగులు, మహానీయుల మాసమని దేశమంతా ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసి తెలంగాణ పులకించిపోతున్నది. ఈసారి గ్రామీణ తెలంగాణ ఫలితాలు బాగా వచ్చాయని, ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యార్థులు సాధించిన ఫలితాలను చూసి మొత్తం తెలంగాణ సమాజం పరవశిస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90 శాతంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. గురుకులాల్లో చదువుకున్న కింది కులాల పిల్లలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు అత్యధిక మార్కులు సాధించటం గొప్ప పరిణామం.
రాజకీయంగా లెక్కలు కట్టుకొని మాట్లాడే వాళ్లుంటే వాళ్ల స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది. అది వాళ్ల హక్కు కూడా. కానీ, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ బీడు భూములపైకి గంగమ్మను మళ్లించేందుకు కాళేశ్వరం లాంటి మహాసాగరాన్ని నిర్మించటం ఒక ఎత్తు. సమాజంలో రావాల్సిన ప్రధాన మార్పునకు విద్య ప్రధాన కారణమని గురుకులాలను ప్రారంభించి, విద్యా ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ కృషి చరిత్ర మరిచిపోలేనిది. మరో నాలుగైదేండ్లలో ఈ గురుకులాల ఫలాలను కిందికులాల నుంచి వచ్చిన మరెంతోమంది బడుగుల బిడ్డలు అందుకోబోతున్నారు. వెయ్యికి పైగా ఉన్న గురుకులాల నుంచి వచ్చిన పేద బడుగుల బిడ్డలు తమ చదువుతో అన్ని రంగాల్లో అడుగు పెట్టబోతున్నారు. సంచార జాతుల బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాబోతున్నారంటే అది తెలంగాణలోని గురుకులాల వల్లనే సాధ్యమని వర్తమాన చరిత్ర రుజువు చేయబోతున్నది.
తెలంగాణ రాకముందు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకునేందుకు బడుగుల బిడ్డలు వెళ్లాలంటే తమకున్న ఎకరం, అరెకరం భూములు అమ్ముకున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. తమకొచ్చే పంటల మీద వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చవచ్చునని యోచించి, అప్పులు తెచ్చి చదివించిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ చేతిలో ప్రభుత్వ విద్యారంగం ధ్వంసమైంది. ఆనాటి పాలకులు కార్పొరేట్ విద్యావ్యవస్థను పెంచి పోషించారు.
తెలంగాణ అవిర్భవించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 1,000కి పైగా గురుకులాలను నెలకొల్పటం విప్లవాత్మక చర్య. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం గురుకులాలను నెలకొల్పలేదు. అది తెలంగాణే చేసింది. కింది కులాల నుంచి వచ్చిన బడుగుల బిడ్డలు ఒక్కపైసా కూడా చెల్లించకుండా కేజీ నుంచి డిగ్రీ వరకు చదువుకునేందుకు గురుకులాలను నెలకొల్పారు. ఇది ఒకరకంగా బడుగుల కార్పొరేట్ విద్యా సంస్థలుగా వచ్చాయి. దీంతోనే కింది కులాల పిల్లల చదువుకు మంచి ఆసరా దొరికింది. ఇల్లువాకిలి లేకుండా ఫుట్‌పాత్ మీద గుడారాల కింద జీవించే బైలు కమ్మరుల దగ్గర్నుంచి సంచారజాతుల బిడ్డలంతా బీసీ గురుకులాల్లో చేరారు. ఆ బిడ్డలంతా మరో నాలుగేండ్లలో డిగ్రీలు పూర్తి చేయబోతున్నారు.
తాజాగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకులాల విద్యాసంస్థలో 41 కాలేజీల్లో 100 శాతం ఫలితాలొచ్చాయ్. ఫస్టియర్‌లో 12 కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. 470 మార్కులకు 468 మార్కులు ఏడు గురుకులాల ఎంపీసీ విద్యార్థులు, 440కి 438 మార్కులు 5 గురుకులాల్లో బైపీసీ. విద్యార్థులు సాధించారు. 500కి 494 మార్కులు ఆర్ట్స్ గ్రూపుల్లో సాధించారు. ఎంపీసీలో ఇద్దరు విద్యార్థులు 995 మార్కులు, బైపీసీలో 994, ఆర్ట్స్‌లో 985 మార్కులు సాధించటానికి బలమైన పునాదులు వేసింది గురుకుల విద్యావ్యవస్థ.
మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 33 కాలేజీల్లో నూరు శాతం ఫలితాలు వచ్చాయి. బీసీ గురుకుల విద్యాలయాల్లో పిల్లలు మొత్తంగా 90 శాతం పాసయ్యారు. టాప్ మార్కులు, ర్యాంకింగ్‌లు పొందారు. బైపీసీలో 994 మార్కులు ఇద్దరు విద్యార్థులు, ఎంపీసీలో 994 మార్కులతో ఇద్దరు, సీఈసీలో ముగ్గురు విద్యార్థులు 983 వరకు, హెచ్ఇసీలో 980 వరకు మార్కులు పొందారు. అనేక ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి మార్కులు, ర్యాంకులు పొందగలిగారు. ఇది ఒక రకంగా కార్పొరేట్ విద్యారంగంపై గెలుపుగానే చూడాలి. ఇది రాష్ట్ర అవతరణ తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు సాధించిన నిశ్శబ్ద విప్లవం. రాబోయే నాలుగైదేండ్లలో గురుకులాల విద్యాసంస్థల ఫలాలను ప్రత్యక్షంగా చూస్తాం. మహాత్మా జ్యోతిభాఫూలే ఆలోచనలను అమలు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. గురుకులాల విద్యాలయాల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాలను ఎక్కారు. బడుగుల బిడ్డలు కార్పొరేట్ విద్యాసంస్థలను దాటి, గురుకులాల ద్వారా గ్రామీణ విద్యను విరబూయించారు.
వెట్టిచాకిరీ వ్యతిరేక పోరాటాలు చేసిన ఆ వర్గాల బిడ్డలు గురుకులాల విద్యావ్యవస్థ ద్వారా చదువుల విప్లవాలను విరబూయిస్తున్నారు. మహాత్ముడు జ్యోతిబాఫూలే 200వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఏప్రిల్ మాసంలో బడుగుల బిడ్డలు చదువుల జ్ఞానాయుధాలను అందుకుని ముందుకు సాగటం స్వరాష్ట్రం సాధించిన విజయం. బడుగుల గురుకుల విద్యాలయాలను నిర్మించి ఆ వర్గాల బిడ్డల ఎదుగుదలకు కృషి చేసిన కేసీఆర్..నిను మరువదు బిడ్డా తెలంగాణ గడ్డ.