కామారెడ్డి గడ్డ ఉద్యమాలకు కేంద్ర బిందువు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం ఊపిరి పోసింది. నాడు ఉద్యమ ప్రస్థానంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కామారెడ్డి నుంచే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. బీసీ డిక్లరేషన్ పేరిట 2023, నవంబర్ 10న ఇందిరాగాంధీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించింది. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాడు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి సమక్షంలో సిద్ధరామయ్య స్వయంగా బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీ డిక్లరేషన్‌లోని అంశాలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నేటి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చదివి వినిపించారు.
అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన సగానికిపైగా హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. సీన్ కట్ చేస్తే, బీసీ డిక్లరేషన్ సభ జరిగిన నెల రోజులకే ప్రభుత్వం మార్చింది. బీసీ డిక్లరేషన్‌ను మూడు పేజీల్లో తీర్చిదిద్దారు. మొదటి పేజీని 10 బీసీ వర్గాలకు చెందిన కుల వృత్తుల ఫొటోలతో అందంగా తీర్చిదిద్దారు. 2వ పేజీలో రిజర్వేషన్లు, నిధులు, సంక్షేమం, విద్య, చేతి వృత్తులకు సాయం అంటూ అనేక హామీలను పొందుపర్చారు. అందులో మొదటిది రిజర్వేషన్లు. కులగణన, బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేష్లన్ల పెంపు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంపు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ వంటివి ఉన్నాయి.
రెండోది బీసీ సబ్‌ప్లాన్‌కు తగినన్ని నిధులు మంజూరుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు. బీసీ సంక్షేమానికి ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల కేటాయింపు.
మూడోది సంక్షేమం. ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కోసం కార్పొరేషన్ల ఏర్పాటు. బీసీ యువత చిరు వ్యాపారాల కోసం, ఉన్నత విద్య కోసం రూ. 10లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు. అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో ఓ కన్వెన్షన్ హాల్. ప్రెస్‌క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్ల తో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాల నిర్మాణం వంటివి ఉన్నాయి. నాలుగోది విద్య. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం. ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న బీసీ విద్యార్థులకు ర్యాంక్‌తో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.
ఐదోది చేతి వృత్తులకు సాయం. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి, నాయీబ్రాహ్మణులు, వడ్రంగి, రజకులు, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపుల స్థలాల అందజేత. గీత కార్మికులు, చేనేతలకు ఉన్నట్టుగా 50 ఏండ్ల వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి అన్ని చేతివృత్తుల వారికి వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సాయం.
ఇక మూడో పేజీలో కులాల వారీగా హామీలను బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పొందుపర్చింది.
1. ముదిరాజ్: జీవో నంబర్ 19/02/2009ను పునరుద్ధరించి ముదిరాజ్, ముత్రాసు, తెనుగు తదితర కులాలను బీసీ-డి నుంచి బీసీ-ఎ గ్రూపులోకి మార్చడం.
2. గంగపుత్ర: మత్స్యకార హక్కులకు, ఇతర మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం. ఇందుకోసం తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వా కల్చర్‌కు ప్రోత్సాహం. క్యాప్టివ్ సీడ్, నర్సరీలు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు వంటి ఏర్పాట్లు.
3. గొల్లకురుమలు: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ.
4. గౌడ: ఈత చెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ వాల్ నిర్మాణాలపై 90శాతం సబ్సిడీ. మద్యం దుకాణాల లైసెన్సుల్లో వారికి ప్రస్తుతం ఉన్న 15 శాతం రిజర్వేషన్ 25 శాతానికి పెంపు. జనగామ జిల్లాకు ‘సర్వాయి పాపన్నగౌడ్ జనగామ’ జిల్లాగా పేరు మార్పు.
5. మున్నూరు కాపు: తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు.
6. పద్మశాలి: జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు. పద్మశాలీలకు పవర్‌లూమ్స్, పరికరాలపై 90శాతం రాయితీ.
7. విశ్వకర్మ: నాయీబ్రాహ్మణులు, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగి, కుమ్మరులకు 90శాతం సబ్సిడీతో టూల్కిట్లు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు భూమి కేటాయింపు.
8. రజక: రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్రవ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునికీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు.
వాస్తవానికి బీసీ డిక్లరేషన్‌లో అనేక హామీలున్నాయి. అందులో బడుగు, బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్నది ఒకటి మాత్రమే. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ డిక్లరేషన్‌లో పొందు పర్చినట్టుగా రిజర్వేషన్లను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉండగా అదేమీ అమలు కాలేదు. కులగణనను తాపీగా చేపట్టారు. అరకొర సమాచారంతో వివరాలు ప్రచురించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధతను పక్కన పెట్టి పార్టీ పరంగా అవకాశాలు కల్పిస్తామంటూ తాజాగా చెప్తుండటంతో కామారెడ్డి డిక్లరేషన్‌కు అర్థం లేకుండా పోతున్నది. మరోవైపు ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లోనూ, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా అమలు ఊసేలేదు. ధోబీఘాట్లు పత్తా లేవు. 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అటకెక్కింది. ప్రధానంగా ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్లు వంటి కులాలను బీసీ-డి నుంచి బీసీ-ఎ గ్రూపులోకి మారుస్తామని పేర్కొన్నప్పటికీ ఈ అంశం ఇప్పుడు కనీసం ప్రస్తావనకు కూడా రావడం లేదు. పద్మశాలి కులస్థులకు పవర్ లూమ్ క్లస్టర్లు, మున్నూరు కాపు కార్పొరేషన్ల ఏర్పాటు ఊసే కరువైంది. బీసీ డిక్లరేషన్ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి, పీసీసీ ముఖ్యులంతా గొంతు చించుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తాను పోటీ చేసిన కామారెడ్డి గడ్డపై నిలబడి హామిలిచ్చిన బీసీ డిక్లరేషన్‌కు ఇప్పుడు దిక్కూదివాణం లేకుండా పోయింది.