విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీని కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా నానుతున్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మళ్లీ తెరమీదికి వచ్చింది. తెలంగాణకు న్యాయంగా, చట్టపరంగా సంక్రమించవలసిన బయ్యారం ఉక్కు పరిశ్రమను కేంద్రం గత ఎన్నికలకు ముందు గొయ్యి తీసి పాతేసింది. విభజన చట్టంలో కేంద్రం బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రకటించినప్పటికీ నాణ్యమైన ఇనుము కాదని, పరిశ్రమకు అవసరమైన స్థాయిలో నిల్వలు లేవని కుంటిసాకులు చెప్పి చేతులు దులుపుకొన్నది.
రాష్ట్రంలో ఏడాదిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లప్పగించి చూస్తున్నదే తప్ప బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఒక్క అడుగు ముందుకువేయలేదు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను, కార్యాచరణను రేవంత్ ప్రభుత్వం అటకెక్కించింది. విశాఖకు ప్రకటించినట్టే బయ్యారానికి ప్యాకేజీ ప్రకటించడని రేవంత్ ప్రభుత్వం గొంతెత్తలేదు. కేంద్రాన్ని నిలదీయనూ లేదు. బీజేపీ తరఫున రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మరో ఆరుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నప్పటికీ విశాఖ ప్యాకేజీ తరహాలో బయ్యారం ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీ సాధించలేదు సరికదా సాధ్యం కాదంటూ చావుకబురు చల్లగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొలువుదీరిన బీజేపీ, కాంగ్రెస్ అధినేతలే ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలి.
అరవై ఏండ్ల కిందట విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తలపెట్టినప్పుడు లాభదాయకం కాదని హిందుస్థాన్ స్టీల్ నివేదిక ఇచ్చింది. ఆ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతానికి అందుబాటులో ఇనుప ఖనిజాలు లేవు. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన అనుబంధ ఖనిజాలు దరిదాపుల్లో లేవు. ఉన్నదల్లా ఒక్కటే. అది నౌకాశ్రయం. ఆ ఒక్క కారణంతో ఏకంగా విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది. రూర్కెల (ఒడిశా) భిలాయ్ (మధ్యప్రదేశ్) అసన్సోల్ (పశ్చిమబెంగాల్) బొకారో (ఛత్తీస్‌గఢ్) ఉక్కు పరిశ్రమలు ఏర్పా టు కావడానికి అక్కడి ఖనిజ రవాణా సానుకూలతలే కారణం. అదే క్రమంలో కొత్తగా ఏర్పాటుచేసే ఉక్కు పరిశ్రమకు అన్ని అవకాశాలున్న బైలాదిల్లా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలి పోటీ పడినప్పటికీ అవకాశం దక్కించుకోవడంలో విశాఖ ముందు నిలిచింది. కార ణం నాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి కార్యదక్షత, తెన్నేటి విశ్వనాథం, తమనంపల్లి అమృతరావు ప్రభృతుల నాయకత్వంలో జరిగిన విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమం, 32 మంది అమరత్వం, ఆరేండ్ల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారమైంది. ఈ నేపథ్యంలో సమైక్య రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. రాష్ర్టాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని బ్రహ్మానందరెడ్డి నాటి ప్రధాని ఇందిరమ్మను హెచ్చరించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ పౌరుషం నేడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ నేతలకు అణుమాత్రమైనా లేకపోవడం శోచనీయం.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నేత కేసీఆర్ 2013లోనే బయ్యారం ఉక్కు అవసరాన్ని అవకాశాన్ని వివరిస్తూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ ద్వారా విన్నవించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు ‘బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు’ అంటూ నినదించారు.
స్వరాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా కేసీఆర్, పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీకి, ఉక్కు శాఖ మంత్రులకు ఎప్పటికప్పుడు విన్నవించారు. 2015లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నాటి కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పక్ష సభ్యులు బయ్యారం ఉక్కు కోసం గళమెత్తారు. వివిధ పార్టీల, సంఘాల దీక్షలు ధర్నాలు ఊరేగింపులు సభలు జరిగాయి. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం వేగం పెంచడంతో అవసరమైన భూమి మౌలిక సౌకర్యాలు సంబంధించిన కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అవసరమైతే రంగంలోకి దించడానికి సింగరేణి సంస్థను సమాయత్తం చేస్తూనే, పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి అవసరమైన ముడిసరుకు దిగుమతికి సర్రి పైప్‌లైన్ లేదా రైల్వే ట్రాక్ నిర్మాణం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
బయ్యారం ఉక్కు పరిశ్రమ కిషన్‌రెడ్డి అన్నట్టుగా ఉత్త పరిశ్రమ కాదు. ముమ్మాటికీ ఉత్తమ పరిశ్రమ. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ప్రజల చిరకాల వాంఛ. తెలంగాణ వరదాయిని. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ప్రస్తుత పాలకుల నిష్క్రియాపరత్వం వల్ల బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకోవడం ఒక పెను సవాల్‌గా ముందు నిలిచింది.
బయ్యారం పెద్ద చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతూ ఇంకా అవసరమైతే సమీపంలోని కిన్నెరసాని గోదావరి జలాలను వాడుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కేసీఆర్ ఎంతగా అర్థించినా ఆసక్తి ప్రదర్శించినా ఆర్థిక భారాన్ని మోయడానికి ముందుకు వచ్చినా కేంద్రం సహకరించలేదు. కమిటీల మీద కమిటీలు వేస్తూ, ఊరించే ప్రకటనలు చేస్తూ ఎనిమిదేండ్ల కాలయాపన చేసింది. చివరికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు సాధ్యం కాదని చేతులెత్తేశారు. అనంతరం 2023లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 2018లో బైలదిల్లా గనులు అదానీ హస్తగతమైనప్పుడే, ఆ తర్వాత గుజరాత్ పశ్చిమ తీరం ముంద్రాలో అదానీ ఉక్కు పరిశ్రమకు శ్రీకారం చుట్టినప్పుడే బయ్యారం భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. విభజన చట్టంలో లేని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన మోదీ ప్రభుత్వం, చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణకు దక్కకుండా అడ్డుపడింది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి మంత్రివర్గంలో మంత్రులుగా బయ్యారం ఉక్కు పరిశ్రమకు శ్రుతి కలిపిన జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, 2014-19 మధ్య ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా బయ్యారం ఉక్కు కోసం ఉద్యమించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడూ మంత్రులే. బయ్యారంతో సామీప్య అనుబంధం ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ మంత్రులే. కానీ, ఒక్కరూ నోరు విప్పడం లేదు. కేంద్రంపై ఒంటి కాలు మీద లేచి ఉద్యమించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. నమ్మి వారికి ఓట్లేసిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు దారుణంగా మోసపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన ఆ రెండు జిల్లాలే వంచనకు గురి కావడం విషాదం.
బయ్యారంలో లక్షన్నర ఎకరాల్లో రూ.16 లక్షల కోట్ల విలువైన ఇనుము సంపద ఉన్నదని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వెల్లడించింది. ఆ క్రమంలో 300 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. వివిధ గనులు భూగర్భ పరిశోధన సంస్థలు ఏవీ కూడా కిషన్ రెడ్డి లాగా బయ్యారం ఇనుము పనికిరాదని కొట్టిపారేయలేదు. నాణ్యమైన ఇనుము లభించని పక్షంలో పెల్లెట్ల (చిన్నపాటి ఇనుప గుండ్లు) పరిశ్రమ ఏర్పాటు చేయవచ్చునని మూడేండ్ల కిందటి నాటి కేంద్ర మంత్రి వీరేంద్ర సింగ్ స్వయంగా ప్రకటించారు. ఒకవేళ పరిశ్రమ ఏర్పాటుకు బయ్యారం ఇనుము సరిపోదనుకుంటే కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్‌గఢ్‌లో బైలదిల్లా గనులు ఉన్నాయి. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు అవసరమైనంత ముడిసరుకు సమకూరుస్తున్న బైలదిల్లా బయ్యారానికి సమకూర్చలేదా అన్నదే ప్రశ్న.
బయ్యారంలో ఇనుమే లేకపోతే, అది పనికిరాకపోతే సమీపంలోనే ఏపీ స్టీల్స్, స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ నవభారత్ ఫెర్రో అలాయ్, బేరియం కెమికల్స్ వంటి భారీ అనుబంధ పరిశ్రమలు దశాబ్దాల కిందటే ఎలా ఏర్పాటు అయినట్టు? ఉక్కు పరిశ్రమకు అత్యంత ఆవశ్యకమైన డోలమైట్ ఖనిజాన్ని బయ్యారం సమీపంలో ఉన్న మాదారం నుంచి 500 కిలోమీటర్ల దూరాన ఉన్న విశాఖకు రోజుకు 1,500 టన్నులు తరలించగలిగినప్పుడు, బైలదిల్లా ముడి ఇనుము బయ్యారానికి తరలించలేమా? ఎక్కడో 1800 కిలోమీటర్ల దూరంలో గుజరాత్లో ఏర్పాటైన అదానీ పరిశ్రమకు ముడిసరుకు సరఫరా చేయగలిగే బైలదిల్లా గనులు ఆ దూరంలో పదో వంతు కూడా లేని బయ్యారం ఉక్కు పరిశ్రమకు సరఫరా చేయలేవా? పైగా అత్యంత సమీపంలో గుం డ్రాతి మడుగు, కొత్తగూడెం, ఇల్లందు, మహబూబాబాద్ రైల్వేస్టేషన్లు ఉండనే ఉన్నాయి. ప్రత్యేకించి మహబూబాబాద్ మీదుగా వెళ్లే రైల్వే లైన్ ఉత్తర, దక్షిణాలకు అనుసంధానంలా ఉన్నది. కొత్తగూడెం, వరంగల్‌లో విమానాశ్రయాలు, కొత్తగూడెం-కొవ్వూరు, కొత్తగూడెం-కిరండల్, రామగుండం-మణుగూరు, రైల్వే లైన్ల నిర్మాణానికి సంకల్పించిన కేంద్రం బయ్యారం ఉక్కు పరిశ్రమను మాత్రం పక్కన పెట్టిందంటే అక్కడి ఖనిజ సంపదను ఇతర రాష్ర్టాలకు తరలించి తెలంగాణ ప్రజల నోట మట్టిగొట్టే మాయోపాయం తప్ప వేరు కాదు.
బయ్యారంలో ఏం లేకపోతే సమైక్య రాష్ట్రంలో పదకొండేండ్ల కిందటి వరకు ఆయా ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు, విశాఖ ఉక్కు పరిశ్రమకు అప్పగించే ప్రయత్నాలు ఎందుకు చేసినట్టు? ముడిసరుకు లేకపోతే, లాభదాయకం కాకపోతే ప్రైవేట్ సంస్థలు బయ్యారం కోసం ఎందుకు ముందుకు వచ్చినట్టు? సమైక్య రాష్ట్రంలో బయ్యారం పరిసరాల్లోని 56 వేల హెక్టార్ల భూమి ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం, 4 లక్షల టన్నుల ముడి ఇనుము తవ్వి తరలించడం నిజం కాదా?
బయ్యారం ఉక్కు పరిశ్రమ కిషన్‌రెడ్డి అన్నట్టుగా ఉత్త పరిశ్రమ కాదు. ముమ్మాటికీ ఉత్తమ పరిశ్రమ. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ప్రజల చిరకాల వాంఛ. తెలంగాణ వరదాయిని. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ప్రస్తుత పాలకుల నిష్క్రియాపరత్వం వల్ల బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకోవడం ఒక పెను సవాల్‌గా ముందు నిలిచింది. ఒక దశలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అడ్డుకున్నారు. 1960 దశకంలో జరిగిన విశాఖ ఉక్కు-ఆంధ్రా హక్కు ఉద్యమంలో తెలంగాణ బిడ్డలూ ప్రాణత్యాగం చేశారు. కనుక ఏపీ కూడా బయ్యారం పరిశ్రమకు మద్దతు తెలపాలి. తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు సైంధవ పాత్ర పోషించకుండా సహకరించాలి.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238