సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా పూలతో ఆ దేవుడిని పూజిస్తే, పూలనే దైవంగా భావించి పూజించే సంస్కృతి ఈ నేలది. ఆడబిడ్డలను దేవతామూర్తులుగా కొలుస్తుందీ గడ్డ. అలాంటి ఆడబిడ్డలు కొలిచే బతుకమ్మకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం తీసుకువచ్చారు కేసీఆర్. తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డను తన ఇంటి బిడ్డగా భావించారు. బతుకమ్మ సందర్భంగా నూతన వస్ర్తాలు ధరించి ప్రతీ ఇంటి ఆడబిడ్డ కళకళలాడాలని చీరె సారె ఇచ్చి గౌరవించారు కేసీఆర్. కానీ, కాంగ్రెస్ సర్కారు గత రెండేండ్లుగా బతుకమ్మ చీరలు ఇవ్వకుండా తెంలగాణ అస్తిత్వానికి అయిన బతుకమ్మను అవమానిస్తున్నది.
పండుగ పూట రాష్ట్ర ప్రభుత్వం అమ్మవార్లకు చీరె సారెలు సమర్పించడం తరాలుగా వస్తున్న ఆనవాయితీ. తెలంగాణలో జరుపుకొనే అతిపెద్ద పండుగల్లో బతుకమ్మ కూడా ఒకటి. తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డలను దేవతగా భావించిన కేసీఆర్ సర్కార్ తరఫున బతుకమ్మ చీరల రూపంలో సారెలను సమర్పించారు. 2017, సెప్టెంబర్ 27న సిద్దిపేటలో తొలిసారి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఆ ఏడాది సెప్టెంబర్ 30న దసరా పండుగకు ముందు మూడే మూడురోజుల్లో ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా రేషన్ షాపుల ద్వారా కోటి మంది ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేశారు. నాటినుంచి 2023 వరకు ఏడేండ్ల పాటు నిర్విరామంగా రేషన్‌కార్డులో పేరున్నా, లేకపోయినా 18 ఏండ్ల నుంచి పండు ముదుసలి దాకా అందరికీ ఏటా చీరెలను పంచారు కేసీఆర్. ఏటా రూ.370 కోట్లు కేటాయించి 100కు పైగా రంగు లు, 250కి పైగా వెరైటీలు, కండ్లు మిరుమిట్లు గొలిపే డిజైన్లతో పట్టును మించిన నేత చీరలను పంచేవారు. తద్వారా నేతన్నలకు ఉపాధి కల్పించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టబోయే బిడ్డ నుంచి గిట్టబోయే ముసలొళ్ల వరకు అందరికీ 420 హామీలిచ్చిన కాంగ్రెస్ బతుకమ్మను వదల్లేదు. కేసీఆర్ సర్కార్‌ను మించి ఒకటికి రెండు చీరలిస్తామని వాగ్దానం చేసి నేడు నిండాముంచింది. రెండు చీరల సంగతేమో గానీ ఒక్క చీరకూ దిక్కు లేదు ఇప్పుడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది రెండో బతుకమ్మ. చావు కబురు చల్లగా చెప్పినట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలు పంచడం లేదని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
వాస్తవానికి 2023లో బతుకమ్మ పండుగ తర్వాత అంటే, డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కింది. అప్పటినుంచి 2024 బతుకమ్మ దాదాపు ఏడాది సమయం ఉంది. కానీ, ఒడ్డుకు చేరాక తెప్ప తగలేసే అలవాటున్న కాంగ్రెస్ బతుకమ్మలకు ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. పుణ్యకాలం కాస్త గడిచిపోయాక గతేడాది చీరలు ఇవ్వకుండానే, బతుకమ్మ చీరల పథకానికి ఇందిరమ్మ తోకను తగిలించారు. ఈ ఏడాది మొదటినుంచీ హడావుడి చేశారు. రేషన్‌కార్డుల ప్రకారం కాకుండా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ ఒకటి కాదు, రెండు చీరలు ఇస్తామని గప్పాలు కొట్టారు కాంగ్రెస్ పాలకులు.
రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది సభ్యులుండగా, సెర్ప్ ద్వారా 65 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చినట్టు చెప్పా రు. ఒక్కో చీరను రూ.800 వెచ్చించి నాణ్యతతో తయారు చేయిస్తున్నట్టు గొప్పలకు పోయారు. దసరాకు ముందే సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు చీరలను పంపిణీ చేస్తామని కూడా కాంగ్రెస్ పాలకులు చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కాకుండా మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపి ణీ చేస్తామన్నారు. కానీ, బతుకమ్మ అయిపోతున్నా ఒక్కటంటే ఒక్క చీర ఇవ్వలేదు తెలంగాణ ఆడబిడ్డలకు.
గత బీఆర్ఎస్ సర్కారు ఒక్కరినీ విస్మరించకుండా ప్రతీ ఆడబిడ్డకు ఒక్కో చీర చొప్పున సుమారు కోటీకి పైగా చీరలను పంపిణీ చేసింది. కానీ, కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారు ఒక్క చీర ఇవ్వకముందే సగం మంది మహిళలకు కుచ్చుటోపీ పెట్టింది. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఇస్తామని ప్రకటించి, అందులో సభ్యత్వం లేని యువతులకు మొండిచెయ్యి చూపింది.
గతంలో ఇచ్చినట్టే కోటి చీరలనే ఇస్తానని చెప్తూనే, ఒక్కొక్కరికీ రెండు చీరలు ఇస్తానని పోజులు కొట్టింది. చివరికి అవి కూడా ఇవ్వలేదు. నిజానికి, ఒక్కో సభ్యురాలికి రెండు చీరలు ఇవ్వాలంటే సుమారు 1.30 కోట్ల చీరలకు ఆర్డర్లు ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ సర్కారు 65 లక్షల చీరలే ఆర్డర్లు ఇచ్చింది. దీన్నిబట్టి రేవంత్ సర్కారు నైజం ఏమిటో అర్థమవుతున్నది. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది కాబట్టి, నాలుగు రోజులు అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నామని హడావుడి చేస్తారు.
ఆ తర్వాత గత రెండేండ్లుగా చేస్తున్నట్టే యథావిధిగా మర్చిపోతారు. ఇప్పటికే రెండేండ్లు గడిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారు ఉండేది ఇంకా మూడేండ్లే. ఈ మూడేండ్లలో అయినా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ చీరలకు నోచుకుంటరో లేదో? అయినా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను మాయంజేసిన నాడే అర్థం జేసుకోవాల్సింది కాంగ్రెస్ వాళ్లు చీర కాదు కదా, దారం పోగు కూడా ఇవ్వరని.
(వ్యాసకర్త: మాజీ జడ్మీ చైర్పర్సన్, కరీంనగర్)
-తుల ఉమ