బంగ్లాలో రాజకీయ తుఫాను చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వం పతనమై వందరోజులు దాటింది. ఈ వంద రోజుల్లో భారత్‌తో సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మైనారిటీ హిందువులపై పెరుగుతున్న దాడులు ఈ పరిస్థితికి కారణమని చెప్పాలి. అంతర్జాతీయ కృష్ణచైతన్య సంస్థ బంగ్లాదేశ్ విభాగం మాజీ సభ్యుడైన చిన్మయకృష్ణ దాస్‌ను ఇటీవల రాజధాని ఢాకాలో దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేయడం దీనికి పరాకాష్ఠ. మతోన్మాద శక్తులు హిందువులపై దాడులకు తెగబడుతుండటాన్ని ప్రశ్నిస్తున్న దాస్‌ను ప్రస్తుత బంగ్లా పాలకులు లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్ర అభియోగాలతో ఆయనను జైల్లో పెట్టడమే కాకుండా న్యాయ సహాయం అందకుండా చేయడం ఆందోళన కలిగిస్తున్నది.
హిందువులతో సహా మైనారిటీలు అందరినీ కాపాడాల్సిన బాధ్యత తాత్కాలిక బంగ్లా సర్కారుపై ఉన్నదని భారత్ గుర్తుచేసింది. అయితే ఈ నిరసనలను, నివేదనలను బంగ్లాదేశ్ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నిజానికి అధికార మార్పిడికి దారితీసిన ఆగస్టు సంక్షోభ కాలంలోనే హిందువులపై మెజారిటీ వర్గీయులైన ప్రజలు అమానుషమైన దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత కూడా చెదురు మదురుగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి భారత్‌లో పంపిణీ అవుతున్న సమాచారాన్ని రాజకీయ ప్రచారంగా తాత్కాలిక పాలకుడైన యూనుస్ కొట్టిపారేయడం గమనార్హం.
భారత్ అనుకూల నేతగా పేరున్న షేక్ హసీనాను గద్దె దించడంలో పాక్, చైనా అనుకూల శక్తులు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ శక్తులే ఇప్పుడు సైన్యం వత్తాసుతో యూనుస్‌ను ముందు పెట్టుకొని తమ ఎజెండాను అమలుచేస్తున్నాయి. ఆ ఎజండాలో భారత వ్యతిరేక ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్‌పై యుద్ధం సాగించి మహోన్నత త్యాగాలు చేసిన భారత్‌కు ఇది బాధాకరమైన విషయమే. ప్రస్తుతం మన దేశంలో తల దాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని యూనుస్ జారీచేస్తున్న తాఖీదులు హద్దులు మీరిన ప్రవర్తనగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్నికైన దేశాధినేత కాదు. అంతర్గత, విదేశీ వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు లేదనేది తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం మినహా మరే పెద్ద బాధ్యతలు ఉండకపోవడం ఆచారంగా వస్తున్నది. కానీ, యూనుస్ ప్రభుత్వం అలాంటి ఉద్దేశమేదీ తనకు లేనట్టుగానే వ్యవహరిస్తుండటం ప్రమాదకరం. నాలుగేండ్ల వరకు తాత్కాలిక ప్రభుత్వం కొనసాగవచ్చని ఆయన విపరీత భాష్యాలు చెప్తున్నారు. గత మూడు ఎన్నికలు (2014, 2018, 2024) అవకతవకలు, బహిష్కరణలతో విమర్శలను ఎదుర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు సజావుగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశ సమస్యలను ఎదుర్కోవడంలో తాత్కాలిక ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రజలు భావిస్తున్నారు. అల్లకల్లోలమై అరాచకానికి నెలవుగా మారిన బంగ్లాదేశ్‌లో శాంతి, సామరస్యాలను వీలైనంత త్వరలో పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే ప్రస్తుత సమస్యలకు పరిష్కారం. దేశ భవితవ్యాన్ని నిర్ణయించే బాధ్యతను ప్రజా ప్రభుత్వానికి అప్పగించి పక్కకు తప్పుకోవడమే తన కర్తవ్యమని యూనుస్ ప్రభుత్వం గుర్తించాలి. ఇందుకు అంతర్జాతీయ ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్ దౌత్యపరంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది.