తెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు భవిష్యత్తుకు శాశ్వత సమాధి కట్టే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు చంద్రబాబు మెహర్బానీ కోసం తెలంగాణను బనకచర్ల బలిపీఠంపై నిలబెట్టారు. ఒక్కసారి గనక రెండు రాష్ర్టాల మధ్య ఒప్పందం జరిగిపోతే తెలంగాణ ప్రజలకు గోదావరి నీళ్లు ఎండమావులు అవుతాయి.‘తలాపున పారుతుంది గోదారి నీ చేను నీ చెలుక ఎడారి’ అంటూ ఉద్యమ సమయంలో పాడుకున్న పాట మళ్లీ తెలంగాణలో ప్రతిధ్వనించే రోజులొస్తాయి.
ఢిల్లీలో ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల జలవనరులకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సమక్షంలో ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ సందర్భంగా అసలు బనకచర్ల ఎజెండాలో లేనప్పుడు చర్చ ఉత్పన్నం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పగా, చర్చ జరిగిందని బనకచర్ల ఆంధ్రప్రదేశ్ వరదాయిని కానున్నదని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించడంతో తెలంగాణ ప్రజలు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ బనకచర్ల చర్చ ఉదంతాన్ని దాచిపెట్టడమే కాకుండా, వారికి వంతపాడే పత్రికల్లో చర్చ జరిగిన వార్త రాకపోవడం వెనక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది.
బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు హెచ్చరించే వరకు మొద్దు నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చర్చల్లో బనకచర్ల అంశం చోటు చేసుకుంటే ఆ సమావేశానికి వెళ్లబోమని బీరాలు పలికారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనీయమని జబ్బలు చరిచారు. అప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సగం దూరం వెళ్లిపోయారు. కేంద్రంతో ‘లేనా దేనా’ సంప్రదింపులు జరిపేశారు. బనకచర్ల ఆగేంత వరకు సమావేశానికి ససేమిరా అనాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పరివారం పిలిచిందే తడవుగా సమావేశానికి వెళ్లిపోయారు. చంద్రబాబును చూడగానే చేష్టలుడిగి చల్లబడ్డారేమో కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపి బయటకు వచ్చేశారు. తెలంగాణ జుట్టు కమిటీ చేతికి ఇచ్చేశారు.
గోదావరి జలాలపై సంపూర్ణ ఆధిపత్యం కోసం చంద్రబాబు కుట్రలకు తెరలేపితే మన ప్రభుత్వాధినేతలు యథోచితంగా సహకరిస్తున్నారు. అందులో భాగంగా మేడిగడ్డను నిరుపయోగంగా మార్చి గోదావరి జలాలు రాష్ట్ర సరిహద్దులు దాటడానికి గేట్లు బార్లా తెరిచారు. కేసీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ తరఫున తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు, అడ్డంకులు సృష్టించిన ఐఏఎస్ అధికారి తెలంగాణ జలవనరుల సలహాదారుగా నియమితుడయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం వ్యక్తంచేస్తూ చంద్రబాబు రాసిన లేఖలను రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. బనకచర్లను వ్యతిరేకిస్తూ ఒక్క ధర్నా చేయలేదు. పైగా ఏదో ఘనకార్యం సాధించినట్టుగా శాలువాలు కప్పుకొని, దండలు మార్చుకొని చంద్రబాబుపై దండకాలు వల్లించి వచ్చారు.
తరతరాలకు జీవనాధారమైన నదీ జలాల విషయంలో రాష్ర్టాలు ఎంతో పట్టుదలగా ఉంటాయి. రాజకీయాలను పక్కనపెడతాయి. కావేరి జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక; యమునా జలాల విషయంలో పంజాబ్, హర్యానా.. ఇలా దేశంలో వివిధ రాష్ర్టాలు తమ వాటా కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. దురదృష్టమేంటంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆ జవసత్వాలు లేవు. చంద్రబాబును, మోదీని ఎదిరించి నిలిచే ధైర్యసాహసాలు లేవు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఏడాదిన్నర కాలంలో రేవంత్‌రెడ్డి తానా అంటే బీజేపీ తందానా అనడం. రేవంత్‌కు మోదీ బడే భాయ్. చంద్రబాబు గురువేనాయే. బనకచర్ల అక్రమ ప్రాజెక్టు అని తెలిసీ, తెలంగాణ వాటాలు, హక్కులు చట్టపరంగా సంక్రమించే వరకు బనకచర్ల ప్రక్రియ నిలిపివేయాల్సిందేనని తెలిసీ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా చంద్రబాబుకు జై కొట్టడం వెనక దాగిన గూడుపుఠాణి ఏమిటంటే.. తెలంగాణ నష్టపోయినా పర్వాలేదు కానీ, తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకున్న బీఆర్ఎస్ను లేకుండా చేయాలి.
ఇటీవల పరిణామాలను చూస్తుంటే తెలంగాణకు ఏదో పెను ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సాంస్కృతిక వేదికలు, పురస్కారాలు, విగ్రహాల ఏర్పాట్లు, స్మారక కేంద్రాలు, పాఠ్యాంశాలు.. ఇలా ఒక్కొక్క రంగంలో క్రమక్రమంగా తెలంగాణ వెలుగులు మసకబారిపోతున్నాయి. చంద్రబాబు సూత్రధారిగా బీజేపీ, కాంగ్రెస్ పాత్రధారులుగా ఒక నాటకానికైతే తెరలేచింది. దొంగ చేతికి తెలంగాణ తాళం చెవి చిక్కింది. మోదీని రేవంత్‌రెడ్డి నిలదీయలేరు. చంద్రబాబును మోదీ ఏమనలేరు. ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఆడింది ఆట, పాడింది పాటలా సాగుతున్నది. నీటి దొంగల నిజ స్వరూపం ఢిల్లీలో బట్టబయలైంది. తెలంగాణ ప్రజలకు బనకచర్ల గండం పొంచి ఉంది. నీళ్ల కోసం ప్రజలు మరొక్కసారి ఉద్యమించే సమయం ఆసన్నమైంది.