‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. ప్రజల కోసం చేపట్టే ప్రాజెక్టే అయితే ఆ ప్రజలను సంప్రదించరేం? ఇంత రహస్యం ఎందుకు? ఏ లక్ష్యం లేని ప్రాజెక్ట్ కోసం ప్రజాధనం వృథా చేయడం తప్పు. నదిని ఆక్రమించే అధికారం ఈ అధికారులకు లేదు. కూల్చే అధికారం అసలే లేదు. సబర్మతీ నదీ తరహా పునర్జీవనం మూసీకి పనికి రాదు. గ్లోబల్ సిటీ కొత్తగా చేసేదేమిటి? మా హైదరాబాద్ వందల ఏండ్ల కింద గ్లోబల్ సిటీ. నిజాం చేపట్టిన మూసీ సుందరీకరణే అసలైనది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుందరీకరణలో మూసీ నది తప్ప అన్నీ ఉన్నాయ్. మూసీ పునరుజ్జీవనం అంటే నదితో ప్రజలకు అనుబంధాన్ని పునరుద్ధరించడం. ఇండ్లు కూల్చి పారదోలడం కాదు’ అంటున్నారు భూగర్భ జల పరిశోధకుడు, అర్బన్ హైడ్రాలజిస్ట్ బలిజేపల్లి వెంకట సుబ్బారావు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైదరాబాద్ ప్రజలే కాదు. మూసీని, నగర జీవితాన్ని ఇష్టపడేవాళ్లు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు స్పందిస్తున్నారు. ప్రభుత్వానికి వారి విజ్ఞప్తులు వినిపించడం లేదు. అయినా సరే ప్రజల కోసం నిలబడి మాట్లాడుతూనే ఉన్నారు అస్లీ హైదరాబాదీ, కేంద్ర భూగర్భజల సంస్థలో సేవలందించిన విశ్రాంత ఇంజినీర్ అయిన బీవీ సుబ్బారావు.
మూసీ ప్రాజెక్ట్ ప్రకటనల్లోని డొల్లతనం, పాలకుల అహంభావం, తెలివి తక్కువ నిర్ణయాలు, ప్రమాదకరమైన పోకడలను ఆయన మొదటి నుంచీ నిరసిస్తున్నారు. మూసీ నదితో ప్రజలను అనుసంధానించడం, నదితో ప్రజల అనుబంధాన్ని పునరుజ్జీవింపజేయడం, సుందరీకరణను అభివృద్ధికి జోడించడమే నిజమైన పునరుజ్జీవనం అంటున్న ఆయన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూసీ చుట్టూ ఉన్న చారిత్రక, సామాజిక, ఆర్థిక విశేషాలెన్నో పంచుకున్నారు.
సియోల్, సబర్మతి మరేదైనా నగరం పేరు చెప్పండి. నదుల పునరుజ్జీవనం పేరుతో వాటి సహజత్వం ధ్వంసమైంది. ఆ నదులు వంపులు లేకుండా ప్రవహించేలా ఇరువైపులా నిర్మాణాలు చేపట్టారు. ఇది నదీ స్వరూపాన్నే కాదు.. సహజత్వాన్ని నాశనం చేసింది. నది అంటే నీళ్లే కాదు.. జీవ కోటి కూడా. నాచు, మొక్కలు, చెట్లు, జంతువులు ఆ నదిని ఆసరా చేసుకుని పెరుగుతాయి. మూసీ ప్రాజెక్టులో నది తప్ప అన్ని విషయాలూ ఉన్నాయి. అదే విషాదం.
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ‘మూసీ ప్రక్షాళనా? మూసీ సుందరీకరణా?’ అనే దానిపైనే నేటికీ స్పష్టత లేదు. సుందరీకరణ అయినా, పునరుజ్జీవనం అయినా దానికి కొన్ని లక్ష్యాలు ఉండాలి. చేపట్టే పనులు ఆ లక్ష్యాల కోసం, లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అని సమాజంలో చర్చ జరగాలి. దీనికి ఓ డీపీఆర్ లేదు. కనుక ఎలాంటి చర్చా లేదు. ప్రభుత్వం ప్రాజెక్ట్ లక్ష్యం, చేపట్టే పనులు, ఎక్కడ ఏ విధంగా నిర్మాణాలుంటాయో ప్రజలకు చెప్పలేదు. మూసీ నదీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి కన్యూజన్తోనే ఉంది. సుందరీకరణో, పునరుజ్జీవనమో ఇంకా స్పష్టత లేదు. కానీ, ఈ రెంటికి మధ్య రియల్ ఎస్టేట్ పుట్టుకొస్తోంది! ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఉంది. ప్రజల నుంచి వచ్చే విమర్శలను రాజకీయ విమర్శలుగా దారి మళ్లిస్తున్నారు. ఒకరినొకరు విమర్శించుకోవడంతోనే చర్చలు ముగుస్తున్నాయి. ఇందులో ప్రజల భాగస్వామ్యం లేదు. అందువల్ల అసలు విషయాలు చర్చకు రావట్లేదు. మూసీ తెలంగాణలో పుడుతుంది. తెలంగాణలోనే ప్రవహిస్తుంది. కాబట్టి దీనిపై ఏది చేయాలన్నా ఇతర రాష్ర్టాల అనుమతులు అవసరం లేదు. అయినా..ఎందుకు ఇంత రహస్యం. ఇన్ని తర్జనభర్జనలు అవసరమా?
నగరాలు విస్తరించడం వల్ల నదులు కుంచించుకుపోయాయి. వాటికి పునరుజ్జీవనం, సుందరీకరణ అవసరమే. కానీ, సబర్మతిలాగా మూసీని మారుస్తామనడం సరైన నిర్ణయం కాదు. ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. నదుల పక్కన నగరాలున్నాయి. ఢిల్లీ, వారణాసి, విజయవాడ.. మొదలైన నగరాలన్నీ నదులపై ఎదిగినవే. అలాగే మూసీపై హైదరాబాద్ ఎదిగింది. మూసీకి ఓ ప్రత్యేకత ఉంది. ఓ చరిత్ర ఉంది. అది అధికారులకు తెలియదు. షియాంగ్చెన్, థేమ్స్, సబర్మతి నదులకు మూసీకి సంబంధం లేదు. కాబట్టి పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. సియోల్, లండన్, అహ్మదాబాద్ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి చెబుతున్నారు. కానీ, అక్కడ దుర్వాసన వస్తున్నది. దగ్గరికిపోయి కాసేపు ఉండలేరు. ఆ నీళ్లు తాగలేరు. హైదరాబాద్ చరిత్ర, మూసీ ప్రత్యేకత తెలియని అధికారుల సలహాలతో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం బాగా లేదు.
నగరవాసులను ప్రతిరోజూ నది ఒడ్డుకు తీసుకుపోవాలని నిజాం పాలకులు కోరుకున్నారు. అందుకే మూసీ ఒడ్డున ల్యాండ్ స్కేప్‌లు పెంచారు. నిజాం ప్రభుత్వం 1908లో వచ్చిన వరదల తర్వాత హైదరాబాద్ సుందరీకరణలో మూసీనీ సుందరీకరించింది. మూసీ ఒడ్డున 14 ఉద్యానవనాలు (ల్యాండ్ స్కేప్‌లు) నిర్మించింది. ప్రఖ్యాత ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ సర్ మీర్జా అలీ ఆ ల్యాండ్ స్కేప్ల నిర్మాణం చేపట్టారు. జనం ప్రతిరోజూ సాయంత్రం మూసీ ఒడ్డకు పోయేవాళ్లు. నన్నూ మా అమ్మ వెంటబెట్టుకుని ల్యాండ్ స్కేప్కి తీసుకుపోయేది. జనం రేడియో ప్రసారాలు వినేందుకు సాయంత్రం ఆరు గంటలకు పార్కులకు వచ్చేవాళ్లు. ప్రజలను పార్కులకు రప్పించేందుకు నగర ప్రముఖులను సత్కరించే కార్యక్రమాలూ నిర్వహించేవారు. అఫ్జల్‌గంజ్‌లో (ఉస్మానియా దవాఖాన ఎదురుగా) మొదటి ల్యాండ్ స్కేప్ ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ ఉంది. చిక్కడపల్లిలో చివరి ల్యాండ్ స్కేప్ ఉండేది. అది ఆనవాళ్లు కూడా కోల్పోయింది. మిగతా వాటి పరిస్థితీ ఇంతే.
ఇది నది చుట్టూ వెలిసిన నగరం. మూసీ ప్రాజెక్ట్‌లో నది ఉండాలి. నదితోపాటు ప్రజలూ ఉండాలి. మూసీని ప్రక్షాళన చేసినా, సుందరీకరించినా దానిని అభివృద్ధికి జోడించాలి. ప్రజలను నదిని అనుసంధానిస్తూ కాలుష్య నియంత్రణ, వరదల నివారణ లక్ష్యంగా పెట్టుకోవాలి. చేసే పని పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే నదిని అర్థం చేసుకోవాలి. నదికి, నగరవాసులకు సహజీవన సంబంధం ఉన్నది. చరిత్రలో మూసీ నదితో ప్రజలకు ఎలాంటి సంబంధం ఉందో ప్రక్షాళన తర్వాత అది పునరుద్ధరణ జరగాలి. అదీ అభివృద్ధి అంటే! ఇవేవీ మూసీ పునరుజ్జీవన లక్ష్యాల్లో లేవు. విగ్రహాలు, థీమ్ పార్కులు, రోడ్లు, స్కైవేల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.
నది అనంతగిరి కొండల్లోని ఊటలు, చెలిమలు ప్రవాహాలుగా మారడం వల్ల మూసీ పుట్టింది. అనంతగిరుల్లో ఊటలు, చెలిమలు కాపాడుకోవడంతోనే మూసీ పునరుజ్జీవనం మొదలుకావాలి. అక్కడి పచ్చని అడవే నదికి మూలం. మొదట ఆ అడవిని కాపాడుకోవాలి. ఆ అడవికి రక్షణ లేదు. నావల్ రాడార్ కోసం వేల ఎకరాలు ప్రభుత్వమే ధారాదత్తం చేసింది. అదే ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం అంటున్నది! ఎలా నమ్మాలి? మూసీ నది ప్రవాహ దూరం 140 కిలోమీటర్లు. అందులో కేవలం 52 కిలోమీటర్లే పునరుజ్జీవనం చేపట్టడం హేతుబద్ధంగా లేదు. హైదరాబాద్‌కు ఎగువన, దిగువన కూడా పునరుద్ధరణ చేపట్టాలి. నది చరిత్ర నగర ప్రజలకు తెలియజేసేలా పాత కట్టడాలను పునరుద్ధరించాలి. పబ్లిక్ స్పేస్‌ని నదికి ఇరువైపులా క్రియేట్ చేయాలి? నది ఉప్పల్ దాటే లోపు పూర్తిగా శుద్ధి చేసిన జలాలతో కిందికి ప్రవహించాలి. ఈ ఆలోచనే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులకు లేదు. కేవలం 52 కిలోమీటర్లే అని ఆలోచిస్తున్నారు. పెద్ద లక్ష్యం పెట్టుకుని దేశానికి మార్గదర్శనం చేయొచ్చు కదా. నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తే ప్రపంచ స్థాయిలో పేరు వస్తుంది. అప్పుడు సబర్మతి, థేమ్స్, సియోల్, అహ్మదాబాద్ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అందరూ మూసీ పేరే చెప్పుకుంటారు. హైదరాబాద్‌నే మెచ్చుకుంటారు.
నదితో ప్రజలున్నారన్నదే నిజం. మిగతావన్నీ అబద్ధం. నదిలో ఇండ్లు ఉన్నాయనడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఇండ్లకు రివర్ బెడ్ మార్కింగ్ చేయడానికి వీళ్లెవరు? మున్సిపల్, హెచ్ఎండీఏ, హైడ్రాకు నదీ ప్రవాహాన్ని అంచనా వేసే అధికారమే లేదు. నదీ ప్రవాహాన్ని అంచనా వేసే అధికారం ఒక్క సీడబ్ల్యూసీకే ఉన్నది. ఆ సంస్థ ఇప్పటికే చేసి ఉంటే నివేదిక బయటపెట్టాలి. చేయకపోతే చేస్తామనైనా చెప్పాలి. వరదలను అధ్యయనం చేయకుండా, అంచనాలు లేకుండా ఇండ్లు ఎట్లా కూల్చుతారు? ఇప్పటి వరకు మూసీ వరద ఉధృతి నదికి ఎంతదూరం వరకు వస్తుందో అంచనా వేయలేదు. ఒకరోజు నది ఒడ్డు (రివర్ బౌండ్)కు తొమ్మిది మీటర్లు, ఇంకో రోజు అర కిలోమీటర్ అంటారు. అధికారుల అంచనాలు సరిగా లేవు. నది ఒడ్డు మీద వరద అంచనా వేయడం అవసరం. 1908 నుంచి వరదల రికార్డులు ఉన్నాయి. వాటి నుంచి లెక్కలు తీయండి. అధ్యయనం చేయండి. లేని అధికారాలతో నదిని ఆక్రమించారని చట్టాలను అతిక్రమించడం తప్పు.
మూసీ వరద ప్రమాదకరమైంది కాదు. వరద ఉధృతంగా వస్తే దోబీఘాట్లు మునుగుతాయి. కానీ ఇండ్లకేమీ కాదు. ఎక్కడి నీటిని అక్కడ కట్టడి చేసే గొలుసుకట్టు చెరువులు ఇంతకాలం కాపాడాయి. ఇప్పుడవి లేకనే సమస్య తప్ప, మూసీ సమస్య కాదు. ఆ గొలుసుకట్టు చెరువులను కాపాడితే వరద ముప్పు ఎన్నటికీ రాదు. చాలా చెరువుల మత్తడులను కూలగొట్టారు. హస్మత్‌పేట చెరువు, ఎల్లమ్మ చెరువు ఇట్లా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. సిటీలో మత్తడులు కూలగొట్టాల్సిన చెరువులు నేనే ఇరవై దాకా చూశాను. చూడనివి ఇంకెన్ని ఉన్నాయో?
ఒక ప్రాజెక్ట్ కోసం భూమి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నది. ప్రజా హితం కోసం మాత్ర మే ప్రభుత్వాలకు ఆ హక్కు ఉంటుంది. బంజారాహిల్స్‌లో రోడ్డును విస్తరించాలని ప్రభుత్వం అనుకున్నది. కొంతమంది కోర్టుకుపోతే కిమ్మనకుండా నోరు మూసుకున్నది. అక్కడ ప్రజల అవసరాల కోసం రోడ్డుకు ఇరువైపులా స్థల సేకరణ చేపట్టవచ్చు. అడ్డుకున్న వాళ్ల దగ్గర ఈ జీరో వాల్యూ మాటలు లేవు. మధుపార్క్ రిట్జ్ అపార్ట్మెంట్కే జీరో వాల్యూ ఉంటుందా? ఆ స్థల సేకరణ వల్ల ప్రజలకు కలిగే మేలేమన్నా ఉన్నదా? విస్తరిస్తున్న నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. వరద ప్రవాహానికి కాలువలు లేవు. డ్రైనేజీ లేకుండానే హైటెక్ సిటీని విస్తరించారు. బస్తీలకు సరైన పైప్లైన్లు లేక నీళ్లు అందట్లేదు. వీటి నిర్మాణం చేపట్టాలి. వీటి కో సం ప్రజలు త్యాగాలు చేయాలి. కానీ లక్ష్యమే లేని ప్రాజెక్ట్ కోసం మధుపార్క్ రిట్జ్ అపార్ట్మెంట్ నివాసితుల్ని త్యాగం చేయమనడం తెలివితక్కువ ఆలోచన. నిరుపయోగ ప్రాజెక్ట్ కోసం సామాన్యులను నిర్వాసితులను చేయడం అన్యాయం.
సహజమైన నీరు ప్రవహిస్తేనే నది జీవిస్తుంది. ఎత్తిపోతల నీళ్లు పారిస్తే మూసీ మరణిస్తుంది. అప్పుడది ఓ కాలువగా మారిపోతుంది. ఒకప్పటి నదికి ఆనవాలుగా మిగిలిపోతుంది. గోదావరి నీళ్లు మూసీలో పారిస్తే.. వాన నీళ్లు ఎటుపోవాలి? అప్పుడు నగరానికి వరద ముంపు సమస్య పెరుగుతుంది? గోదావరి నీళ్లతో చెరువులను నింపడం వల్ల వరంగల్ నగరం వరద ముప్పుని ఎదుర్కొన్న అనుభవాలను చూశాం. చెరువులు సహజంగానే వాటి పరిధిలోనే వర్షపు నీటిని నిలుపుకుంటాయి. అవి మనల్ని వరదల నుంచి కాపాడతాయి. చెరువులు కూడా ఆపలేనంత వరద వస్తే నది కాపాడుతుంది. కానీ, ప్రభుత్వం ఆ నదిని వేరే నీటితో నింపుతానని అంటున్నది. మరి ఈ నదీ పరీవాహంలోని వరద ఎటు పోవాలి? మళ్లీ ఇండ్ల మీదకేగా? ఎటు తిరిగీ కొంపలు ముంచుడేనా?
‘ట్రాఫిక్ తగ్గిస్తాం, గ్లోబల్ సిటీని చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, నైట్ ఎకానమీ పెంచుతాం’ అంటూ రోజుకో తీరుగ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కానీ, ఇందులోని ముఖ్య ఉద్దేశాలను చెప్పట్లేదు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో కాగితాలపై స్పష్టంగా చూపట్లేదు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశాలు ప్రజలకు తెలియజేయాలి. అది జరుగకపోతే ఈ ప్రాజెక్ట్ అర్ధంతరంగా ఆగిపోతుంది. అసంపూర్తిగా మిగిలిపోవడమే కాదు. ప్రజాధనం కూడా వృథా అవుతుంది.
చరిత్రలో ముత్యాల నగరంగా శతాబ్దాలపాటు ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత హైటెక్ సిటీగా ఎదిగింది. ఇది ఎప్పటి నుంచో గ్లోబల్ సిటీ. ఈ నగర సమాజం గ్లోబల్ సొసైటీ. ఇక్కడ అనేక జాతులు, తెగలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పార్సీలు, సింధీలు, అరబ్బులు, అఫ్ఘాన్లు, ఆఫ్రికన్లు ఖండాంతరాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. మొఘల్ పాలకులు ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన వచ్చిన బొహారా తెగ బార్కాస్‌లో శతాబ్దాల నుంచి ఉంటున్నది. నిజాం కాలంలో వలస వచ్చిన అబ్సీనియన్లు ఏసీ గార్డ్స్, హబ్సిగూడలో నివసిస్తున్నారు. బంజారాలు, సిక్కులు, కాయస్థలు, బెంగాలీలు, ఆంగ్లో ఇండియన్స్, తమిళులు, కేరళీయులు స్వాతంత్య్రానికి పూర్వమే తెలంగాణ సమాజంలో భాగమయ్యారు. ఈ నది చుట్టూ బహుళ భాషల సంస్కృతి విలసిల్లుతున్నది. ఎప్పుడో గ్లోబల్ సిటీగా ఎదిగిన హైదరాబాద్ ఇమేజ్‌ని కొత్తగా పెంచేదేమీ లేదు. అవన్నీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌ని పెంచుకునే మాటలు.