తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే. వీరిని సంపదకు, సంస్కృతికి, నాగరికతకు, ఉత్పత్తికి దూరంగా నెట్టివేశారు. మానవ సమాజ అభివృద్ధికి మూలమైన భూమి నుంచి కూడా వీరిని దూరం చేశారు. కాబట్టే వీరి కోసం రిజర్వేషన్లు కల్పించారు. అయితే, ఆ ఫలాలను ఎవరెంత ఉపయోగించుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న.
రిజర్వేషన్ల ఫలాలు దక్కని వారి పరిస్థితి ఏమిటి? వారి కోసం మనం ఏం చేయాలి? ఆకలి, అవమానం, దుఃఖంతో ఉన్న జాతులకు న్యాయం ఎవరు చేయాలో ఆలోంచాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే కాదు, మనది కూడా. వర్గీకరణతో ఎస్సీల్లో ఉండే 59 కులాలకు లబ్ధి చేకూరుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే కొందరు మాలలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరు చదువుకొంటే వారికే రిజర్వేషన్లు వస్తాయనుకుంటే, ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పిస్తే వచ్చే నష్టం ఏముంది?
బుద్ధుడు, మార్క్స్, అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. మరి ఆచరణ ఏదీ? సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజంగా వర్గీకరణ మీద చిత్తశుద్ధి ఉంటే వారిపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారు.
మాల మాదిగల మధ్య అగాధం పెంచుతున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా దానికి ఫుల్స్టాప్ పెట్టాలి. 2004లో వర్గీకరణ చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే అప్పుడు మంచిగా కనిపించింది. ఇప్పుడు సమ్మతమేనంటే మాత్రం తప్పుపడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారు. రాజుల మీద, రాజరికం మీద, రజాకార్ల మీద, దొరల మీద, పెత్తందార్ల మీద ఎన్నో పోరాటాలు చేసినా, వచ్చిన ఫలాలను మాత్రం సమానంగా పంచుకోలేకపోతున్నాం. ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మేధావులు గతంలో అనేక ఉద్యమాలలో పనిచేశారు. ఎర్రజెండా పార్టీలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో, బహుజన సామాజిక ఉద్యమంలో పనిచేశారు. చివరకు అన్యాయం వైపు నిలబడి నైతికతను పోగొట్టుకుంటున్నారు.
బుద్ధిజం, మార్క్సిజం, అంబేద్కరిజం నుంచి నేర్చుకున్న నీతి ఇదేనా! రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి. ఈ సూత్రానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు మనువాదులే. కింది కులాల ప్రజలకు అవకాశం ఇవ్వకుండా, మేమే చదువుకోవాలి, మేమే రాజ్యం ఏలాలి, మేమే వ్యాపారాలు చేయాలి అని చెప్పేవారు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎవరి వాటా వారు తీసుకుని ఐక్యమత్యంగా కలిసి, మెలిసి జీవించాలి.
– ఎదిరెపల్లి కాశన్న