ఆనాడు సర్కార్ సొమ్ము భద్రాద్రి ఆలయానికి ఖర్చుపెట్టి జైలు పాలయ్యాడు భక్తరామదాసు. ఈనాడు అయోధ్య రామాలయం పేరు చెప్పి అధికారం దక్కించుకొన్న వారి అంతేవాసులే రాముడి సొమ్ము కైంకర్యం చేసి కటకటాలు లెక్కించడం విడ్డూరం. రథయాత్ర రాజకీయాలు ఆలయ నిర్మాణంతో ైక్లెమాక్స్‌కు చేరుకోవడం వరకు జరిగిన ఘటనల క్రమం బీజేపీ అంచెలంచెలుగా అధికార సోపానంపై ఎదగడానికి దోహదం చేశాయి. ఇప్పుడు అదే ఆలయంలో దేవుడి సొత్తును అదే బీజేపీ నియమించిన ట్రస్టీలు దిగమింగడం దారుణం. రామాలయం కోసం ఉద్యమం నడిపిన బీజేపీ ఆధ్వర్యంలోని పాలకులే గుడి కడుతున్నరంటే కోట్లాది మంది నమ్మారు. ధన, కనక, వస్తురూపేణా భూరిగా విరాళాలు సమర్పించుకొన్నారు. ఇప్పుడా నమ్మకం వమ్మయింది. ఏడెనిమిది కోట్ల రూపాయల విలువ చేసే నగదు, వెండి, బంగారు నగలు హుండీల నుంచి మాయమయ్యాయని అంటున్నారు. గుడిలో గుటకాయస్వాహా చేసిన సొమ్ము మొత్తం ఎంతో ఇదమిత్థంగా ఎవరికీ అంచనాలు లేవు. ఇది దోపిడీ దొంగల పని కాదు. ఆలయ నిర్వాహకులే ఓ పథకంప్రకారం సొత్తును బయటకు దాటించినట్టు తెలుస్తున్నది. దీనిపై మొదలైన దర్యాప్తు పర్యవసానంగా పెద్దసంఖ్యలో అరెస్టులు, భారీగా జప్తులు చోటుచేసుకోవడం, ట్రస్టీలు రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.
దేశ రాజకీయాలకు కేంద్ర బిందువులా మారిన అయోధ్య ఆలయంలో కెమెరాల కన్నుగప్పి దుస్తుల్లో, కాలి మేజోళ్లలో దాచి హుండీసొత్తును తస్కరించడం నిఘావ్యవస్థ దారుణ వైఫల్యాన్ని పట్టిస్తున్నది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ రోజుకొకటిగా వెలుగు చూస్తున్న లోపాలు సంచలనం కలిగిస్తున్నాయి. హుండీ లెక్కింపు ఫుటేజీని 180 రోజులపాటు భద్రపర్చాల్సి ఉండగా 45 రోజుల పాటే అందుబాటులో ఉండటం వంటివి నిఘాను నిద్రపుచ్చడానికి అని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. హుండీ సొమ్ము జమ చేసేందుకు ఎస్బీఐతో కుదుర్చుకొన్న ఒప్పందంలోని నిబంధనలు గాలికి వదిలేసి, తగిన భౌతిక తనిఖీలు జరుపకుండా, జేబులున్న దుస్తుల్లో వ్యక్తులను హుండీ లెక్కింపునకు అనుమతించడం విచిత్రం. ఇదంతా నిర్లక్ష్యమా లేక కావాలనే చేశారా? అని అనుమానం కలుగకమానదు. ఇప్పటివరకైతే ట్రస్టీలు, ఆలయ ఉద్యోగుల స్థాయిలోనే జవాబుదారీ బయటపడింది. అరెస్టయినవారు మౌలికంగా కింది స్థాయి ఉద్యోగులు. ట్రస్టీలు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అధికారంలో ఉన్నవారి మిలాఖతు మాటేమిటనే ప్రశ్న సహజంగానే ఈ సందర్భంగా తలెత్తుతున్నది. మొదటి నుంచీ ఆలయ రాజకీయాలతో నెట్టుకువస్తున్న బీజేపీకి ఇప్పుడు ఆలయ చోరీ పంకిలం అంటుకున్నది. బీజేపీ పర్యవేక్షణలో భక్తుల విరాళాలకు భద్రత కరువు కావడమే అందుకు కారణం. ఇంతటి వైఫల్యం బయటపడ్డ తర్వాత కూడా కొందరు మోదీ భజనపరులు.. ఈ చోరీ పెద్ద విషయం కాదన్నట్టుగా వితండవాదనలు చేయడం మూర్ఖత్వం.
అయోధ్య ఆలయంలో చోరీ ఉదంతంతో డబుల్ ఇంజిన్ సర్కార్ బడాయీల పస తేలిపోయింది. సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ట్రస్టుకు నోటీసులు ఇవ్వొద్దని రెండు ప్రభుత్వాల తరఫున వినిపించిన వాదనలను కొట్టేసింది. సిట్ నివేదికకు సర్కార్ విధించిన గడువు రేపటితో ముగుస్తుంది. ఆ నివేదికలో కొత్త సంగతులతో పాటుగా కొత్త పేర్లు బయటకు వస్తాయనే ఊహగానాలు ఊపందుకున్నాయి. ఎవరి వాటా ఎంత అనే సంగతి తర్వాత తేలుతుందో లేదో తెలియదు కానీ, ఒకటి మాత్రం నిజం. డబుల్ ఇంజిన్ సర్కార్ వాదనలోని చిత్తశుద్ధి, విశ్వసనీయతపై మరకలు పడ్డాయని చెప్పకతప్పదు. ఇంత జరుగుతున్నా దేశానికి చౌకీదార్‌ను అని చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోదీ కనీసం నోరు విప్పలేదు. ఈ ఉదంతంలో రాముడి పేరిట రాజకీయాలు చేసిన బీజేపీ ప్రతిష్ట, ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాల్లో, చాలావరకు దిగజారింది. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు ఈ ఆలయచోరీ శక్తిమంతమైన ఆయుధంగా మారుతున్నదనడంలో సందేహం లేదు.