ఆరావళి పర్వతాలకు ప్రస్తుతానికైతే ముప్పు తప్పింది. కార్పొరేట్ షైలాకులకు ప్రకృతి సంపదను దోచిపెట్టాలన్న దురాలోచన వెనుకతట్టు పట్టింది. ఎత్తు పేరుతో పర్యావరణాన్ని చిత్తు చేయాలన్న ఎత్తుగడ ప్రజాగ్రహం ముందు వీగిపోయింది. ఎడతెగని రైతుల పోరాటం ఫలితంగా కార్పొరేట్లకు సాగును కట్టుబానిసను చేయాలన్న పన్నాగం విఫలమై నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నట్టే, దేశవ్యాప్తంగా రగులుతున్న ఆరావళి నిరసనలకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పీచేముడ్ చెప్పింది.
ఎక్కడో పర్వతాలు, అడవులు.. ఎవరు తవ్వుకుంటే మనకేమీ అనుకునే రోజులు కావివి. భూమి మీద ఉండే ప్రతి పుట్టా, చెరువూ దేనికవే పర్యావరణ వ్యవస్థలకు నెలవులుగా విలసిల్లి ప్రాణాధారాలుగా పనిచేస్తాయి. భూమి మీదున్న అతిపురాతన పర్వత వ్యవస్థల్లో ఒకటైన ఆరావళికి ఉన్న ప్రాముఖ్యం తెలిసిందే. మన దేశానికి ఉత్తరాన పెట్టని కోటగోడలా నిలుస్తున్న హిమాలయాల కంటే ఆరావళి పర్వతాలే పురాతనమైనవి. దాదాపు 700 కిలోమీటర్ల పొడవున్న ఈ పర్వతశ్రేణి మరో రకంగా రక్షణ దుర్గంలా నిలుస్తున్నది. పడమర నుంచి తూర్పు ప్రాంతాలకు వీచే వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించి, థార్ ఎడారి విస్తరణకు లక్ష్మణరేఖలా నిలువడం దీని ప్రత్యేకత. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ర్టాలను చల్లగా చూసే కొండదేవరగా ఆరావళిని చెప్పుకోవచ్చు. ఇక కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరితిత్తుల్లాంటివని చెప్పకతప్పదు. అలాంటి ఆరావళిని కార్పొరేట్, రియల్ ఎస్టేట్ శక్తులు ఈ సరికే అక్రమ, సక్రమ మైనింగ్‌తో, చెట్ల నరికివేతతో చెరపట్టి చేయాల్సిన నష్టం చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వాలు వేల ఎకరాల అడవులను ధ్వంసం చేస్తున్నాయి. ఇలా అడకత్తెరలో ఇరికిన ఆరావళిని అంగడి సరుకుగా మార్చేందుకు, గనుల తవ్వకానికి రాచబాట పరిచేందుకు మోదీ సర్కార్ సంకల్పించడం దారుణం. పైగా వంద మీటర్ల ఎత్తువరకు మాత్రమే తవ్వకాలు జరపొచ్చని, అంతకన్నా ఎత్తున్నవి మాత్రమే పర్వతాలుగా పరిగణించాలని వితండవాదం చేసింది. శాస్త్రీయ విధానంలో ఏది అడవి, ఏది కాదనేది తేల్చిచెప్పాల్సిన కేంద్రమే ఎత్తును బట్టి అనుమతులను నిర్ధారించడం వింతల్లోకెల్లా వింత. ఎత్తును బట్టి ఆరావళి పర్వతాలకు నిర్వచనమిచ్చే విధానాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా నియమించిన కమిటీ కూడా తిరస్కరించింది. దాన్ని తోసిరాజని కోర్టు ముందు సలహాదారుగా ఆ ప్రతిపాదనే ఉంచి పక్కదారి పట్టించింది మోదీ సర్కార్.
ఆరావళిపై సాగుతున్న అరాచకంపై ప్రజలు మేల్కొని ఉద్యమబాట పట్టడంతో కథ అడ్డం తిరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ అనుకూల మీడియా సైతం వ్యతిరేకించడం విశేషం. ప్రజాందోళనలు అంతకంతకూ మృగ్యమైపోతున్న ప్రస్తుత కాలంలో ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం రాజుకోవడం, పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజలు అనే తేడా లేకుండా తమను కంటికి రెప్పలా కాచుకునే ఆరావళిని కాపాడేందుకు నడుం బిగించారు. కార్పొరేట్ లాభాలు తాత్కాలికమైనవి. పర్యావరణ నష్టాలు శాశ్వతమైనవి. ఢిల్లీ కాలుష్యంలో ఊపిరిసలుపక అవస్థలు పడుతున్న కేంద్ర పెద్దలు అరావళిని అడ్డికి పావుశేరుగా తెగనమ్మే దిశగా అడుగులు వేయడం విస్మయం కలిగించక మానదు. ఆలస్యంగానైనా లెంపలు వేసుకుని అరావళి రక్షణపై, ముఖ్యంగా గనుల తవ్వకంపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఉత్తర్వులు జారీచేయడం ప్రజాభీష్టానికి లభించిన ఘనవిజయంగా నిలిచింది. ప్రజల నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిదని అంటారు. పర్యావరణ పరిరక్షణకూ అప్రమత్తతే రక్షణ కవచమని ఇప్పుడు ఆరావళి సాక్షిగా తేలిపోయింది.