మబ్బుల్ని చీల్చుకుంట మీది మోటరు ఒకటే మోత
మనసుల్ని తొల్చుకుంట మది మీటరు చీకటి కూత
నాల్గు పైసలు ఎన్కేసుకుని ఆనంకల తిరెమైనంక
పెండ్లి కుదిర్చు కుందమంటే అసలే ఇనకపోయిరి
కట్నం మీద మన్నువడ! లడాయివడి లగ్గం జేసిరి
కాళ్ళ గోళ్లు దీసి కమస్కమ్ మాస్కమన్నా గాకపాయే
గల్ఫ్ దేశాలకు ఎగిరిపొమ్మని గాయిజేసి గత్తరవడిరి!
ఏజెంట్ గానింట్ల పీనుగెల్ల! పొలంగిరి వెట్టిచ్చి ఎగిర్తపెట్టె
ఎటుగాని ఎవుసం గానిచ్చి కల్లం కల్లం ఖతాం జేసిరి కన్నోల్లను!
కట్టుకున్నదాన్ని కట్ల వెట్టి కట్టు బట్టల్తోని కాట్లెవడగొట్టిరి గద!
పెనిమిటి పరాయి దేశానికి పైనమైతే
పెండ్లాం ఏడుండాలె తల్లిగారింట్లెనా? అత్తగారింట్లెనా?
ముద్దు మురిపాలు గంగపాలాయె
ఎద్దు ఎవుసం ఎల్గడి తీరాయె! గోస గోస
ఉన్నదేదో దున్నుకోక, లేని దానికి లేకి పరుగు
పంట పొలాల్నిడిసిపెట్టి పరిగె కోసం పాకులాట
కఫిలుగాడు కనికరిత్తె కాసులు కళ్ళజూత్తం
కట్టెపడి తెలివితోని కలివెల్లి జేసుకున్నా జెర నయమే
కాలం కలిసిరాక కాలో చెయ్యొ ఇరిగెనా ఖతం!
కూలి అటుంచి కూడు వెట్టెటోల్లుండరు
ఆవుసు వూని పానమే వాయెనా దేశంగాని దేశమాయె
అసలు పీనుగే ఇంటికి జేర్తదా?
కలో గంజో కలిసి తాగక ఇరుగు పొరుగు మాటలిని
ఇజ్జత్ కా సవాలై ఇకారమైపాయె!
చెల్లె లగ్గానికి చేతనైనంత పంపిత్తనని
చేతులున్న పైసలు చేటుగ జార ఇడిసిరి!
గడ్డి గుడిసెగూలగొట్టి గనమైన ఇల్లుగడ్తనని బుదిరికిచ్చిరి
బడాయిగ సాగిన బతుకు బండికి
బానిస లెక్క బతుకుడు పెద్ద గండి
ఎన్నడు ఒకని మోచేతి కింద నీళ్ళు దాగనోని పానానికి
నిత్తెం కాల్మొకత బాంచెననే నీచపు బతుకు దాపురించె!
ఇప్పుడవుసరమా ఇవన్నీ! మన పాలన మన చేతుకచ్చె
రైతు బంధు, దళిత బంధు, ఆసరాతో రాజీ పడక బతుకచ్చు
సర్కారు సహకారంతో రామసక్కగ రాజ్యమేలచ్చు!
దుబాయ్ జేరినంక రిటర్న్ వీసా తీసుడే! రయ్యున తిరిగచ్చుడే!!
కరిపె రాజ్ కుమార్: 81251 44729