నూరు సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘అమెరికా కల’ 21వ శతాబ్దం మొదటి పాతికేండ్లలోనే కరిగిపోతుందని ఎవరూ ఊహించలేదు. 1980లో మొదలైన గ్లోబలైజేషన్ 2010 వరకూసాగిందని అంచనా. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయుల ‘డాలర్ డ్రీమ్స్’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనలో ఇంత వేగంగా ముగిసిపోతాయని ఎవరూ భావించలేదు.
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల విడుదల చేసిన ప్రకటన అమెరికా వెళ్లాలనుకుంటున్న విదేశీ పౌరులను నిరుత్సాహపరుస్తోంది. ఈ ఏడాది మే నెల ఒకటిన అమెరికాలో ఒక భారతీయ మహిళ 1,200 డాలర్ల విలువైన వస్తువులను ఒక ప్రఖ్యాత మాల్ నుంచి డబ్బులు చెల్లించకుండా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుబడిన వీడియో ఈమధ్య వైరలైంది. అమెరికాలో చోరీ, దౌర్జన్యం వంటి నేరాలకు పాల్పడేవారి వీసాలను రద్దు చేస్తామని భారత పర్యాటకులను ఇక్కడి ఎంబసీ ఓ ప్రకటన ద్వారా హెచ్చరించింది. అమెరికా యూనివర్సిటీల్లో ఈ వసంత కాల (ఫాల్) ప్రవేశాల్లో భారత విద్యార్థుల సంఖ్య 70 శాతం తగ్గిపోయిందని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికాలో ఇప్పుడు విదేశీయుడెవరైనా వీసా గడువు దాటి బస చేస్తే అరెస్టు, పది సంవత్సరాల పాటు ఆ దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారని తాజా ఉదంతాలు చెబుతున్నాయి. ఐర్లాండ్‌కు చెందిన ఒక ఐటీ నిపుణుడు థామస్ కిందటేడాది అమెరికా వెళ్లి మూడు నెలల గడువు దాటి అదనంగా మూడు రోజులు ఉన్నాడు. దీంతో ప్రత్యేక వీసా గడువు అతిక్రమించి మూడు రోజులు ఎక్కువ ఉన్నాడనే కారణంతో థామస్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విదేశీ పర్యాటకుల వీసా కాలపరిమితి ఉల్లంఘనలను చూసీచూడనట్టు పోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు అనుసరించే ధోరణి. అలాంటిది స్వేచ్ఛా స్వాతంత్య్రాల స్వర్గంగా సగర్వంగా చెప్పుకొనే అమెరికా తన గడ్డపై బస చేసే విదేశీ పౌరుల విషయంలో ఇంత కటువుగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
‘వలసదారుల రాజ్యం’గా పేరొందిన అమెరికాలో గత పదేండ్లుగా విదేశీయుల బసకు సంబంధించిన వీసా, ఇమ్మిగ్రేషన్ నియమ నిబంధనలను కఠినతరం చేయడం, ఏకపక్షంగా అమలు చేసే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. 1960ల మధ్యలో అమెరికా తన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సరళతరం చేసినప్పటి నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు సహా ఇతర రంగాలకు చెందిన జనం పెద్ద సంఖ్యలో అక్కడికి పోవడం పెరుగుతూనే ఉంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో, ఇంకా వై2కే సమస్యతో తెలుగు ప్రాంతాల వారికి అమెరికాలో ఉపాధి అవకాశాలు అనూహ్య రీతిలో పెరిగాయి. కొత్త శతాబ్దంలో ఏపీ విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల నుంచి యువతీయువకులు అమెరికా పోవడం ఇంకా వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా విధానాల్లో వస్తున్న మార్పులు తెలుగు ప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. జనాభా లెక్కల వివరాల సేకరణకు సంబంధించిన అమెరికా సెన్సస్ బ్యూరో గణాంకాల ప్రకారం.. అమెరికాలో తెలుగు వారి జనాభా గత మూడు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. 20వ శతాబ్దం మధ్య నుంచి ఇప్పటి వరకూ అమెరికాలో నాలుగు తరాల తెలుగు జనం, ఇంకా ఇటీవల వెళ్లిన తెలుగు విద్యార్థుల సంఖ్య అన్ని అంచనాలను మించిపోయింది. తెలుగు వారి జనాభా 2024 జూన్ నాటికి 12.30 లక్షలకు పెరిగిందని, 2016లో ఈ సంఖ్య 3,20,000 మాత్రమేనని సెన్సస్ బ్యూరో వివరాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా జనాభాలో భారతదేశం నుంచి వలసొచ్చి స్థిరపడిన వారి సంఖ్య ఇప్పుడు ఒకటిన్నర శాతమని అంచనా. అన్ని దేశాల నుంచి వలసొచ్చిన జనంలో ఇండియా వాటా ఆరు శాతంగా ఉంది. భారతీయులు అమెరికాలో చట్టాల ప్రకారం నడుచుకునే అత్యంత ఆదర్శప్రాయమైన ‘వలసవర్గం’గా పేరు సంపాదించారు. ఈ లెక్కన అమెరికా వీసా నియమ నిబంధనల అమలులో వస్తున్న మార్పులు అత్యంత దారుణమనే భావన బలపడుతోంది.
నాంచారయ్య
మెరుగుమాల