కేంద్రంపై హిందీవాదుల పెత్తనం స్వాతం త్య్రం వచ్చిన రోజుల నుంచీ ఉన్నది. ఆ పెత్తనంపై పోరాటం సాగించిన చరిత్ర తమిళనాడుకు అంతకుముందు నుంచీ ఉన్నది. ద్రవిడ ఉద్యమ నేపథ్యం దీనికి దోహదం చేసింది. అనేక సందర్భాల్లో హిందీ వ్యతిరేక ఆందోళనలు తమిళనాడు అంతటా భీకరంగా జరిగాయి. 1937లోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజాజీ సర్కారు హిందీని స్కూళ్లలో తప్పనిసరిగా బోధించాలనే నియమం తెచ్చినప్పుడు తీవ్రస్థాయిలో ఆందోళనలు మొదలయ్యాయి.
ఆ సందర్భంగా ఇద్దరు విద్యార్థుల బలిదానం గురించి ఇప్పటికీ తమిళనాడులో చెప్పుకొంటారు. ప్రజావ్యతిరేకత నేపథ్యంలో రాజాజీ రాజీనామా చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం హిందీ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. ఆ తర్వాతికాలం లో హిందీ వ్యతిరేకత అనేది తమిళనాడు సం స్కృతిలో భాగమైంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయి కేసులు ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి.
రైల్వేస్టేషన్లు, తదితర స్థలాల్లో హిందీ రాతలను ఆందోళనకారులు చెరిపేయడం ఈ ఉద్యమాలకు ప్రతీకాత్మకంగా నిలుస్తుంది. తాజాగా మరోసారి తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈసారి కేంద్ర-రాష్ట్ర తగాదాకు నూతన విద్యావిధానం (2020) కేంద్ర బిందువుగా మారింది. కేంద్రానికి, తమిళనాడుకు మ ధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుతున్నది. ప్రభుత్వ పాఠశాల్లో మూడు భాషలు బోధించాలన్న నియమాన్ని అమలుచేయకపోతే సమగ్ర శిక్షా అభియాన్ కింద తాము ఇచ్చే నిధులను వదులుకోవాల్సి వస్తుందని కేంద్రం తేల్చిచెప్పడం ఇందుకు కారణం. అయితే తమిళనాడు మాత్రం హిందీకి ససేమిరా అంటూ తన ద్విభా షా సూత్రాన్ని యథావిధిగా అమలు చేస్తున్నది.
ఈ వివాదంపై రాజ్యాంగం వైఖరి కొంత స్పష్టతకు తావిస్తున్నది. హిందీ అధికార భాష అని అందులో ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 ఏండ్ల వరకు ఇంగ్లిష్ అధికార భాషగా కొనసాగుతుందని వెసులుబాటు కల్పించారు. అయితే ఆ గడువు ముగిసేలోపే 1963లో తెచ్చిన అధికార భాషల చట్టంలో హిందీతో పాటుగా అదనంగా ఇంగ్లిష్ అధికార వ్యవహారాలకు, అదీ నిరవధికంగా, వినియోగించబడుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భాషలో దైనినైనా లేదా హిందీని అధికార వ్యవహారాలకు వినియోగించవచ్చని స్వేచ్ఛను కల్పించింది. అదే సమయంలో భారతదేశ మిశ్రమ సంస్కృతిలో ఏక సూత్రత తెచ్చేందుకు హిందీని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందని కూడా రా జ్యాంగం స్పష్టం చేసింది.
ఈ బాధ్యతలో భాగంగా కేంద్రం 1968లో మొదటిసారిగా త్రిభాషా సూత్రంతో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ ఏడాదే పార్లమెంట్ ఉభయసభలు అధికార భాషా తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ రెండింటి ప్రకారం హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ర్టాల్లో హిందీ తప్పనిసరిగా బోధించాలనే నియమం తెచ్చారు. దీనిపై తమిళనాడులో నిరసనలు భగ్గుమన్నాయి. ద్రవిడ పార్టీల సుస్థిర పాలనలో ఆ రాష్ట్రంలో ద్విభాషా సూత్రమే అమలవుతున్నది. 1980ల మధ్యలో కూడా భీకర స్థాయిలో హిందీ వ్యతిరేక ఆందోళనలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అందులో హిందీ తప్పనిసరి అనకుండా మూడు భాషల్లో రెండు స్వదేశీ భాషలైతే చాలునని సడలింపు ఇచ్చింది.
ఇంగ్లిష్ స్వదేశీ భాష కానప్పటికీ అది అంతర్జాతీయంగా వివిధ సేవారంగాల్లో పోటీ పడేందుకు తోడ్పడుతుందనేది తెలిసిందే. అందుకే తమిళనాడు తమిళం, ఇంగ్లిష్ బోధనను తప్పనిసరిగా అమలు చేస్తూ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా హిందీని ప్రతిఘటిస్తూ వస్తున్నది. 2020 ఎన్ఈపీలో హిందీ గురించి నొక్కి చెప్పనప్పటికీ లోపాయికారిగా సంస్కృతాన్ని ప్రోత్సహించడం తమిళనాడుకు నచ్చని అంశంగా ముందుకు వచ్చింది. అంతేకాకుండా కేంద్రం ఎస్ఎస్ఏ కింద ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల నిధులను ఆపివేయడంతో మరోసారి తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు మొ దలయ్యాయి.
దొడ్డిదారిన హిందీని, సంస్కృతాన్ని రుద్దేందుకే కేంద్రం త్రిభాషా సూత్రంపై ఒత్తిడి తెస్తున్నదనేది తమిళనాడు వాదన. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రతిఘటించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం అంటున్నది. అయితే రాజ్యాంగంలో ఆ సంగతి ఎక్కడుందో చెప్పాలని తమిళనాడు కేంద్రాన్ని నిలదీస్తున్నది. ఉత్తరాదిన దక్షిణాది భాష ఏదైనా బోధిస్తున్నారా? అని తమిళ సీఎం స్టాలిన్ తాజాగా సవాల్ విసిరారు. హిందీ వివాదం అంతిమంగా సమాఖ్యవాదానికి సవాలుగా పరిణమిస్తున్నదన్న సంగతి గుర్తుంచుకోవాలి.