కొన్నేండ్ల కిందట నేను ‘యుగానికొక్కడు’ అన్న వ్యాసంలో నారా చంద్రబాబు నాయుడిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడితో పోల్చి వారి లాగా ఆయన కూడా ఎటువంటి అవతార పురుషుడో వివరంగా రాశాను. కానీ, బాబు గారు ఈ మధ్య మాట్లాడిన మాటలతో నా అభిప్రాయాలు మారాయి. వారు శ్రీరాముడు, శ్రీకృష్ణుడిలా యుగానికొక్కరు కారు. మన్వంతరాలన్నిటిలో యుగయుగాలకు ఒక్క మనువు పుడతాడని రాశారు, ఆ మనువులు పుట్టుక తీసుకోకముందే ఆత్మల రూపంలో లోకాలన్నింటిని పరిశీలిస్తూ ఉంటారుట. బహుశా అటువంటి ఒక మనువే ప్రపంచాన్ని ఉద్ధరించటానికి నారా వారి రూపంలో అవతరించారు. కోకాపేట భూములు ఎకరం 100 కోట్లు చేయటం మాట కాకుండా, విద్యారంగంలో తెలంగాణ ప్రాంతంలో వారి మహిమలు ఏమిటో విశ్లేషిద్దాం.
1950లో పుట్టిన చంద్రబాబుకు నిజాం రాష్ట్రం (వేరే దేశం)తో ఆత్మసంబంధం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో విద్యను తానే ప్రవేశపెట్టానన్నారు. మరి తెలంగాణ విద్యారంగం, సాంస్కృతిక చరిత్రలు పరిశీలిస్తే ఈ వివరాలు తెలుస్తాయి. మొదట పాలించిన నిజాముల కాలంలో అంటే 17, 18 శతాబ్దాలలో పర్షియన్ భాష అధికార భాషగా ఉండబట్టి ఆ భాషా, సాహిత్యాల కోసం విద్యాసంస్థలు ఉండేవి. ఆ మాధ్యమంలోనే 15 ఏండ్ల దాకా మగపిల్లలకు పాఠశాలలు నడపబడేవి. ఆ కాలంలో బహుశా చంద్రబాబు ఆత్మ నిజాముల మస్తిష్కాలలో ప్రవేశించి ఆ పిల్లలకు విద్య గరపమని సలహా ఇచ్చి ఉంటుంది.
ఇక పోనీ ఆంధ్రావారికి మాతృ భాషాభిమానం ఎక్కువ అనుకుంటారు కాబట్టి తెలుగు మాధ్యమంలో పాఠశాలలు వారే స్థాపించారేమో అనుకోవచ్చు. అప్పుడు వారు శ్రీ మాడపాటి హనుమంతరావు ఆత్మలో ప్రవేశించి నారాయణగూడలో 1928లో ఆంధ్ర గర్ల్స్ హైస్కూల్ స్థాపించమని ప్రోత్సహించారు. అంతే, మాడపాటి వారు కేవలం ముగ్గురు విద్యార్థులతో పాఠశాల ప్రారంభించారు. తర్వాతి సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థినులకు విద్య గరిపిన ఆ గొప్ప పాఠశాల మాలాంటి వారిని లక్షల మందిని తీర్చిదిద్దింది మాడపాటి. వారికి ప్రోత్సాహమిచ్చిన చంద్రబాబుకు మేమంతా కృతజ్ఞులం.
ఇక అక్కడితో తృప్తి పడలేదు నారా వారు. అంతకంటే ముందు చాదర్‌ఘాట్ పాఠశాల ప్రారంభించటానికి ఆయన ప్రోత్సాహమే పనిచేసింది. ఇది భారతదేశంలో అన్ని పాఠశాలల కంటే మొదటగా ప్రారంభించబడింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా వెలసిన కొన్ని పాఠశాలల చిట్టాలో ఉంటుందీ పాఠశాల. ఈ పాఠశాల మిలిటరీ వారి పిల్లల కోసం ఆంగ్ల మాధ్యమంలో స్థాపించబడింది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పటం అవసరం. నిజాముల సైన్యంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచే కాకుండా, ఆఫ్రికా దేశాల నుంచి, భారతదేశం నుంచీ కూడా బెటాలియన్లకు సరిపడా సైనికులుండేవారు. ఇప్పుడు హబ్సిగూడ అనే ప్రాంతం అప్పుడు ఆఫ్రికన్ సైనికుల స్థావరంగా ఉండేది. హబ్సి అంటే నల్లవారి జాతి. ఈ తెలివైన పనులన్నీ నిజాముల వల్ల చంద్రబాబు ఆ సమయంలో ప్రధానుల ఆత్మలో దూరి ఇచ్చిన సలహాల వల్లనే జరిగాయి. ఇక 1923లో జాగిర్దార్ కాలేజీగా స్థాపించబడి 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా మారిన విద్యాసంస్థ ఇప్పటికీ విజయవంతంగా నడుపబడుతోంది.
ఇక మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమంలో సామాన్య ప్రజల పిల్లల కోసం 1834లో పాఠశాల ప్రారంభించబడింది. ఆ తర్వాత డానియేల్ మర్షీ అనే ఇంగ్లీషు ప్రచారకుడు 1855లో ఆల్ సెయింట్స్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించినా, ఆ కాలంలో నిజాము ప్రభుత్వంలో ఉన్న విదేశీయులకు అవసరమని గ్రహించిన చంద్రబాబు వీరిని ప్రోత్సహించి ఈ పాఠశాలలు స్థాపింపచేశాడు. పైన చెప్పిన చాదర్‌ఘాట్ స్కూల్ కాలక్రమేణా 1891లో సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌గా మార్చబడింది. అంటే చంద్రబాబుగా నారా వారి పుట్టుకకు అర్ధ శతాబ్దం ముందు!
ఇక నిజాముల కాలంలో అందరు ప్రధానులలోకి విశిష్టంగా పరిపాలన నడిపినవారు సర్ మీర్ తురాబ్ అలీఖాన్. ఈ పేరు కంటే ఒకటో సాలార్ జంగ్ అంటే అందరికీ తెలుస్తుంది. అత్యంత ప్రభావవంతంగా నిజాము రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన మహా వ్యక్తి. ప్రస్తుతం మనం చూస్తున్న సాలర్జంగ్ మ్యూజియంలోని వస్తువులన్ని ఈయన కుటుంబసభ్యులు సేకరించినవే. 1853 నుంచీ 1883 దాకా ప్రధానమంత్రిగా ఉన్న సాలార్జంగ్-1 అన్నిరంగాలనీ ప్రగతిపథంలో నడిపాడు. బహుశా కేసీఆర్‌కు వారే ఆదర్శమూర్తులేమో! పరిపాలనా సంస్కరణతో పాటు మొట్టమొదటగా ఆధునిక విద్యా సంస్థలను స్థాపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 23 ఏండ్లకు ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ అవినీతిమయంగా ఉన్న పాలనను చక్కదిద్దాడు. 1954లోనే దార్-ఉల్-ఉలూమ్ అనే విద్యాసంస్థను ప్రారంభించాడు.
చంద్రబాబు ఆత్మీయ సంబంధం సాలార్జంగ్-1తోనే కాకుండా అతని కొడుకు సాలార్జంగ్-2తో కూడా కొనసాగింది. ఈయన ఇంగ్లండ్ వెళ్లి చదువుకున్నాడు. అందుకని తండ్రి కన్నా ఎక్కువ ఆంగ్ల మాధ్యమాన్ని ఇష్టపడ్డాడు. దారుల్ సలామ్ అనే సంస్థను స్థాపించి, పాశ్చాత్య విద్యా విధానాన్ని ఆ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టాడు. ఆ సంస్థల్లో అరబిక్, ఉర్దూ, ఇంగ్లీషు భాషలను క్షుణ్ణంగా బోధించేవారు. ఆయన స్థాపించిన ఇతర సంస్థలు విశిష్టమైనవి. సిటీ హైస్కూల్స్ (1870), చాదర్‌ఘాట్ హైస్కూల్ (1872), గ్లోరియా గర్ల్స్ హైస్కూల్ (1881). ఇంజినీరింగ్ కాలేజీ (1870) కూడా స్థాపించి ఎంతోమంది సాంకేతిక నిపుణులని తయారుచేశాడు.
చంద్రబాబు సహాయం లేకుండా సాంకేతికత ఎలా పెరుగుతుంది చెప్పండి? మన దేశంలోనే కాకుండా విదేశాల నిపుణులను కూడా నారా చంద్రబాబే తయారు చేశారు కదా! మరి తెలివిలేని తెలంగాణలో అటువంటి మేధావి ఆత్మరూపంలోనో, మనిషి రూపంలోనో సహాయం చేయకపోతే తెలంగాణ ప్రాంతం అంతమంది వైద్య, సాంకేతిక నిపుణులని ఎలా తయారుచేసి ఉంటుంది? విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్‌ను పిలిచి ట్యాంక్‌బండ్ కట్టించాలనే ఆలోచన నిజాముకి ఎలా కలుగుతుంది, చంద్రబాబు చెప్పకుండా?
ఇక ఇప్పుడు ఇక రాష్ట్రం విడిపోయాక కాళేశ్వరం వంటి పథకం ముఖ్యమంత్రి ఎలా ఆలోచించి ఉంటారు? చంద్రబాబు పదే పదే ‘తెలంగాణ ఎత్తు మీద ఉంది’ అని ‘అందుకే నీళ్ళన్నీ ఆంధ్ర వైపు పారతాయని’ చెప్పకపోతే కేసీఆర్ ఇలా డిజైన్ చెయ్యాలన్న ఆలోచన అసలు వచ్చేదా? అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని పలకవద్దని నిషేధించకపోతే మరి ఆ పదాన్ని మళ్లీ ఎలా పలకవచ్చు అన్న ఆలోచన, విడి రాష్ట్రమైతేనే సాధ్యం అన్న ఆలోచన అసలు మన కేసీఆర్ చేసేవారా? హైటెక్ చుట్టూ తన వర్గం వాళ్లతో భూములు కొనిపించి, తర్వాత అక్కడ ఐటీ కంపెనీలు పెట్టుకోవడానికి చంద్రబాబు అనుమతినిచ్చాక కదా కేసీఆర్‌కు అర్థమైంది, ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అక్కడే భూముల ధరలు పెరుగుతాయని! అందుకే పట్టుబట్టి కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేశారు కేసీఆర్. ఆలోచన మాత్రం చంద్రబాబుదే కదా! ఈ గౌరవం ఆయనకే దక్కుతుంది. ఒక్క ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుంది అంటారు కదా! కాబట్టి కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లకు పెరిగినా, రేపు తెలంగాణ జనాభా 10 కోట్లకు పెరిగినా, ఆ గౌరవం చంద్రబాబుకే దక్కాలి.
అయితే ఇన్ని చెప్పాక ఒక్కటే సందేహం మిగిలి ఉంది. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చేసిన మనిషి ఐదేండ్లలో అమరావతిలో ఒక్క మూడు భవనాలు-శాసనసభ, శాసనమండలి, హైకోర్టు-చక్కగా ఎందుకు కట్టలేక పోయాడూ అని! మరి ఆయన సహాయం లేకుండానే హైదరాబాద్‌లో ఇంద్ర భవనం లాంటి సచివాలయం రెండున్నర ఎకరాల్లోనే వెలిసింది. ఎట్లా అబ్బా! ఏం చిత్రం! నిన్న టీడీపీ ఆఫీసు ప్రసంగంలో ఏపీని బాగుచేసి తెలంగాణకు వస్తాను అన్నారు చంద్రబాబు. ఎంత మహాభాగ్యం? తెలంగాణ మళ్లీ ప్రపంచ పటంలో నిలబడుతుంది అమరావతి లాగా!
ఇక అక్కడితో తృప్తి పడలేదు నారా వారు. అంతకంటే ముందు చాదర్‌ఘాట్ పాఠశాల ప్రారంభించటానికి ఆయన ప్రోత్సాహమే పనిచేసింది. ఇది భారతదేశంలో అన్ని పాఠశాలల కంటే మొదటగా ప్రారంభించబడింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా వెలసిన కొన్ని పాఠశాలల చిట్టాలో ఉంటుందీ పాఠశాల. ఈ పాఠశాల మిలిటరీ వారి పిల్లల కోసం ఆంగ్ల మాధ్యమంలో స్థాపించబడింది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పటం అవసరం. నిజాముల సైన్యంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచే కాకుండా, ఆఫ్రికా దేశాల నుంచి, భారతదేశం నుంచీ కూడా బెటాలియన్లకు సరిపడా సైనికులుండేవారు.
– కనకదుర్గ దంటు 89772 43484