భారతీయ యువత అమెరికా కల క్రమంగా చెదిరిపోతున్నది. అప్పు చేసి అయినా అగ్రరాజ్యం వెళ్లాలని, డాలర్ సంపాదనతో జీవితాలు మెరుగుపర్చుకోవాలనుకొనే ఉత్సాహం చల్లారిపోతున్నది. పిల్లలు అమెరికాలో ఉండటం ఒక స్టేటస్ సింబల్‌గా ఉండేది. అది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీసాలపై అస్థిరత నెలకొనడం, చదువు ఖర్చులు భరించరానివిగా తయారు కావడం, చదువుల అనంతరం ఉపాధి అవకాశాలు క్రమేపీ తగ్గిపోతుండటం అనే మూడు అంశాల కారణంగా అగ్రరాజ్యానికి వెళ్లాలనే ఆసక్తి అంతకంతకూ అడుగంటుతున్నది.
అనేక అమెరికా శిక్షణ సంస్థల్లో భారతీయుల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గడమే దానికి నిదర్శనం. ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచీ ప్రవాసుల రాకపై నియంత్రణలు పెరిగిపోయాయి. వీసాలు డోలాయమానంలో పడ్డాయి. అమెరికా గడ్డమీద పుట్టినవారికి జన్మతః పౌరసత్వం సమకూర్చే ‘బర్త్ రైట్’ విధానం కూడా రద్దయింది. దీనిపై కోర్టులు స్టే విధించినప్పటికీ భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఉద్యోగావకాశాలపైనా నియంత్రణలు పెరిగాయి. గత ఆగస్టు 26న వీసాల నిలిపివేతతో వలస ద్వారాలు మూసుకుపోయాయి.
దీనికి ఎఫ్-1 వీసాతో నేరుగా సంబంధం లేనప్పటికీ విద్యార్థి వీసా వ్యవస్థ అస్థిరతల వల్ల సెంటిమెంట్ మారుతున్నది. అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ఫర్మానాతో బెదురు పుట్టిస్తున్నారు. ఎప్పుడు ఏ సమస్యతో వీసా ప్రమాదంలో పడుతుందోనని బెదురుకొనే రోజులు వచ్చాయి. దాంతో అమెరికా వెళ్లి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవడం కన్నా ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలనే అభిప్రాయం బలపడుతున్నది. ఒకప్పుడు అమెరికాలోని విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్ఠలు, కోర్సుల ప్రాధాన్యత గురించి ఆలోచించే విద్యార్థులు ఇప్పుడు వీసాల గురించే ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వస్తున్నది. అందువల్ల పక్కా అవకాశాలు కల్పించే ఇతర దేశాల కోసం అన్వేషణ సహజంగానే ఉధృతమైంది.
ఈ అన్వేషణలో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయాలుగా ముందుకు వచ్చాయి. జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్ న్యూజీలాండ్ దేశాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతున్నది. అమెరికాతో పోలిస్తే తక్కువ ఖర్చు ఉండటం ఆకర్షణగా మారింది. అదివరకు స్థానిక భాషలో శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఇంగ్లిష్‌లో శిక్షణావకాశాలు పెరిగాయి. విద్యానంతరం ఉపాధి సులభంగా పొందగలగడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. నిన్నా మొన్నటి వరకు అమెరికా ఒక్కటే ఉండేది. మారిన పరిస్థితుల్లో అమెరికా ప్రథమ గమ్యస్థానం కాకుండాపోయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా శిక్షణ సంస్థల్లో భారతీయుల విద్యార్థుల నమోదు 10-15 శాతం తగ్గుతుందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా అంతర్జాతీయ దరఖాస్తులు 17 శాతం తగ్గాయని ఓ సర్వేలో నమోదైంది. గత మార్చి 1వ తేదీ నాటికి అంతర్జాతీయ దరఖాస్తులు 9 శాతం తగ్గగా, భారతీయుల వాటా 14 శాతం తగ్గడం గమనార్హం. విదేశీ విద్యను ఎంచుకొనేవారిలో మధ్యతరగతివారు, విద్యారుణాల మీద ఆధారపడేవారే అధికంగా ఉంటారనేది తెలిసిందే. ఖర్చులకు వెనుకాడేవారు, సాంకేతికేతర కోర్సుల్లో చేరేవారు అమెరికా వెళ్లడం అనవసరమని పునరాలోచనలో పడటమే ఈ ధోరణికి కారణమని చెప్పవచ్చు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ డాటా ప్రకారం వారు విదేశాల్లో చదువుకొనే భారతీయ విద్యార్థులు ఏటా 280 కోట్ల డాలర్లు (సుమారు రూ.26,600 కోట్లు) చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. అంతపెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేవారు, అదీ ఎక్కువగా బ్యాంక్ విద్యా రుణాలపై ఆధారపడేవారు అస్థిర భవిష్యత్తును నమ్ముకోలేరన్నది వాస్తవం. దీంతో ప్రత్యామ్నాయాల అన్వేషణ తప్పనిసరైంది. అందుకే వర్తమాన సంవత్సరంలో సుమారు 70 దేశాల్లో దాదాపు 14 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో కెనడా 4.27 లక్షల మంది విద్యార్థులతో ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా అమెరికా 3.3 లక్షల పైచిలుకు విద్యార్థులతో రెండో స్థానానికి పడిపోయింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. అయితే అమెరికాకు భారతీయ విద్యార్థుల వలసలు పూర్తిగా నిలిచిపోతాయని కాదు. మునుపటిలా ఏటేటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ పోవడం అనేది మాత్రం ఉండకపోవచ్చు. క్రమేణా తరుగుదల కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.