‘టాక్సిక్’ సినిమా ఫలితం ఎలావున్నా.. ఆ సినిమాలోని కథానాయికల్లో ఒకరైన తారా సుతారియాకు మాత్రం యువత నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తార సుతారియా బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. ముంబైలో భారీగా వర్షం కురుస్తుండగా, త్వరగా కారులోకి వెళ్లేందుకు తారా ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ ఫొటోగ్రాఫర్ ఆమెకు అతి చేరువగా వచ్చి ఫొటో తీయబోయాడట.
దాంతో ముందు షాక్‌కి గురై, ఆ తర్వాత తేరుకున్న తారా.. అతన్నీ, అతని కెమెరాను కూడా దూరంగా నెట్టేవేసే ప్రయత్నం చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ – ప్రైవసీకి సంబంధించిన పరిమితులపై పలువు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. దీనిపై తారా సుతారియా మాట్లాడుతూ ‘నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ థాంక్స్. ఇది ఆత్మరక్షణలో భాగంగా చేసిన పని. ప్రతి దానికీ ఓ పరిధి ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’ అంటూ స్పందించింది తారా సుతారియా.