అసెంబ్లీ బిల్లుల విషయమై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల గురించిన చర్చలు చాలా జరుగుతున్నా ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నదనే ప్రస్తావన మాత్రం ఎక్కడా రావటం లేదు. ఈ అంశంపై రాజ్యాంగం, చట్టాలు, గత వివాదాలు, తీర్పులలో విషయాలు చాలానే ఉన్నాయి. అవి అన్నీ ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. అంతవరకు మంచిదే. అదే సమయంలో కొన్ని వివాదాలకు అసాధారణ స్వభావం ఉంటుంది. అటువంటి సందర్భాలలో, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనేది గమనించడం కూడా అవసరం. తమిళనాడు గవర్నర్ తీరును పురస్కరించుకొని తలెత్తిన సమస్య అటువంటిది. రాష్ట్రపతి, తదితరుల రాజ్యాంగ అధికారాలు ఏవైనా, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో వీరెవరూ మధ్యయుగాల నాటి చక్రవర్తులు కారు. అందరి అధికారాలకు మూలం ప్రజాభిప్రాయంలో ఉంటుంది.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడటం, రాజ్యాంగాలు, చట్టాలు రూపొందటం నిజమే. అటువంటప్పుడు, యథాతథంగా ఆలోచించినట్లయితే ప్రతి అంశంపై ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనేది ఆలోచించనక్కరలేదు. కొన్ని దేశాలలో వలె ప్రతి ముఖ్యమైన అంశంపై రెఫరెండం అవసరం లేదు. కానీ అదెప్పుడు? ఎన్నికైన అధికారపక్షం గాని, ప్రతిపక్షాలు గాని అటువంటి అభిప్రాయాలకు, అవి ప్రతిఫలించే రాజ్యాంగానికి, చట్టాలకు అనుగుణంగా, అక్షరబద్ధంగా, స్ఫూర్తిబద్ధంగా కూడా వ్యవహరించినప్పుడు, పాలించినప్పుడు. అప్పుడే అది ప్రజాస్వామ్యబద్ధ పాలన అవుతుంది. ప్రజలకు ఆమోదకరం అవుతుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే అధికారాలు, హక్కులూ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఏ విధంగానైతే ఉండవో గవర్నర్లకు, రాష్ట్రపతులకు కూడా ఉండవు. ఎవరూ దైవాంశ సంభూతులు, గతకాలపు చక్రవర్తులు కారు. అందువల్ల, గవర్నర్లను, రాష్ట్రపతినే సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా? అనే ప్రశ్న ఎంత మాత్రం అవగాహన లేని, విలువ లేని దురహంకార పూరితమైన వైఖరి మాత్రమే.
ఇది చూసినప్పుడు అమెరికాలో జరుగుతున్నది గుర్తుకు వస్తున్నది. భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అంటారు. నిజమా కాదా అన్నది అట్లుంచి, ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని ప్రధాని మోదీ సగర్వం గా చాటిచెప్తుంటారు. అమెరికాను గొప్ప ప్రజాస్వామ్యమంటారు. ప్రస్తుతం ఈ రెండు ఘనమైన ప్రజాస్వామ్యాల్లో జరుగుతున్నది ఒకే విధంగా ఉండటం విశేషం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులని చెప్పేవారి నుంచి మొదలుకొని, స్వయంగా తమ పౌరులు అయి నవారిపై, పరిపాలనా వ్యవస్థపై తీసుకుంటున్న పలు చర్యలపై కోర్టులు స్టే విధిస్తున్నాయి. కొన్నింటిని కొట్టివేస్తున్నాయి. ఆయా కోర్టు ఉత్తర్వులను ట్రంప్ ప్రభుత్వం పాటించడానికి బదులు బహిరంగంగా ధిక్కరిస్తున్నది. ఆ జడ్జీలను ప్రభుత్వంతో పాటు, ట్రంప్ అధికారులు, అధికారపక్షమైన రిపబ్లికన్ పార్టీ నాయకులు బాహాటంగా పదేపదే విమర్శిస్తున్నారు. వారిని ఇంపీచ్మెంట్తో పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరినైతే, నమ్మశక్యం కాని రీతిలో, ఏదో సాకు చూపి అరెస్టు చేసే దాకా వెళ్లారు.
ఒక ఘనమైన ప్రజాస్వామ్యంలో ఇట్లా జరుగుతుండగా, మరొక ఘనమైన ప్రజాస్వామ్యంలో ఏమి జరుగుతున్నది? గత చరిత్రను పక్కన ఉంచుదాం. తమిళనాడు బిల్లుల సంగతి చూద్దాం. అక్కడి అసెంబ్లీ ఒకటికి రెండుసార్లు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమోదించిన బిల్లులను కూడా అక్కడి గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచుతారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సైతం నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు.
బిల్లుల పట్ల ఆ విధమైన వైఖరి వల్ల రాష్ట్రంలో వేర్వేరు శాఖల పరిపాలన దెబ్బతింటుంది. అయినప్పటికీ ఆయన లెక్కచేయరు. ఇదే ఒక అప్రజాస్వామికమైన, రాజ్యాంగ విరుద్ధమైన దారుణ ప్రవర్తన కాగా, అంతకన్న దారుణమైనది మరొక స్థాయిలో జరుగుతుంటుంది. అది ఢిల్లీ స్థాయిలో. అక్కడి నుంచి అన్నీ గమనించే హోంశాఖ, హోంమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరూ అది తగదని వారించరు. పరిస్థితిని సరిదిద్దరు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా పట్టించుకోరు. గవర్నర్ రవి ఇది చాలదన్నట్లు, తన అధికార పరిధులను బాహాటంగా అతిక్రమిస్తూ, అక్కడి అధికారపక్షమైన డీఎంకేకు వ్యతిరేకంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. అటువంటి కార్యకలాపాలలో పాల్గొంటారు.
గవర్నర్ రవికి ఒక ప్రతిష్ఠాత్మకమైన నేపథ్యం ఉంది. ఐపీఎస్ అధికారి అయిన ఆయన అందుకు సంబంధించిన పలు హోదాలలో పనిచేసిన తర్వాత, కొన్ని చోట్ల గవర్నర్‌గా కూడా ఉండిన వెనుక, నాగాలాండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. సమస్యాత్మక ఈశాన్య భారత రాష్ర్టాలలో ఐపీఎస్ నుంచి, సైన్యం నుంచి రిటైరైన వారిని గవర్నర్లుగా నియమించటం ఎప్పటినుంచో ఉంది. అంతవరకు సరే. కానీ, వాటన్నింటిలో అతి క్లిష్టమైన, అతి సున్నితమైన నాగాలాండ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పైగా అప్పుడు నాగా సంస్థలకు, కేంద్రానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు అక్కడ పనిచేసిన వారిలో జనరల్ కె.వి.కృష్ణారావు ఉన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన కె.పద్మనాభయ్య నాగాలతో చాలాసార్లు చర్చలు జరిపారు. అప్పుడంతా వారు ఎంతో నేర్పుగా వ్యవహరించారు. కానీ, రవి తీరుతో విసుగెత్తిన నాగాలు ఆయనను తొలగిస్తే తప్ప చర్చలు జరుపబోమని ప్రకటించటంతో కేంద్రం తనను తమిళనాడుకు బదిలీ చేసింది. రాజకీయంగా ఆ రాష్ట్రం మరొక విధంగా సున్నితమైనది. కానీ, ఆయన తీరు మారలేదు. విషయం చిలికిచిలికి ప్రస్తుతం మనం చూస్తున్నట్లు గాలివానగా మారింది.
అసలు సమస్య కేంద్రం వద్ద ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట వాటిని రకరకాల ఇబ్బందులకు గురిచేయటం, వీలైతే పడగొట్టడం, అందుకు గవర్నర్లను ఉపయోగించుకోవటం. వాస్తవానికి ఈ అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ధోరణిని ఆరంభించింది కాంగ్రెస్ పార్టీ. ఆ దుష్ట సంప్రదాయాన్ని బీజేపీ కూడా కొనసాగిస్తున్నది. అప్పుడు కాంగ్రెస్‌కు నీతులు చెప్పి తానిప్పుడు అదే పనిచేస్తున్నది. తమిళనాడు పొరుగున గల కేరళలో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఇటు తెలంగాణలో తమిళిసై, అటు పశ్చిమబెంగాల్లో ఆనందబోస్ల చర్యలు తెలిసినవే.
ఇప్పుడు గవర్నర్ రవిని కేంద్రం ఇన్నిన్ని జరుగుతున్నా అదుపు చేయకపోగా, తమకు కొరకరాని కొయ్యగా మారిన డీఎంకేను ఆయన చికాకు పరచటాన్ని చూసి ఆనందిస్తున్నదనాలి. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది అయినప్పుడు, రాజ్యాంగానికి అధినాయకత్వ స్థానంలో గల రాష్ట్రపతి ఏమి చేస్తున్నట్లు? పైకి కన్పించింది అయితే ఏమీలేదు. తను ఏమైనా చేసినా మనకు కన్పించలేదో లేక రబ్బర్ స్టాంప్ వలె వ్యవహరించారో తెలియదు.
ఇంతకూ ఏప్రిల్ 8వ తేదీ నాటి తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిందేమిటి? ప్రజలు రాజ్యాంగం ప్రకారం ఎన్నుకున్న చట్టసభలు నిబంధనల మేరకు ఆమోదించిన బిల్లులకు తమ స్థాయిలో ఆమోదం తెలుపటంలో గవర్నర్లు గాని, రాష్ట్రపతి గాని అసమంజసమైన జాప్యం చేయరాదని. నిబంధనలకు లోబడి పరిశీలించటం, పున:పరిశీలన కోసం అసెంబ్లీకి తిప్పి పంపటం వంటివి సరే. కానీ, అవే నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ తాను చేయవలసిందంతా చేసిన తర్వాత ఏదో ఒకటి తేల్చటంలో విపరీత జాప్యాలు ఎందుకు? అసెంబ్లీ రెండవసారి ఆమోదించినాక ఇక ఆపేందుకు వీల్లేదన్న నిబంధనను పాటించకపోవటమెందుకు? అట్లా జరిగినప్పుడు, అందులో రాజ్యాంగంతో నిమిత్తం లేని రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే అనుమానం సహజంగా కలుగుతుంది. న్యాయమూర్తులు చేసింది, ఒకవైపు రాజ్యాంగ నిబంధనలకూ, స్ఫూర్తికి, మరొకవైపు ప్రజాస్వామిక పాలనకు అనుగుణంగా ఉండేట్లు, బిల్లుల ఆమోదానికి మూడు నెలల గడువు విధించటం మాత్రమే. గవర్నర్లకు, రాష్ట్రపతికి కూడా. మూడు నెలలకు మించితే ఆ బిల్లులు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లేనని కోర్టు స్పష్టం చేసింది. అందులో ఆక్షేపించవలసిందేమీ కన్పించదు. పైగా స్వయంగా కేంద్రమే ఇటువంటి గడువుతో 2016లో మూడు మెమోలు జారీచేసినట్లు కోర్టు గుర్తుచేసింది. నిజానికి రాష్ట్రపతి లేఖను అవకాశంగా తీసుకుని గవర్నర్లు, రాష్ట్రపతితో పాటు స్పీకర్ల అధికారాలు, పరిమితులను కూడా న్యాయమూర్తులు నిర్వచించినట్లయితే ప్రజాస్వామ్యానికి చాలా మేలు జరుగుతుంది.
ఇంత జరిగి, ఇంత స్పష్టత వచ్చిన తర్వాతనైనా కేంద్రప్రభుత్వం, అధికార పార్టీ వారు తమ తప్పిదాన్ని గుర్తించి వైఖరిని మార్చుకోలేదు. రాష్ట్రపతి ద్వారా రకరకాల సాంకేతిక ప్రశ్నలతో సుప్రీంకోర్టుకు లేఖ రాయించారు. అందువల్ల కోర్టు మౌలిక ఉత్తర్వుల పరిస్థితి మారేది ఏమీ ఉండదని, న్యాయనిపుణులు గతంలోనూ తలెత్తిన ఇదే విధమైన కేసులను ఉదహరిస్తూ స్పష్టం చేస్తున్నారు. గవర్నర్ రవికి సుప్రీంకోర్టు ఇదే బిల్లుల విషయంలో ఆదేశాలు జారీచేయగా, ఆయన కొన్ని ఆమోదించి, కొన్ని చేయక తన చమత్కారాన్ని ప్రదర్శించారు. దానిపై కోర్టు ఆగ్రహించి ఈ తాజా తీర్పు చెప్పింది. అయినప్పటికీ గ్రహించక రాష్ట్రపతికే ఆదేశాలిస్తారా? అంటూ తమ అధికార దురహంకారాన్ని బీజేపీ నేతలు ప్రదర్శిస్తున్నారు. ఈ మొత్తం సంఘటనల పరంపరపై బయట ఈ దేశ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో గమనించాలనే ఆలోచన ఎవరికైనా కలుగుతున్నదా? రాజ్యాంగ పీఠిక మొదటి వాక్యమే ‘ఈ దేశప్రజలమైన మేము’ అంటూ ఆరంభమవుతుంది. కానీ గవర్నర్లు, బిల్లులు, రాష్ట్రపతుల విషయానికి సంబంధించి, ప్రతిపక్ష ప్రభుత్వాల పట్ల కాంగ్రెస్, బీజేపీల బాహాటమైన రాజ్యాంగవిరుద్ధ, ప్రజాస్వామ్య విరుద్ధ, ప్రజాభావనల విరుద్ధ వ్యవహరణలు, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకొనేందుకే సిగ్గు కలిగించే విధంగా ఉన్నాయి. ఎప్పుడైనా పెద్దదా, చిన్నదా అనే పరిమాణాల కన్నా ఎంతటి ప్రమాణాలు కలదన్నదే లెక్కించదగ్గది కావాలి. ఆ విధంగా చూసినప్పుడు ఈ పార్టీలు మన ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా, తమ అధికారం కోసం భ్రష్టుపట్టిస్తున్నాయి.