కేసీఆర్ అంటే ఒక ఉద్యమకారుడు, ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఆయనను మరోకోణం నుంచి చూస్తే ఒక మానవతా మూర్తి కనిపిస్తారు. ఆయనది మానవీయ కోణం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రవేశపెట్టే ఏ పథకమైనా మానవతా దృక్పథంతో కూడుకుని ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించిన పథకాలన్నీ కూడా ఆయనలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అని బయలుదేరినప్పుడు ‘గీ బక్కపలుచనోడు ఏం జేత్తడు తీయ్, గాయనతోని ఏమైతది’ అనుకున్నవాళ్లే. కానీ వారందరి ఆలోచనలకు చెంప పెట్టులా అనుకున్నది సాధించి పెట్టిండు. ఇయ్యాల మన రాష్ర్టా న్ని సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిండు. తెలంగాణ వచ్చాక ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా లబ్ధి పొందేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బాపు కేసీఆర్‌ది.
మనది వ్యవసాయం, కులవృత్తుల మీద ఆధారపడిన రాష్ట్రం. వలసపాలనలో వ్యవసాయం దండుగన్నారు. కులవృత్తులు నిరాదరణకు గురయ్యాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకటే ఆలోచించారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అన్నీ మెరుగుపడాలి. ముఖ్యంగా విద్యావిధానం మెరుగుపడాలనే ఆలోచన చేశారు. అందుకోసం అందరికీ విద్య అందాలని సంకల్పించారు. అన్ని కులాల నిరుపేదలకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గురుకులాల మాట దేవుడెరు గు. అసలు అలాంటివి రాష్ట్రంలో ఉన్నాయనే విషయమే చాలామందికి తెలియదు. అందరికీ తెలిసినవి రెండే రెండు అవి సర్కారు బళ్లు, లేకుంటే ప్రైవేట్ బళ్లు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు ఎక్కడో ఒకటి రెండు తప్ప పెద్దగా లేవు. తెలంగాణ ఏర్పాటుకు ముం దు రాష్ట్రంలో 291 గురుకులాలు మాత్రమే ఉండేవి. అయితే స్వరాష్ట్రంలో గురుకులాలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వాటి సంఖ్యను దశల వారీగా పెంచు తూ రావటంతో నేడు రాష్ట్రంలో 1,005 గురుకులాలకు చేరాయి. ఇందుకోసం రూ.30 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. గురుకులాల్లోని ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు వెచ్చిస్తున్నది. ఈ లెక్కన తెలంగాణలో 6.5 లక్షల మంది విద్యార్థులు గురుకులాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల విద్యార్థుల తల్లితండ్రులకు ఆర్థిక భారం తగ్గుతున్నది.
ఈరోజుల్లో తల్లిదండ్రులకు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అన్ని కులాల్లోనూ పేదలున్నట్టే అగ్రవర్ణాల్లోనూ చాలామంది పేదలున్నారు. వారు తమ పిల్లల్ని చదివించాలంటే కత్తిమీద సాముగానే ఉంటుంది. తల్లితండ్రులకు గుదిబండగా మారిన కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనేది కేసీఆర్ సంకల్పం. ఆ సంకల్పంతోనే కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను పదింతలకు పెంచిండ్రు. తద్వారా ప్రతి నిరుపేద బిడ్డకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు కేసీఆర్. ఇన్నాళ్లు బీసీ కులాల వరకే పరిమితమైన గురుకులాలను అగ్రవర్ణ పేదలకు కూడా అందుబాటులోకి తెస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఇది చారిత్రత్మక నిర్ణయమనే చెప్పాలి.
పేరుకే అగ్రవర్ణాలైనప్పటికీ వారిలోనూ రోజు పని చేసుకుంటే తప్ప పూట గడవని పేద కుటుంబాలు అనేకం ఉన్నాయి. పేరుకు పెద్ద ఊరికి దిబ్బ అన్నట్టు ఉంది చాలామంది ఓసీల పరిస్థితి. పిల్లల్ని చదివించే స్థోమత లేక ఏమి చేయాలో తెలియక అప్పులపాలవుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. సరస్వతి పుత్రులైనా చదవలేని పరిస్థితి. ఈ పరిస్థితిని గుర్తించిన కేసీఆర్ ఈ టర్మ్‌లో అగ్రవర్ణాలకు గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తద్వారా అగ్రవర్ణ పేదలకు గురుకులాలు అందుబాటులోకి రానున్నాయి. దీనిద్వారా చాలామంది పేదలు నాణ్యమైన విద్యను పొందే అవకాశం లభిస్తుంది. ఇది ఆచరణలోకి వస్తే ఎంతోమంది అగ్రకులాల నిరుపేదలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచన రావడం కేసీఆర్ మానవీయతకు అద్దం పడుతున్నది. ఈ ప్రకటనను అగ్రవర్ణ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఓసీ బిడ్డలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణ నిరుపేద బిడ్డలకూ ఒక్క రూపాయి ఖర్చులేకుండా చదువుకునే సౌకర్యం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.
– మూల విజయారెడ్డి 95283 66666