గౌతమ బుద్ధుడు అడుగు మోపిన
అస్మక గణం తొలి తెలుగు నేల
తంగేడు పూల కాంతుల్లో
నింగిని పూసిన నక్షత్రాలు
బురుక బండ్ల సవ్వారులో
తెలంగాణ గిత్తల పోరు అచ్చులు
మన తెలంగాణ!
ఎత్తయిన మట్టికోట ముందు ఎల్లమ్మ ఎండి బోనం
నాగమ్మ ఈరకోల, సారక్కల యుద్ధకత్తి
పోశమ్మ, మైసమ్మల కల్లుసాకలు
పోతురాజుల వీరత్వాలు బీరప్పల ఒగ్గుకథలు
అంబరం ముద్దాడే ఆది తల్లుల ఏడు దినాల గంగపూజలు
యాదాద్రి నరసన్న భద్రాది రామన్న
ఎములాడ రాజన్న కొండగట్టు అంజన్న
అష్టాదశ శక్తిపీఠం జోగుళాంబ దేవాలయం
ప్రేమ సముద్రం మెదక్ చర్చి
జాన్పాడ్ ఉర్సు, జహంగీర్ పీర్ దర్గాలు
సకల సంస్కృతుల సింగిడి
మన తెలంగాణ!
గణపసముద్రం, రామప్ప చెరువులు
దుందుభి జంపన్నవాగుల జీవధారలు
పాలమూరు కాళేశ్వరాలు
కరువును తరిమికొట్టే గుండె చెలిమెలు
జమ్మిచెట్టుపై పాలపిట్టల దరువులు
ఉగాది రుచులు సంక్రాంతి కోలాటం
జడకోపుల సంబురం మన తెలంగాణ!
గోల్కొండ కోట రాజస చిహ్నమై
చార్మినార్ చార్ సౌ సాల్ షహర్ హమారా
రాజముద్ర కాకతీయ కళాతోరణం
ట్యాంక్‌బండ్ ఒడ్డాణం
చదువులతల్లి ఉస్మానియా
భిన్నజాతుల వన్నె సోయగం హైదరాబాద్
మన తెలంగాణ!
రాత్రిని నిద్రపోనియ్యని
ఆకుపూజ భజనల మద్దెల మెరుపులు
హనుమద్దాసుల సంకీర్తనలు
చిందు ఎల్లమ్మ అడుగులు
మిద్దెరాములు అందెల సవ్వడులు
భూమి గజ్జెలు కట్టె గొల్లసుద్దులు
జమిడీకే జజ్జనక జన్ మన తెలంగాణ!
కుమ్మరి వాములు కమ్మని కూరాడులు
కమ్మరి కొలుములు చేతివృత్తుల దీపాలు
గంగపుత్రుల వలలు వడ్డెరాజుల గన్నులు
ఆరె, రంపం, పన్రాయి గూటాలు
గీత కత్తి, మేదరుల చాట, గంపలు
నాగరికతకు నారుపోసిన చాకిరేవు మంగలి అసిపెలు
సమస్త వృత్తుల కళాఖండం మన తెలంగాణ!
ఉద్యమాల ఊపిరిగా నెత్తురోడిన నేల
మోదుగుపూలు పూస్తున్నది
ఆకలికి ఆదెరువును ప్రశ్నించిన ప్రజలకు
పచ్చని ప్రవాహమై బదులిచ్చింది
భరోసాగా నిలుస్తానంది
అఖండ త్యాగఫలం మన తెలంగాణ!
వనపట్ల సుబ్బయ్య
94927 65358