ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నది. పాడియావు లాంటి వ్యవసాయంపై కార్పొరేట్ కంపెనీలు ఎప్పటినుంచో కన్నేసి ఉంచాయి. వరుసబెట్టి ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేట్లకు అడ్డికి పావుశేరు లెక్కన ఇచ్చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారు వ్యవసాయాన్ని కూడా అదే ఖాతాలో వేసేందుకు తహతహలాడుతున్నది. రైతు మెడ మీద కాడిపెట్టి కార్పొరేట్ల చేతికి పగ్గాలు ఇవ్వాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నది. అందులో భాగంగా తెచ్చినవే మూడు వ్యవసాయ నల్లచట్టాలు. రైతులు ఆ చట్టాలను తిప్పికొట్ట్టేందుకు జరిపిన హోరాహోరీ పోరాటం చరిత్రకెక్కింది. ఈ పోరాటంలో భాగంగా జరిగిన ఢిల్లీ ముట్టడిలో 750 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి తలవంచింది. నల్లచట్టాలను వెనుకకు తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారు. కానీ వ్యవసాయానికి ఉరి వేసేందుకు ప్రయత్నాలను పూర్తిగా మానుకోలేదు. రకరకాల కొర్రీలతో రైతులను వేధించడం ఆపలేదు.
కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలన్న ఆలోచన కేంద్రానిది అయినప్పటికీ అందుకవసరమైన విధి విధానాలను రూపొందించింది మాత్రం శరద్ మరాఠే అనే ఓ టెకీ అని ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ అనే సంస్థ బయటపెట్టింది. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న ఈ పెద్దమనిషికి వ్యవసాయంతో ఉన్న సంబంధమేమిటో తెలియదు. ఆయన రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారమే కేంద్రం దేశంలో సాగు భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధం కావడం విడ్డూరం. నిజానికి వ్యవసాయాదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016లో మోదీ ప్రకటించారు. ఓ కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి శరద్ మార్గనిర్దేశకత్వంలో కేంద్రం కార్పొరేట్ వ్యవసాయానికి గేట్లు బార్లా తెరవాలనుకోవడం వైపరీత్యం కాకపోతే మరేమిటి? ఆయన ఇచ్చిన సలహాలు చూస్తే ఎవరికైనా కండ్లు బైర్లు కమ్ముతాయి. చిన్న కంపెనీలు వ్యవసాయం చేసి దిగుబడులను తీస్తాయంట. పెద్ద కంపెనీలు ఆ దిగుబడులను మార్కెట్ కు అనుగుణంగా ప్రాసెసింగ్ చేసి దండిగా లాభాలు సంపాదించి పెడ్తాయట. అందులో కొంత వాటా రైతులకు ఇస్తారట. ఈ దిశగా కేంద్రం పరిశీలనకు స్వీకరించిన కార్పొరేట్ కంపెనీల్లో అదానీ గ్రూప్, పతంజలి ఉండటం గమనార్హం.
కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు ఈ సలహాలు నిజానికి రైతును పూర్తి నిస్సహాయున్ని చేసేవిధంగా ఉన్నాయని పైకే తెలుస్తున్నది. వ్యవసాయం జుట్టు కార్పొరేట్ల చేతికి అందించి తమాషా చూసే విధానం ఇది. రైతును తన పొలంలో తానే జీతం డబ్బుల కోసం కూలీగా మార్చేందుకు దారితీసే దివాళాకోరు సలహాలివి. వీటి తోక పట్టుకుని ముందుకుపోయిన కేంద్రం రైతు ఉసురు తీసేందుకు సిద్ధమైంది. రైతుకు అవసరమైన వనరులు అందించి, దిగుబడులకు మద్దతు ధర కల్పిస్తే సాగు బాగుపడుతుంది. తెలంగాణ మాడల్లో ఇదే అతి ముఖ్యమైన అంశం. కానీ కేంద్రం నమ్ముకున్న గుజరాత్ మాడల్లో కార్పొరేట్లకు తప్ప కర్షకులకు స్థానం లేదని తేలిపోయింది.