పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు, అడవి వనరుపై ఆధారపడేవారు, అటవీశాఖ వారి అజమాయిషీ, మధ్య దళారుల చేతుల్లో మోసపోతూ పేదరికంలో మగ్గుతూ, నాగరిక సమాజానికి దూరంగా, విద్యకు దూరంగా ఉంటూ వస్తున్నవారు గిరిజనులు, బంజారాలు.
వీరి జీవితాలపై సాహితీకారుల దృష్టి పడలేదా? సంస్కృతీ పరంగా గ్రామీణ, పట్టణ ప్రజలకు దూరంగా నివసిస్తున్న ఆదివాసీ గిరిజన తెగలు, గ్రామీణ, పట్టణ ప్రజలతో తమ సంబంధాలు సమన్వయం చేసుకునే తెగల మధ్య వైవిధ్యాలున్నప్పటికీ సృజనాత్మకమైనసంబంధాలున్నాయా? ఉంటే వాటిని కథా రచయితలు తమ సృజనలో వ్యక్తీకరించారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రావడానికి ముందు, వచ్చిన తర్వాత గిరిజనులు, బంజారా జీవితాల భాష, సంస్కృతీ పరంగా ఎలా కథల్లో చిత్రీకరించబడి నాయో ఒకసారి స్థూలంగా పరిశీలిద్దాం…
‘కాయ్ కరీచి, దసేక్ పీయెర్ పానీలా, ఆజ్ కామ్ వారుయేగో’ (ఏం జేస్తున్నవ్, గిన్ని మంచినీళ్లు తేరాదు. ఇవ్వాళ ఒంటి నిండా పని పడ్డది) పిలిచాడు లచ్చిమిని . ‘మార్ హాత్ నకామ్ ఛేయ్, ఆటో భేల్ రిచూ, తూజ్ మాయిజాన్ లియా! ’ (పిండి కలుపుతున్నానయ్యా, నా చేతులతో ఇయ్యలేను గాని లోపలికి పొయి నువ్వే తెచ్చుకో) జొన్నపిండిలో వేడి నీళ్లు పోసుకుంటూ రొట్టెలు చేయడానికి సిద్ధమవుతున్న భార్య లచ్చిమితో భర్త జరుపుతున్న సంభాషణ బంజారా భాషలోనే నడపడం కథలోని విశిష్టత. లచ్చిమి శీర్షికతో ఉన్న ఈ కథా రచయిత కటుకోజ్వల ఆనందాచారి. జొన్నరొట్టెలు బంజారాల ఆహారం మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో ఒక భాగం కూడాను.
ఇప్పటి తరానికి చెందిన లచ్చిమి కొడుకు సుందర్ నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు జొన్నరొట్టెలు తినడం, బంజారా భాషలో మాట్లాడటం నామోషీగా భావిస్తూ అత్త మామలకు, తన పల్లెకు దూరంగా ఉంటుంది. తీజ్ పండుగకు తండాకు రానని చెప్పేస్తుంది. ఆహారమే కాదు ఆహార్యం (బంజారా వస్త్రధారణ) కూడా ఆమెకు నచ్చదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి వచ్చిన తండావాసులు ఈ దంపతులు. జొన్నరొట్టెలు చేసి అమ్ముకొని వారు జీవనోపాధి పొందుతున్నారు. అలా పట్టణాల్లో బంజారాలు బతుకడం సాధారణమైపోయింది. బంజారాలే గాక నగరవాసులు సైతం ఇష్టంగా తినే జొన్నరొట్టెలను, గిరిజన సంస్కృతిని అసహ్యించునే దుస్థితి గిరిజన కుటుంబాల్లోనే మొలకెత్తడం విచారకరం. నగరాలకు వలస రావడం, విద్య, ఉద్యోగాల కారణంగా నగరీకరణం చెందుతున్న యువతరం గిరిజనుల్లో వారి భాషా సంస్కృతులపై ప్రభావం చూపుతుందని ఈ కథ ద్వారా వ్యక్తమవుతున్నది.
1932, అక్టోబర్‌లో ‘భారతి’లో ప్రచురణ పొందిన గూడూరు రాజేంద్రరావు కథ ‘చెంచి’, చింతా దీక్షితులు కథ ‘చెంచు రాణి’ (Ref: ‘ఇప్పపూలు’, జీవన్ సంపాదకత్వంలో వచ్చిన కథా సంకలనం, పరివర్తిత ముద్రణ-2023) కథల్లో చెంచుల భాషకన్నా వారి జీవితాలను చిత్రించడం మీదనే ఎక్కువ దృష్టి నిలిపారు.
‘చెంచి’ కథలో అగ్రకులాల వారు, వడ్డీలకు ఇచ్చి పీడించే మధ్య దళారులు కాబూలీలు, చెంచు ఆడవాళ్లపై వీరు చేసే అత్యాచారాలు కథా వస్తువులయ్యాయి. చింతా దీక్షితులు ‘చెంచురాణి’ కథ ఒక ప్రత్యేక శైలి, కథనంతో నడిచింది. ఇందులో కొంత తాత్వికత, కొంత ఊహ, కల్పన కనబడుతుంది. అయినా చెంచుల్లో ఉండే ఆచారవ్యవహారాలు, స్త్రీ, పురుష సంబంధాలు చిత్రీకరించబడినాయి. ఈ రెండు కథల్లో చెంచుల సంస్కృతీ, జీవనశైలి, ఆచారాలు, అప్పటి పంచాయతీ తీర్పులు, వాటి పరిణామాలు, మానవ సంబంధాలు చూపబడినాయి. కానీ, చెంచుల భాష తీరు, పాత్రల మధ్య సంభాషణలు తక్కువగా ఉండి వారి యాస, భాష కనబడదు.
ఆచార్య సూర్యా ధనంజయ్ కథ ‘అంబాలి’లో భల్లూనాయక్ తండాకు చెందిన సేవ్య కూతురు పేరు అంబాలి. అంబాలికి బాలుతో వివాహం అయ్యాక అనుకోకుండా పిడుగుపడి అతను మరణిస్తాడు. దాంతో ఆమె అత్తామామలు, తండా పెద్దలు కలిసి బాలు తమ్ముడు, సొంత మరిది దస్రు నాయక్‌తో అంబాలికి వివాహం జరిపించాలన్న ఆలోచనతో ఉండి పెద్దలంతా ఒక నిర్ణయానికి వస్తారు.
భర్త చనిపోతే అతని తమ్ముడితో వివాహం జరిపించడం కొన్ని గిరిజన తెగల్లో ఒక సంప్రదాయం లేదా ఆచారంగా వస్తున్నది. ఈ సంప్రదాయాన్ని దేవర న్యాయ వివాహంగా పరిగణిస్తారు. కానీ, ఈ వ్యవహారం అంబాలికి నచ్చదు. ఆధునిక భావాలు కలిగిన అంబాలి గిరిజన తెగకు చెందిన అరుణ బాయిని అనుసరిస్తుంది. అరుణ బాయి సామాజిక కార్యకర్తగా బాధిత గిరిజనులకు సహాయపడుతుంది. ఆమె గురించి తన తల్లి భూరి ద్వారా వింటుంది అంబాలి. తల్లి భూరి కూడా సంతానవతి కాకపోవడంతో భూరి అత్త తన కొడుకు సేవ్యకు రెండవ పెళ్లి జరిపించాలని ఆలోచిస్తుంది. రెండు పెండ్లిళ్లు కూడా గిరిజనుల సంస్కృతీ ఆచారాల్లో భాగమే. భూరి భర్త సేవ్య మంచివాడు కావడంతో అరుణబాయి సహాయం తీసుకుంటాడు.
ఆమె అన్ని విచారణలు చేసి భూరి శారీరక బలహీనత వల్ల తల్లి కాలేకపోతున్నదని బలవర్ధకమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందివ్వమని సలహానిస్తుంది. ఆమె సలహా పాటించడం వల్ల కొన్నాళ్లకు వారికి అంబాలి పుడుతుంది. ఈ కథ ద్వారా రచయిత్రి గిరిజనులకు చదువు లేకపోవడం, పాత ఆచార వ్యవహారాలను పాటించడం కారణంగా వారిలో ఎలాంటి ప్రగతి లేకుండా పోతుందని చెప్పదలుచుకుంది. అరుణ సహాయంతో అంబాలి కూడా తన భవిష్యత్తును బాగుచేసుకోవాలని తండాను వదిలి ఆమెతో వెళ్లిపోతుంది. ఈ కథలో రచయిత్రి స్వయంగా గిరిజన తెగకు చెందినవారు కావడం, తండాలకు చెందిన భాష, ఆచార వ్యవహారాలు తెలియడం వల్ల వారి భాష సంప్రదాయాలను అవసరమైన చోట్ల వ్యక్తీకరించడంతో కథకు ఒక సహజత్వం, అంబాలి పాత్ర చిత్రణకు నేటివిటీ అందివచ్చింది.
‘యాడియే మార్ నసీబ్ ఆచ్చో ఛేని’ (నా తలరాత బాగాలేదు) అనే వాక్యంతో కథ మొదలవుతుంది. పాఠకులకు ప్రారంభంలోనే తెలిసిపోతుంది కథ గిరిజనుల జీవితానికి చెం దినదని. ‘వ్యాయ’ (పెళ్లి), ‘యాడి’ (తల్లి), ‘నసాబ్’ (పంచాయితీ) లాంటి వ్యావహారిక పదాలే గాక సంప్రదాయ రీతుల్లో చేసుకునే పండుగలు తీజ్ బుట్టలు, మేరమా భవానీ పూజ, సీత్ల భవానీ దేవతల ప్రస్తావన ఉం టుంది. లంబాడా స్త్రీలు ధరించే ప్రతి నగకు ఒక పేరు, ప్రత్యేకత ఉంటుంది. చేతులకు ధరించే బలియాలు, మెడలో వేసుకునే రపియార్ హార్, ఫెట్యాల ప్రస్తావన కూడా ఉం టుంది. ఇలా గిరిజనుల భాష, తెగల ఆచారా లు, పద్ధతులు, సంప్రదాయాలు, వస్త్రధారణ, అలంకరణతో పాటు వారి సామాజిక ‘అంబాలి’ కథ అద్దం పడుతుంది.
సాంప్రదాయిక వాయిద్యాలు-తూర్పులి, పారా, దస్మ ప్రస్తావన, కులాచారం పేరుతో పూజలు చేసే ఎత్మా సూర్ పెన్, పెర్శాపెన్, అకి పెన్ దేవతల పేర్ల ప్రస్తావన చేస్తాడు కథా రచయిత. గుస్సాడీల నృత్యరీతి, వారిని ఆదరించే విధానం, ఇవన్నీ కూడా గోండుల భాషా సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలను ప్రతిబింబిస్తాయి.
ధారావత్ ప్రేమ్‌కుమార్ తన కథకు శీర్షికనే ‘బార్ రాంద్ ఖాయేర్’ అని లంబాడ భాషలో పెట్టాడు. సాధారణంగా తండా మొత్తం కలిసి పండుగలా జరుపుకొనే వన భోజన కార్యక్రమాన్ని ‘బార్ రాంద్ ఖాయేర్’ అంటారు. ఈ చిన్న కథలో వన భోజనాల సందర్భంలో జరిగే సంఘటనలను చిత్రీకరిస్తాడు రచయిత. ఈ కథలో గిరిజన భాష ఉంటుంది, కానీ ప్రత్యేకంగా సంప్రదాయాలు, ఆచారాలు వ్యక్తం కావు. ‘కత్తచ్చిరే. తెలుగుమా వాతే కర్రోచ్చి. హప్నే వాతే కర్. గ్వార్ మాటి ఛ అపన్’ అంటే ‘ఏడున్నవ్ రా తెలుగులో మాట్లాడుతున్నవ్, మన భాషలో మాట్లాడు, లంబాడోళ్లం మనం’ అని తండ్రి, కొడుకును మందలించడం చూస్తాం. కథకుడు ఇందులోని పాత్రలకు పేర్లు పెట్టకుండా కేవలం తాత, నాన్న, బావ, బామ్మర్ది అంటూ బంధుత్వాలతోనే పలకరింపజేస్తాడు.
బోంద్యాలు బాణోత్ కథ ‘సీత్లా కర్రెచ’. బంజారాల సంస్కృతికి ప్రతీక అయిన ఈ పండుగ పల్లె, ప్రకృతి అంశాలను ఇముడ్చుకొని ఉంది.
జిల్ల గోనె ఆడుకుంటూ సీత్లా గుడి దగ్గర మోదుగుచెట్టు మొదట్లో నిలువుగా ఉన్న ఏడు రాళ్లను చూస్తడు శేవ్ల నాయక్. మధ్యలో ఉన్న రాయి అన్నింటికన్నా పొడవుగా ఉండి కుడి ఎడమల వైపు ఉన్న రాళ్ల ఎత్తు క్రమంగా తగ్గు తూ ఉంటాయి. శేవ్ల నాయక్ తనకు తెలిసిన పెద్దమినిషి సీత్రాం నాయక్‌ను పండుగ విశేషా లు అడుగుతాడు. ‘సీత్లా, హింగ్లా, తుల్జా, మేరామ, కంకాళి, మత్రాల్, ధ్వాళాంగర్ ఏడుగురు అక్కాచెల్లెళ్లు. వీరు భవానీలకు ప్రతి రూపాలుగా ఏడు రాళ్లను నిలబెడతారు’ అం టాడు. బోనాల పండుగలో పోతురాజు ఉన్న ట్టు బంజారాల్లో కూడా ఈ ఏడుగురు అమ్మవార్లకు ‘లూంకడియా’ అనే సోదరుడుంటాడు. ఈ పండుగ పద్ధతి విధానం అంతా కూడాను బోనాల పండుగను పోలి ఉంటుంది. జూన్‌లో చేసే ఈ పండుగను మంగళవారం రోజు బంజారాలు జరుపుకొంటారు. ‘ఫూల్యా గాల, గొన్నో, ఖాసెర్ థాళీ బంజారా భాషా పదాలతో పాటు బంజారాల సంస్కృతి సంప్రదాయ పద్ధతులు ఈ కథ ద్వారా రచయిత చెప్పడం బావుంది.
-డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్ ,91778 57389