నేడు తెలంగాణ విద్యా దినోత్సవం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రం సాధించిన విజయాలను సంబురంగా జరుపుకొంటూనే భవిష్యత్తు లక్ష్యాలను స్థిరపరచుకుంటూ ముందుకువెళ్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధించిన ఫలితాలను ప్రజల ముందుంచడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు, సురక్షితమైన వాతావరణంలో, అన్ని వసతులతో, సౌకర్యాలతో కూడిన విద్యనందించేందుకు చేపట్టిన గురుకుల విద్యావ్యవస్థ బలోపేతం అనేది భారతదేశంలోనే ప్రథమం అని చెప్పవచ్చు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలో రమారమి 1000 నూతన గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేయడం ప్రభుత్వాధినేత స్థిరచిత్తాన్ని ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో విద్యాప్రగతి కోసం వారికున్న తపనను తెలియజేస్తుంది. ఆ వర్గాలలోని పిల్లల భవిష్యత్తు, వారి భావితరాల సమున్నత అభివృద్ధి, అదే సమయంలో ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం వారి ఉన్నతికి ప్రతిబంధకం కాకూడదన్న ఒక దృఢ సంకల్పం గోచరిస్తున్నది. దాని ఫలితమే నేడు తెలంగాణలోని గురుకుల విద్యాకుసుమాలు. జాతీయస్థాయి పోటీ పరీక్షలలో సాధిస్తున్న విజయాలు. ఏదైనా ప్రయత్నానికి, గొప్ప ఆలోచనకు నిజమైన సార్థకత అనుకున్న లక్ష్యానికి చేరువ కావడమే. గురుకులాల విద్యార్థులు క్రీడలలో, సాంకేతిక విద్య లో, నీట్ లాంటి పరీక్షలలో పర్వతారోహణ వంటి క్లిష్టమైన అంశాలలో చూపిస్తున్న ఫలితాలు, ప్రతిభ ఎవరిసొత్తు కాదు, అవకాశాలు కల్పిస్తే అందరూ విజయానికి సోపానాలు వేసుకోగలుగుతారని రుజువు చేస్తున్నది.
నేడు గురుకులాల్లో ప్రవేశాల కోసం మంత్రు లు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల రికమండేషన్లకు అవసరం వచ్చిందంటే, ప్రవేశాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పోటీ పడుతున్నారంటే, గురుకుల విద్యలో ప్రభుత్వం పెట్టిన శ్రద్ధనే కారణం. ప్రధానంగా ఆర్థిక, సామాజిక వెనుకబాటు ఉన్న వర్గాలలో ఆడపిల్లలు ఎక్కువకాలం చదువకపోవడం, ఉన్నత విద్యకు వెళ్లే సావాసం చేయకపోవడం, ఫలితంగా ఆర్థిక అనిశ్చితి మధ్యంతరంగా పెళ్లి చేసుకోవాల్సి రావడం వంటి పరిస్థితులు ఉండేవి. ఇలాంటి పరిస్థితులున్న పిల్లలకు ఇవాళ ప్రభుత్వ బడుల పటిష్ఠత, గురుకుల విద్య ఒక వరమైందని చెప్పవచ్చు. ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి ద్వారా దొరికిన ఒక భరోసా ఆడపిల్లల విద్య కొనసాగింపునకు ఒక మార్గమైందని చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంతో మార్పునకు కారణమైందని చెప్పవచ్చు. చదువు నుంచి పెళ్లి వరకు, బిడ్డకు తల్లయ్యేంతవరకు కూడా ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాలు, కల్యాణలక్ష్మి, గర్భిణీ స్త్రీల సంరక్షణ, ప్రసూతి కేంద్రాలు, ప్రోత్సాహకాలు, ఆపై కేసీఆర్ కిట్ ఈ రకంగా స్త్రీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి వారిలో భద్రతాభావాన్ని పెంపొందించడమే కాదు, పూర్తిస్థాయిలో చదువును కొనసాగించి అనుకున్న మేరకు లక్ష్యాన్ని పూర్తిచేసుకోవడానికి ఒక భరోసానిచ్చిందనడంలో సందేహం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల కోసం ఏర్పాటుచేసిన స్టడీ సర్కిళ్లు ఆయా వర్గాలు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తోడ్పడుతున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన గ్రం థాలయాలు, పటిష్ఠం చేయబడినవి. నూతనంగా ఏర్పాటుచేసిన రీడింగ్ కార్నర్లు, పఠనా సామర్థ్యా న్ని పెంచుకునే కేంద్రాలవుతున్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులకు సహాయపడుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ ద్వారా రాష్ట్రంలోని 26,065 పాఠశాలల్లో 12 అంశాల ను చేపట్టి ఆధునీకరిస్తున్నది ప్రభుత్వం. కాం పౌండ్ వాల్స్, తాగునీరు, నూతన టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, పై కప్పుల పరిరక్షణకు రిపేర్లు, పాఠశాల ప్రాంగణంలో అవసరమైన రిపే ర్లు, ఎలక్ట్రిక్ వ్యవస్థ ఆధునీకరణ, గ్రీన్ బోర్డులు, డ్యూయల్ డెస్కులు, డిజిటల్ విద్యకు ఐ.ఎఫ్.పీ తదితరాలు గ్రామీణ బస్తీ పాఠశాలలను పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యాబోధన చేసేందుకు తీర్చిదిద్దుతున్నాయి. అల్పాహారం, ఏకరూప దుస్తులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితరాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సౌకర్యవంతమవుతున్నాయి. ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా విదేశీ విద్యకు కూడా ప్రభుత్వ సాయం అందుతున్నది. సాధారణ కుటుంబాల పిల్లలు బాగుండాలి, వారి చదువుల్లో వెలుగులు నిండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారం అవుతున్నది.
యూనివర్సిటీలలో ఆధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు సంకల్పించిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో నూతన హాస్టళ్లు, పరిపాలన భవనాలు, ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు, ఆధునీకరణకు, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కార్యాచరణకు పూనుకున్నది.
పై విధంగా రాష్ట్రంలో పాఠశాల విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. దశాబ్ది ఉత్సవాల సాక్షిగా ఈ సంకల్పం మరింత దృఢతరమై రాబో యే రోజుల్లో, కేసీఆర్ నేతృత్వంలో, రాష్ట్రంలో విద్యావ్యవస్థ భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.
రావుల శ్రీధర్‌రెడ్డి: 9985575757 (వ్యాసకర్త: టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్)