అవును, కొందరికి ప్యాంటు తడుస్తున్నది. తెలంగాణ వాదం మళ్లీ ముందుకు వస్తున్నదనే భయం పట్టుకున్నది. తెలంగాణ అస్తిత్వం అణగారి పోలేదని బెంగ కలుగుతున్నది. పరోక్షంగానైనా తెలంగాణను గుప్పిట్లో ఉంచుకోవాలనే ఆశ ఆవిరైపోతుందేమోననే బాధ కలుగుతున్నది. అదే బాబుగారి బంటు పత్రికలో ఆవేశ, ఆగ్రహ, విలాప, వికృత, రచనాకృతియై దర్శనమిచ్చింది.దాని నిండా స్వకుచమర్దనలు, నీలాపనిందలు, మేకపోతు గాంభీర్యాలు.. వెరసి ముప్పాతిక పేజీలో పరుచుకున్న పచ్చ పార్టీ ఎజెండా సాక్షాత్కారం కనిపించింది.
ఎవడు అవునన్నా.. కాదన్నా.. ఎన్ని కతలు పడ్డా ఇది తెలంగాణ రాష్ట్రం! ఇదొక ఉద్వేగభరిత భావన! ఆ భావన అనుక్షణం రగలడానికి కావలిసినంత పునాది ఉన్నది. పుంఖానుపుంఖా ల చరిత్ర ఉన్నది. పురాణకాలం నాటి అస్మక మహాజనపదం నుంచి మొదలుకొని ఉమ్మడి రాష్ట్ర పతనం దాక అనేకానేక అనుభవాల అవిచ్ఛిన్న పరిణామక్రమం ఉన్నది. స్వాతంత్య్రం కోసం పెనుగులాట ఉన్నది. కోట్లాది మందిని ఏకతాటి మీదికి తెచ్చి రాష్ట్రం సాధించిన ఘనతా ఉన్నది. ఇవాళ ఎవడికో పేరు విని ప్యాంటు తడుస్తుందని.. ఈ భావనలను తుడిచేసేలా బీజాలు వేయాలనుకుంటే అది కుదరదు. చరిత్రతో కలిసి నడిచిందెవరో… చరిత్ర సృష్టించిందెవరో.. తెలంగాణ అనగానే కళ్లముందు మెదిలేదెవరో.. ఈ గడ్డమీద నిక్కరు వేసుకోని పిల్లాడు కూడా చెప్తాడు.
మీ జాగీరా? అనే హక్కు ఈ జాగీరు కన్న బిడ్డకే తప్ప, ఎక్కడినుంచో పొట్టచేత పట్టుకొని బతుకడానికి వచ్చినోడికి లేదు. బరాబర్ ఇది మా జాగీరు. మాకు మాత్రమే చెందిన జాగీరు! మా చెమట.. మా రక్తం.. మా శ్వాస.. మా ధ్యాస అన్నీ కలగలిసి మాకిచ్చిన జాగీరు. బల్లగుద్ది చెప్తాం. ఢంకా బజాయించి చెప్తాం! బాబులకైనా.. వారి బంట్లకైనా!!
ఓర్వలేని శక్తులు ఎప్పుడూ కేసీఆర్‌ను.. తెలంగాణను విభజించి చూపించడానికి ప్రయత్నించాయి, ప్రయత్నిస్తాయి. అయితే ఈ రెండూ వేరా?. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 60 ఏండ్లుగా ఎందరో ప్రయత్నించారు. అయితే వారెవరినీ ప్రజలు పూర్తిగా ఓన్ చేసుకోలేదు. కొన్నిసార్లు ప్రజలు ఓన్చేసుకున్నా పదవులు, ప్రలోభాలకు చిక్కుకున్నవాళ్లు తెలంగాణను ఓన్ చేసుకోలేదు. వారెవరికీ యాక్సెప్టన్సీ రాలేదు. కేసీఆర్‌కు మాత్రమే వచ్చింది. కేసీఆర్ ఎంత కమిట్మెంట్తో పనిచేస్తే తెలంగాణ వచ్చిందో ప్రజలంతా గమనించారు. ఎన్ని లక్షల తిట్లు తిన్నాడో.. ఎన్ని అవహేళనలను ఎదుర్కొన్నాడో.. ఎన్ని కుట్రలను ఛేదించాడో.. ఎన్ని తుపాన్లను ఢీ కొట్టాడో.. ఎంత తపన పడ్డాడో ప్రజలంతా చూశారు. ఏ రోజైనా విసిగిపోయి ఏ కాంగ్రెస్‌లోనే చేరిపోయి ఉంటే తెలంగాణ వచ్చేదా? అనేది అందరికీ తెలుసు. ఇవాళ ఎవరికో తెలంగాణ అంటే కేసీఆరా? బీఆర్ఎస్సా? అనే డౌట్ రావడం అవివేకం. నరనరాల్లో తెలంగాణ వ్యతిరేకతను నింపుకొన్న వ్యక్తి నుంచి ఈ ప్రశ్న రావడం అసందర్భం. బంటుగారికో, మరొకరికో కేసీఆర్‌ను తెలంగాణను వేర్వేరుగా చూడాలనే కోరిక ఉండవచ్చు. కానీ, కేసీఆర్‌ను, తెలంగాణను ప్రజలు వేరు చేసి చూడలేరు. చూడటం లేదు. ఇది నిజం. ఆయన మాత్రమే తెలంగాణ నాయకుడు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ పార్టీ. ప్రతి ఇంటి పార్టీ గతంలో కూడా కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చిందా? అనే భావజాలాన్ని ఆం ధ్రా వలసవాదులు తాము పోషించే అనేక సం ఘాలు, సంస్థలు, మేధో మూకలు, మీడియా ద్వారా బలంగా తెలంగాణ మెదళ్లలో జొప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ జాగీరా? అని మరో కొత్త భావనకు విషబీజం వేసే ప్రయత్నం మొదలైంది. ఎందుకు? ఓ ఆంధ్రా కూటమిని తెలంగాణలో అధికారానికి తేవాలంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వ భావన ఉండకూడదు. దానికి ప్రతీక అయిన కేసీఆర్ తెలంగాణ ఎజెండాతో రంగంలో నిలవకూడదు. ఆ మేరకే ఇపుడు ఒక పత్రిక కాలమ్‌లో ప్రారంభమైన ఈ భావనను రేపు ఆంధ్రపోషిత సంఘా లు, సంస్థలు, మేధోమూకలు, మీడియా భారీ ప్రచారంతో ప్రజ ల మెదళ్లలో జొప్పించే కుట్ర ప్రారంభమైందనేది సుస్పష్టం.
బంటుగారి దృష్టిలో తెలంగాణ నాయకులు మరుగుజ్జులు. హ్రస్వ దృష్టి కలిగినవాళ్లు. అందుకే జగదీశ్రెడ్డిలాంటి సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రజానేతను మరుగుజ్జు అనేశారు. జగదీశ్‌రెడ్డి మరుగు జ్జు నాయకుడు కాదు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా నాయకుడు. అంధకార బంధురమవుతుందని అంతా అనుకున్న పసి రాష్ట్రంలో 24 గంటలపాటు కరెంటు ఇచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ మంత్రి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా 25 ఏండ్లపాటు ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన చైతన్యశీలి. కాంగ్రెస్ అహంకరిచే నల్లగొండలో దానికి ఎదురొడ్డి నిలిచి చుక్కలు చూపించిన నాయకుడు. కుట్రపూరితంగా వ్యక్తిత్వ హననాలకు దిగితే చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు. ‘థంబ్నెయిళ్లలో చిన్న పొరపాటు’..‘చిన్న సారు.. పెద్ద సారు’ అంటూ మతిలేని వాగుడుకు దిగే పచ్చవాతరోగులకు; ఆత్మగౌరవం దెబ్బతింటే పెల్లుబుకే ప్రతిస్పందనలు అర్థం కావు. ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసం వెనుక ధర్మాగ్రహం నుంచి వారు పాఠాలు నేర్చుకోలేదు.
తెలంగాణకు సహనం ఎక్కువ. అయితే అది చేతకానితనం కాదు. చాలా రాజ్యాలు చూశాం. సామ్రాజ్యాలు చూశాం. 224 ఏండ్లు ఓపిగ్గా చూసి నిజాం ను దింపిన చరిత్ర తెలంగాణది. 60 ఏండ్లు ఓపిక పట్టి పరాయి పాలకులను కరకట్టలకు తరిమేసిన చరిత్ర తెలంగాణది! రాజ్యాలనే దింపేసిన తెలంగాణకు కుళ్లు మీడియా, కుల మీడియా ఓ లెక్క కాదు. ఓపిక మాత్రమే లెక్క.
బంటుగారి వాచాలత అన్ని హద్దులు దాటింది. బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రా మీడియా అనే వాదాన్ని తెరపైకి తెస్తున్నారంటాడు. ఎవరు తీసుకొచ్చేదేంటి? అనుక్షణం మీ రాతలు, రోతలతో మీకు మీరే ఆంధ్రా మీడియాగా ప్రకటించుకుంటున్నారు. అక్కడి మీడియాగా మీరే లేబుల్లు వేసుకుంటున్నారు. పెద్దసారు, చిన్నసారుకు వ్యతిరేకంగా కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ప్రమాదంలో పడుతుందనేది ఆయనకొచ్చిన డౌటు. అసలు పెద్దసారు, చిన్నసారుకు వ్యతిరేకంగా మాత్రమే ఆంధ్రా మీడియాలో కథనాలెందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో ఇన్ని పార్టీలు, ఇంతమం ది నాయకులు ఉండగా వాళ్లందరినీ వదిలేసి.. అధికారంలో ఉన్న పార్టీ నాయకులను వదిలేసి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలేసి.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుల మీద ఈ వ్యక్తిత్వ హనన కథనాలు ఎందుకు వస్తున్నాయి? ఇదే చంద్రజ్యోతి ఒకనాడు కేసీఆర్ తెలంగాణవాడే కాదని కథనాలు ఎందుకు రాసింది? తెలంగాణ ఉద్యమం అయిపోయిందని ఎన్నోసార్లు ఎందుకు చంకలు గుద్దుకున్నది. రాజ్యసభలో తెలంగాణ బిల్లు వచ్చినరోజు కూడా తెలంగాణ రాదని అత్యాశ వ్యక్తం చేసింది. లక్ష్యం ఒక్కటే.. కేసీఆర్ అనే వ్యక్తిని తొక్కేస్తే ఇక తెలంగాణ ఉండదు.. తెలంగా ణ భావనే మిగలదు.. అనేది ఆంధ్రా మీడియా ఎత్తుగడ. ఇది అందరికీ తెలుసు. ఒక్క కేసీఆర్ మీద అటు నరేంద్ర మోదీ, ఇటు చంద్రబాబు, మరోవైపు రేవంత్ ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. ఆంధ్రా మీడియా అసలు లక్ష్యం ఏమిటో ఈ రాష్ట్రంలో ఏ పార్టీని, ఏ కూటమిని గద్దెనెక్కించాలని కుట్రలు పన్నుతున్నదో, అదే జరిగితే ఈ రాష్ట్రం ఆఖరికి ఏ పందికొక్కుల పాలవుతుందో కూడా అందరికీ తెలుసు. చంద్రబాబును జగన్ లోపలేసినపుడు హైదరాబాద్‌లో ఆందోళనలు వద్దన్నందుకే ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఈయన కాలమ్నిండా కన్నీరు కార్చా రు. మరి చంద్రబాబేమైనా ఆంధ్రా అస్తిత్వానికి ఏకైక ప్రతీకా? ఆయనేమైనా ఆ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడా?
అసలు ఇవాళ ఈ థంబ్‌నెయిల్ ైస్టెల్ శీర్షికలు పుట్టిందెక్కడ? వీటికి శ్రీకారం చుట్టిందే బంటుగారి పత్రిక. ఏ వదురుబోతు ఏది వాగితే అదే శీర్షికగా తగిలించి తాటికాయంత అక్షరాలతో వేసే ఈ శాడిస్టు తరహా జర్నలిజానికి తెర తీసిందే చంద్రజ్యోతి. ఇవాల్టికీ ఇంకా ఆ రోగం పోలేదు. నిజమే.. కొన్ని రోగాలు తగిన ఔషధాలు పడకుండా నయం కావు. కొన్ని శస్త్ర చికిత్సలు జరుపకుండా పోవు. సరే.. కాలం బహుశా ఆ ముచ్చటా తీరుస్తుందేమో చూడాలి!
బంటుగారి సోదిలో కొత్త అంశం ఏమిటంటే.. తమ పత్రిక తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకుందట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిందట. దానికి ఏదో తిక్కశంకరయ్య కమిటీ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందట. ఇంతకూ ఆ కమిటీ రిపోర్టును ముందునుంచి వెనక్కు , వెనక నుంచి ముం దుకు ఎన్నిసార్లు చదివినా అందులో నేరుగా ఈ అర్థం వచ్చే పాయింటేదీ లేదు. ఆ పత్రికకు తెలంగాణ ఎడిటర్ ఉన్నాడన్న ప్రస్తావన మాత్రమే ఉంది. సరే.. వయసు, వార్ధక్యం కొన్ని సమస్యలను తీసుకువస్తుంది. అందులో చిత్తభ్రమ, మతిమరుపులాంటివి ఉంటాయి. అలా సర్దేసుకుందాం. ఉన్నమాట చెప్పాలంటే తెలంగాణ వారితో కూడిన తెలంగాణ వ్యతిరేకుల కూటమి ఆ పత్రిక.
బంటుగారి మరో పాయింటు.. చాలాకాలంగా చాలామంది వినిపించే వాదనే. తెలంగాణ వాళ్లు ఇతర ప్రాంతాల్లో నివసించడం లేదా? అనేది. నిజమే కేటీఆర్, కవితలు అమెరికాలో ఉద్యోగాలు చేశారు. కేటీఆర్ గుంటూరులో చదువుకున్నారు. జగదీశ్‌రెడ్డి కుమారుడు మరో దేశం లో చదువుకున్నాడు. అక్కడి తిండి తిన్నారు. వాళ్లే కాదు, అనేక మంది తెలంగాణ వాళ్లు అమెరికా, ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని మస్కట్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో కూడా పనులు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారెవరూ… తెలంగాణలో తిష్ట వేసిన కొందరిలా తాము బతుకుతున్న ప్రాంతం నాశనమైపోవాలని కోరుకోలేదు. తాము నివసించే ప్రాంతాన్ని, వారి భాషను, వారి సంస్కృతిని అవహేళన చేసి మాట్లాడలేదు. మిడతల దండు లాగ మీదపడి స్థానికుల ఉద్యోగాలు కాజేసి ఆ ప్రాంత ప్రజలను వలసల పాలు చేయలేదు. వాళ్ల నీటికి ఎసరు పెట్టి నదులు మళ్లించుకోలేదు. మిగులు నిధులు కాజేసీ తమ ప్రాం తం బ్యారేజీలు మరమ్మతులు చేసుకోలేదు.
కాళ్ల కు చెప్పుల్లేకుండా వచ్చి కోట్లు కొల్లగొట్ట లేదు. ఎక్కడ ఉంటున్నారో.. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో.. అక్కడి చట్టాలను, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు. అక్కడి ప్రజల్లో కలిసిపోయారు. వాళ్లను గౌరవించారు. వాళ్లనుంచి గౌరవం పొందారు. బతుకడానికి వచ్చారు.. అనే మాట వెనక ఉన్న భావం అది. మంది మీద పడి బతికే మూకలకు, అన్ని వ్యవస్థల్లో వైరసుల్లా చొరబడి తమకనుగుణంగా చట్టాలు, ఆదేశాలు చేయించుకునే దోపిడీదారులకు అదెప్పటికీ అర్థం కాదు.
తిరుపతి వేంకటకవుల విరచితమైన కృష్ణ రాయబార ఘట్టంలో ఓ పద్యం ఉన్నది. రారాజును యుద్ధానికి రెచ్చగొడుతూ కర్ణుడు కోతలు కోస్తున్నపుడు ‘వాచావాత్సల్యము చూపే కర్ణుడి టు’.. అంటూ కృష్ణుడు వెటకారం చేస్తాడు. బం టు గారి వ్యాసంలో ఇలాంటి వాత్సల్యాలు చాలా ఉన్నాయి.
అందులో మట్టి కరిపించింది.. అనేదానికి అర్థం తెలిసి వాడారా? తెలియక వాడారా? వాచావాత్సల్యంతో వాడేశారా? మనకు తెలియదు. మట్టి కరవడమంటే లేవలేని విధంగా పడిపోవడం. గత ఎన్నికల్లో అది జరిగిందా? అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా ఎంత? 1.8 శాతం. మిగిలిన ఓట్లలో అటు ఎన్ని పడ్డాయో ఇటు అన్ని పడ్డాయి. పోనీ కాంగ్రెస్ ఏమన్నా మూడింట రెండు వంతుల సీట్లు సాధించిందా? అంటే అదీ అత్తెసరు. ఆ మాత్రానికే మట్టి కరిపించింది అట. బండకేసి బాదారు అట. చెంపలేసుకోవాలి అట. తీరు మార్చుకోవాలి అట. అనేక అసత్యాలు అబద్ధాలు, ప్రలోభాలతో ప్రజలను మోసపుచ్చితే కొందరు అటుమొగారు. అంతమాత్రాన మొత్తం తెలంగాణ కేసీఆర్‌ను కాదన్నట్టు రాయడం ఏం జర్నలిజం? అయినా ఓట్లు, సీట్లు కేవలం అధికారానికి సంబంధించిన వ్యవహారం. ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించినది కాదు. అధికారం ఉన్నా, లేకున్నా, సీట్లు గెలిచినా గెలువకున్నా కేసీఆర్ గత 45 ఏండ్లుగా తెలంగాణ ప్రజలతోనే, ప్రజల కోసమే బతుకుతునారు. అంతేకానీ, బాబు గారి బంటులాగా దుకాణం పెట్టలేదు. మాటిమాటికి మాట మార్చలేదు. అంతేకాదు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కూటమి కట్టాలో ఎలా కడితే గెలవవచ్చో కాలజ్ఞానం కూడా చెప్పేశారు. అలాంటి కూటమి వస్తుందని బీఆర్ఎస్కు భయమట. అందుకే మీడియాను టార్గెట్ చేశారట. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు అందులోనివేనట.
వానలు పడ్డాక ఊరంతా ధాన్యం ఎండబెట్టుకుంటే నక్క తన తోకను ఎండబెట్టుకుందట. జగదీశ్‌రెడ్డి హెచ్చరించింది వ్యక్తిత్వ హననాలకు దిగే మీడియా గురించి. అందులో ఏ పత్రిక పేరునూ తీసుకోలేదు. అయినా ఈయన మాపై దాడి చేస్తామన్నారని ఏడుపు లంకించుకుంటున్నాడు. ‘ఎన్నో బెదిరింపులు చూశాం. ఎవరెవరినో ఎదుర్కొన్నాం’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నాడు. దానికి బలుపు గిలుపు అంటూ వాచాలత్వాన్ని జోడించాడు. కానీయండి. మండూకాల బెకబెకలు ఎండాకాలం వరకే.. కాలం అన్నింటినీ సవరిస్తుంది.
కొద్దికాలం క్రితం ఒక సీనియర్ పాత్రికేయుడు సోషల్ మీడియాలో రాసుకున్న ఒక అంశం..1960-70 మధ్య ఆయనకు హైదరాబాద్ ఇండ్ల అద్దెలు భారం కావడంతో ఆనాటి సీఎం దగ్గరకు వెళ్లి అద్దెలు భరించలేకున్నాం.. ఒక ఇల్లు ఏదైనా ఇప్పించండి అని అడిగాడు. సీఎం ఆదేశంతో అధికారులు అద్దెనియంత్రణ చట్టం అడ్డం పెట్టుకుని ఓ హైదరాబాదీ ఇల్లును లాక్కొని ఈ పాత్రికేయుడికి ఇవ్వచూపారు. అయితే ఆ ఇంటివారు గోడుగోడున విలపించిన దృశ్యం చూసి ఆయన తీసుకోలేదు. అది వేరే విషయం. అదలా ఉంచితే.. అక్కడ జరిగిందేమిటి? ఆ ప్రాంత అధికారులు ఒక తెలంగాణ వాడి ఇల్లును అద్దె నియంత్రణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎంత తేలిగ్గా లాగేసుకోజూశారు? అలా ఎంతమంది తెలంగాణ వాళ్లు ఇండ్లు కోల్పోయి ఉంటారు? అసలు ఆ అద్దె నియంత్రణ చట్టం అనేది ఎవరికోసం రూపొందించారు? ఎందుకు రూపొందించారు? అనేది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇవాల్టికీ ఈ అద్దె నియంత్రణ చట్టం బాధితులైన వందల మంది ఇండ్ల యజమానులు తమ అద్దెలను ప్రతినెలా కోర్టులకు వెళ్లి తీసుకుంటున్నారు. కేసులు పెట్టిన వాళ్లలో అత్యధికులు ఏ ప్రాంతం వాళ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందిన చట్టాలన్నీ ఇవే బాపతు. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ భావన ఉట్టి పుణ్యాన మాయమై పోతుందా?
– ఎస్జీవీ శ్రీనివాసరావు