దేశంలోని సుమారు 130 కోట్ల మందికి అన్నం పెట్టే అన్నదాతను ప్రేమగా చూసుకునే పాలకుడే నిజమైన దేశభక్తుడు. రైతును గుండెకు హత్తుకొని అలా చూసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనడంలో సందేహం లేదు. అందుకే ‘రైతుబంధు’ లాంటి ఒక మహాద్భుత పథకం కేసీఆర్ మస్తిష్కంలోంచి పురుడు పోసుకున్నది. రైతు కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా అని ఈ సందర్భంగా మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఈ దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సయిన దేశ భక్తుడు. ఆ విధంగా చూస్తే రైతును ప్రాణంగా చూసుకుంటున్న తెలంగాణ రథసారథి కేసీఆరే నిజమైన దేశభక్తుడు. దేశభక్తి అంటే నిత్యం తప్పుడు ప్రచారాలు చేయడం కాదు, దేశభక్తి అంటే ప్రజా క్షేమాన్ని కాంక్షించడం. వారి మంచికోసం నిత్యం మథనపడటం. అది కేసీఆర్‌లో పుష్కలంగా కనిపిస్తున్నది. పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లకు, సమాజాన్ని ప్రేమించేవాళ్లకే కేసీఆర్ ఆలోచనలు, ఆయన ప్రవేశపెడుతున్న పథకాలు అర్థమవుతాయి. చిల్లరమాటలతో రాజకీయం చేసేవాళ్లకు కేసీఆర్ ఆలోచనాతీరు అర్థం కాదు. తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదు కానీ, కేసీఆర్ అధికారంలో ఉండొద్దని ఆలోచించే అజ్ఞానులు తప్ప తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు సంతోషంగానే ఉన్నరు. ప్రజా సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించడం ఏ పాలకుడికీ సాధ్యం కాదు. ఒకప్పుడు తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో మనకు మనమే ఒకసారి ఆలోచించుకుంటే నిజం బోధపడుతుంది. సరైన పాలకుడు లేక నానా కష్టాలు పడుతున్న రాష్ర్టాలు ఈ దేశంలో చాలా ఉన్నయి.
1996-2000 మధ్యలో తెలంగాణ నినాదం ఎత్తినవారిని ‘నక్సలైట్’ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేశారు. అలాంటి రోజుల్లో ‘తెలంగాణ’ అనే పదం ఉచ్చరించాలంటేనే నాయకులు భయపడ్డారు. ఆ రోజుల్లోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల, బూటకపు ఎన్కౌంటర్లపై కేసీఆర్ స్పందించారు. రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ‘జై తెలంగాణ’ అని గొంతెత్తారు. ఇది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుచించలేదు. తెలంగాణ రాష్ర్టానికి చంద్రబాబు అడ్డుపడటం కేసీఆర్‌లో మరింత కసిని పెంచింది. తెలంగాణ ప్రాంత నేతలతో రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చంద్రబాబు కేసీఆర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించారు. అయినప్పటికీ తెలంగాణ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఎంతోమంది మేధావులను కలిశారు. ఆ సమయంలోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు దగ్గరయ్యారు. నెలల తరబడి చర్చలు జరిపారు. మామూలుగా రాజకీయ నాయకులకు దూరంగా ఉండే జయశంకర్ సార్ కేసీఆర్ పట్టుదలను చూసి ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఇక కేసీఆర్ చంద్రబాబు మీద నేరుగా అసెంబ్లీలోనే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల పైన గళం ఎత్తారు. ఆనాడే చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఆత్మగౌరవంతో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని స్థాపించి అనతికాలంలోనే తెలంగాణవాదాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు.
ఇదీ నాటి సంగతి. కొందరు విష ప్రచారం చేస్తున్నట్లు మంత్రి పదవి మీద కేసీఆర్‌కు వ్యామోహమే ఉంటే యూపీఏ హయాంలో క్యాబినేట్ మినిస్టర్‌గా ఉన్న కేసీఆర్ తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోయేవారే కాదు కదా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆషామాషీ నాయకుడు కాదు. ఎవరికీ సాధ్యం కాని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చూపించారు. తెలంగాణ పట్ల పూర్తి నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే కనీసం మూడు దశాబ్దాల సమయం తీసుకునే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును కేవలం మూడేండ్ల కాలంలోనే పూర్తిచేసి చూపించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు సస్యశ్యామలమైంది. రైతులకు కష్టాలను దూరం చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి తెలంగాణ విషయంలో విషం చిమ్మేవాళ్ల మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ మరో వందేండ్లు వెనక్కిపోతుంది. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నరు. తెలంగాణ ప్రేమికులందరూ ఏకం కాకపోతే నష్టం తెలంగాణ ప్రజలకే. తస్మాత్ జాగ్రత్త!
ఆలేటి రమేష్: 99487 98982