‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వినడానికి నినాదం బాగుంటుంది. చెప్పుకోవడానికి కూడా కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. సువిశాల భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరిగినప్పుడు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అక్కడ పనులు నిలిచిపోతాయి. అలా కాకుండా పంచాయతీలకు మొదలుకొని అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓ రెండు నెలల్లో కోడ్ ముచ్చట ముగిసి దేశం అభివృద్ధి పథంలో దూసుకువెళ్లడానికి దేశమంతా ఒకేసారి జరిగే ఎన్నికలు ఇదొక కోణం.
ఎప్పుడూ దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం, ప్రచారం, రాజకీయ విమర్శలు, ఆరోపణలతో అభివృద్ధి నిలిచిపోతుందనే వాదన నిజమే. కానీ, ఒకేసారి ఎన్నికల వల్ల రాష్ర్టాలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. ఇది సమాఖ్య దేశం. భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులతో భిన్నత్వంలోనే ఏకత్వంతో సాగుతున్న దేశం. గతంలో జరిగిన ఎన్నికల పరిణామాలను బట్టి చూస్తే ఒకేసారి రాష్ట్ర శాసనసభకు, పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించడం వల్ల రాష్ర్టాలు తమ అస్తి త్వాన్ని కోల్పోతాయి. కులాలు, ప్రాంతా లు, భాష పేరుతో కాకుండా హిందూత్వ పేరుతో దేశం ఏకంగా ఉండాలని బీజేపీ కోరుకుంటున్నది. హిందూత్వ ఓటు బ్యాంకు ద్వారా శాశ్వతంగా అధికారంలో ఉండాలనేది బీజేపీ లక్ష్యం. ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఒకే భాష నినాదాలు బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేవి.
అదే సమయంలో రాష్ర్టాలు ప్రత్యేకత కోల్పోయే ప్రమాదం ఉన్నది. బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో మెజారిటీ సాధించినందున తాను కోరుకున్నది బీజేపీ అమలుచేస్తున్నది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో ఫ్రంట్ రాజకీయాలు జోరుగా సాగేవి. బాబు ముఖ్యమంత్రిగా కేంద్రం లో చక్రం తిప్పేవారు. రాష్ర్టాలు బలంగా ఉండి, కేంద్రం బలహీనంగా ఉండాలని వాదించేవారు.
ఇప్పుడు బీజేపీ కూటమి లో ఉన్న బాబు రాష్ర్టాలను బలహీనపరి చి కేంద్రాన్ని మరింత బలంగా తయారుచేసే ఒకే దేశం ఒకే ఎన్నికలను సమర్థిస్తున్నారు. వేదాంత కంపెనీ మహారాష్ట్రలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి గల సెమీ కండక్ట ర్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన తర్వాత కూడా మోదీ ప్రభుత్వం దాన్ని గుజరాత్ కు తరలించింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమే అధికారంలో ఉన్నది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆయా రాష్ర్టాల్లో తమ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో కనీసం ఎన్నికల సమయంలోనైనా రాష్ర్టాలకు కొన్ని వరాలు ప్రకటించేవారు.
ఒకేసారి ఎన్నిక వల్ల ఇక అలాంటి వరాలపై ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు భిన్నంగా స్పందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలను దేశం కోణంలో చూస్తే అసెంబ్లీ ఎన్నికలను తమ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూస్తారు. ఏడాదిన్నర కిందట ఎన్నికలు జరిగిన కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతిని బీజేపీ విజయం సాధించింది.
తమిళనాడు వంటి రాష్ర్టాల్లో పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా తమ రాష్ట్రం తమకు ముఖ్యమని భావిస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ ఏ ఎన్నికలైనా తమిళనాడులో తమిళ పార్టీల హవానే కానీ, జాతీయ పార్టీల హవా కనిపించదు. మిగిలిన రాష్ర్టా ల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఒక తీరుగా, పార్లమెంట్ ఎన్నికలకు మరోవిధంగా ఓటర్లు స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భిన్నంగా స్పం దిస్తారు, రెండూ ఒకేసారి వచ్చినప్పుడు తమకు నష్టం కలిగిందనే ఉద్దేశంతో 2004లో ఉమ్మడి రాష్ట్రంలో బాబు అసెం బ్లీ రద్దుచేసి ముందస్తుకు వెళ్లాలని చూశారు.
అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని సచివాలయంలో ఒకవైపు బాబు మీడియాకు వివరిస్తుండగానే ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ‘ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు నిర్వహించం. పార్లమెంట్ ఎన్నికలతో పాటే నిర్వహిస్తాం’ అని ప్రకటించింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. బాబు పార్టీ ఓడిపోయింది. ఇప్పు్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉండటం వల్ల ఒకేసారి ఎన్నికలు జరగడం తమకు మేలే అని టీడీపీ భావిస్తూ ఉండవచ్చు.
ఇదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే తమకు ప్రయోజనం అని గతంలో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. 2018లో ఈ నిర్ణయం టీఆర్ఎస్కు కలిసివచ్చింది కూడా.
బీజేపీ, దాని మిత్రపక్షాలు జమిలి ఎన్నికలను స్వాగతిస్తుండగా బీజేపీ వ్యతిరేకపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ర్టానికి లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజీని మోదీ ప్రకటించా రు. హామీని అమలుచేసినా, చేయకపోయినా పార్లమెంట్‌కు, అసెంబ్లీకి విడివిడి గా ఎన్నికలు జరిగినప్పుడు రాష్ర్టాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్యాకేజీలు, వరాలు ప్రకటించాల్సి ఉంటుంది. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ర్టానికి తాము ఏం చేశాం, మళ్లీ గెలి స్తే ఏం చేస్తామని ప్రకటించాల్సి ఉంటుం ది. ఓటర్లలో చర్చ రాష్ట్రం కేంద్రంగా సాగుతుంది. దీనివల్ల ఆ రాష్ర్టానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. జమిలి ఎన్నికల వల్ల దేశవ్యాప్త అంశమే తెరపైకి వస్తుంది కానీ, రాష్ర్టాల అంశాలకు, రాష్ర్టాల ప్రాధాన్యాలకు చోటుండదు. ఒక రకంగా రాష్ర్టాలు తమ ప్రత్యేకతను, ప్రాధాన్యాన్ని కోల్పోతాయి.
– బుద్దా మురళి