రాజకీయాలలో ఒక థియరీ ఉన్నది. ముఖ్యంగా కొత్తగా పరిపాలనను చేపట్టిన వారి కోసం. ఇంగ్లీషులో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగానే కొత్తగా అధికారానికి వచ్చినవారి పరిపాలన గురించి ప్రజలకు తొలి దశలో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఒకసారి ఏర్పడి స్థిరపడిపోతే ఇక తర్వాతి కాలంలో మారటం అసాధ్యం కాకున్నా చాలా కష్టం. ఎంతో కొంత మంచి పనులు చేసినా సరే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటువంటి పరిస్థితి దాదాపు సమీపించినట్టు కనిపిస్తున్నది.
ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడే తొలిదశ అంటే ఎంతకాలం? ఆ దశలో పరిపాలనాపరంగా ఏమి జరిగితే, లేదా జరగనట్టయితే ఎటువంటి అభిప్రాయాలు ఏర్పడుతాయి? ఆ అభిప్రాయాలు అదే పద్ధతిలో ఎంతకాలం కొనసాగితే స్థిరపడుతాయి? అన్నవి ఒక విధమైన ప్రశ్నలు. అవి తర్వాతి కాలంలో మారటం, మారకపోవటం దేనిపై ఆధారపడి ఉంటుంది? మారితే, లేదా మారకపోతే జరిగేదేమిటి? అన్నవి మరోవిధమైన ప్రశ్నలు. అసలు అభిప్రాయాలు ఏర్పడటం, ఏర్పడకపోవటమన్నది సమాజంలో ఏ వర్గాలకు జరిగితే అది లెక్కించదగినది అవుతుంది? అభిప్రాయాలు అన్ని వర్గాలవి ఒకేవిధంగా ఉంటాయా లేక వేర్వేరు విధాలుగానా? అన్నది మూడవ తరహా ప్రశ్నలు.
ఇన్ని రకాల ప్రశ్నలను చూసి కొంత అయోమయం అనిపించవచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. వాటిని నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మళ్లీ చదవండి. తర్వాత ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్వయించి చూడండి. ఒక సగటు పౌరునిగా మీ వైపు నుంచి. అట్లానే, మీ చుట్టూ గల సమాజాన్ని చూస్తూ, వారి మాటలు వింటుండేవారిగా వారి వైపు నుంచి. అప్పుడు ఈ ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పగలరు.
అవే ప్రశ్నలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంలో చూసుకుంటూ తనకు తాను వేసుకున్నట్టయితే, సమాధానాలు ఆయనకు కూడా తెలుస్తాయి. మిగిలినవారి సంగతి ఎట్లున్నా, పాలిస్తున్నది, మరికొంత కాలం పాలించవలసింది తను అయినందున ఆయన ఆ పని చేయటం మంచిది.
ఆయన ఆ పని చేసినా లేకున్నా, తన పార్టీని గెలిపించి తను ముఖ్యమంత్రి కావటానికి బాధ్యులైన వారిగా ప్రజలు ఆ పని చేయకతప్పదు. స్థూలంగా చూసినప్పుడు తొలిదశ అనే మాటకు వేర్వేరు వారు 100 రోజుల నుంచి ఏడాది దాకా అనే నిర్వచనాలు చెప్తారు. సంప్రదాయికంగా ఇచ్చే హనీమూన్ కాలం మూడు మాసాల నుంచి 100 రోజులు. తర్వాత అది ఆరు మాసాలకు పెరిగింది.
ఇంకొంత కాలానికి, పరిపాలన సంతృప్తికరంగా లేని స్థితి కనిపించినప్పుడు, పాలకపక్షం వారు తమంతట తామే ఆ గడువును ఏడాదికి పెంచుకున్నారు. అసంతృప్తి చెందిన ప్రజలతో, విమర్శకులతో, ప్రతిపక్షాలతో ‘అయ్యో, ఒక ఏడాదైనా ఆగలేరా?’ అనసాగారు. అందుకు సమర్థనగా, గత ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను, పరిపాలనను, ఇంకా అన్నింటినీ కుప్ప గూల్చిపోయిందని, కనుక తాము సంతృప్తికరంగా పాలించటం సాధ్యపడటం లేదని ఎదురు వాదనలు సైతం చేయటం మొదలుపెట్టారు.
ఈ రకరకాల వాదనలలోని మంచి చెడులను అట్లుంచితే, ఏడాదికాలం సైతం గడిచిపోయిన తర్వాత మాత్రం వారు మౌనం వహించారు. ఏడాది ఏం సరిపోతుంది, రెండేండ్లు కావాలి, మూడేండ్లు కావాలనటం లేదు. ఆ మాట వారికి తట్టలేదో, మరేమైనా కారణమో తెలియదు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇటువంటి క్రీడ ఎప్పుడూ ఉన్నదే. మూడు నెలలు, వంద రోజులు, ఏడాదికి ఏమొచ్చె, అయిదేండ్లు గడిచినా అవే మాటలు వినిపించేవి. అంతెందుకు, కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి మోదీ ఏమన్నారో చూడండి. జీఎస్టీ స్లాబ్‌లను నాలుగు నుంచి రెండు తగ్గించిన తర్వాత, పన్నుల వ్యవస్థను కాంగ్రెస్ అధ్వాన్నం చేసి పోయిందన్నారు.
నిజమైతే కావచ్చు. కానీ, కాంగ్రెస్ పాలన ముగిసి స్వయంగా తాను అధికారానికి వచ్చి 11 సంవత్సరాలైంది. ఈ కొత్త స్లాబులు సృష్టించింది తానే. లోగడ వాజపేయి నాయకత్వాన బీజేపీ ఏడేండ్లు రాజ్యం చేసింది. కాంగ్రెస్ కూడా తాము ఏలుబడి చేసినప్పుడు ఇదే పనిచేసింది. అందువల్ల రేవంత్ రెడ్డి తమ పార్టీతో పాటు, తనను వ్యక్తిగతంగా అభిమానించే నరేంద్ర మోదీ నుంచి ప్రేరణ పొంది, తెలంగాణ ప్రజలకు, మేమొచ్చి ఇంకా ఐదేండ్లయినా కాలేదు గదా, తర్వాత తిరిగి అధికారమివ్వండి, అప్పుడు గొప్పగా పాలించి తీరుతామని హామీ ఇవ్వవచ్చు.
అప్పుడు ముఖ్యమంత్రి నిర్వచనం ప్రకారం మొత్తం ఐదేండ్లూ తొలిదశ అవుతుంది. కాని ప్రజలకు తమ నిర్వచనాలు తమకుంటాయి. ఆ విధంగా చూసినా, ఇప్పుడు ఏడాది గడిచిన తర్వాత ప్రభుత్వం కొత్త గడవులేమీ మాట్లాడక మౌనంగా ఉండటాన్ని చూసినా, ఇక అన్ని గడువులు అందరివైపు నుంచీ ముగిసిపోయినట్టు భావించవలసి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి 2023 డిసెంబర్లో గనుక అప్పటినుంచి ఏడాది 2024 డిసెంబర్లో అయినందున, ఆ తర్వాత మరో ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఇక తక్కిన ప్రశ్నలకు వద్దాము. ఈ తొలిదశలో జరిగినదీ, జరగనిదీ గమనించి, అనుభవించిన ప్రజలకు తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది.
ఏడాదికి ముందే ఏర్పడసాగిన అసంతృప్తి ఇప్పుడు రెండేండ్లూ కావస్తుండగా స్థిరపడిపోయినట్టు కనిపిస్తున్నది. అది రాగలకాలంలో మారవచ్చునా లేదా అనే కీలకమైన ప్రశ్న ఒకటుంది. ప్రజల అభిప్రాయాలు ఎప్పుడూ శిలాశాసనం వంటివి కాదు. కనుక అసలు మారవని చెప్పలేము. అయితే అది దేనిపై ఆధారపడి జరుగుతుంది? లేదా జరుగదు? ఒక మాటలో చెప్పాలంటే, మలిదశ పాలన అద్భుతంగా సాగి ప్రజలను పూర్తిగా సంతృప్తి పరిచి, తొలిదశ అసంతృప్తిని మరిచిపోయేట్టు చేయగలిగితే అప్పుడు మారుతుంది. లేకుంటే మారదు సరికదా వెనుకటి అభిప్రాయం మరింత కఠినమవుతుంది. అప్పుడు పర్యవసానాలేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఇక ఏ వర్గాల అభిప్రాయాలన్నది ముఖ్యమైన ప్రశ్న. తెలంగాణలో ప్రధానమైన వర్గాలు రైతాంగం, వ్యవసాయరంగంపై ఆధారపడిన గ్రామీణ వృత్తులవారు, చిన్నా, పెద్ద వ్యాపారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం, పట్టణ ప్రాంతాల పనిపాటల వారు, గ్రామాల, పట్టణాల కూలీలు, స్వయం ఉపాధి వారు, మహిళలు, వృద్ధులు. ప్రభుత్వ పాలన వల్ల వీరిలో ఎవరికి సంతృప్తి కలిగి, ఎవరికి కలగటం లేదన్నది పరిశీలించవలసిన విషయం.
ఇక ఏ వర్గాల అభిప్రాయాలన్నది ముఖ్యమైన ప్రశ్న. తెలంగాణలో ప్రధానమైన వర్గాలు రైతాంగం, వ్యవసాయరంగంపై ఆధారపడిన గ్రామీణ వృత్తులవారు, చిన్నా, పెద్ద వ్యాపారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం, పట్టణ ప్రాంతాల పనిపాటల వారు, గ్రామాల, పట్టణాల కూలీలు, స్వయం ఉపాధి వారు, మహిళలు, వృద్ధులు. ప్రభుత్వ పాలన వల్ల వీరిలో ఎవరికి సంతృప్తి కలిగి, ఎవరికి కలగటం లేదన్నది పరిశీలించవలసిన విషయం. వీరిలో వేర్వేరు వర్గాల సంతృప్తి, అసంతృప్తి వేర్వేరు స్థాయులలో ఉండవచ్చు. ఈ వేర్వేరు అంశాలన్నింటిని విడివిడిగా పరిశీలించినప్పుడు తుది అంచనాలు వస్తాయి.
ఆ విధంగా రేవంత్ రెడ్డి పాలన పట్ల వేర్వేరు వర్గాల అభిప్రాయాలను, ముఖ్యంగా మొదటి ఏడాదిని వదిలివేసి తర్వాతి ఎనిమిది నెలల కాలాన్ని గమనికలోకి తీసుకొని చూడాలి. పైన అనుకున్నట్టు మొదటి ఏడాది సమయంలో కలిగిన సంతృప్తి, లేదా అసంతృప్తి ఈ ఎనిమిది మాసాలలో స్థిరపడుతూ వస్తున్నది గనుక. ఆ విధంగా చూసినప్పుడు కనిపిస్తున్నదేమంటే, పైన పేర్కొన్న వివిధ వర్గాలలో ఇది అది అని గాక అందరికి అందరూ ప్రస్తుత పరిపాలనతో అసంతృప్తి చెంది ఉన్నారు. కొందరి కన్న కొందరు మరింత ఎక్కువ, తక్కువగా కావచ్చు. కాని అందరిదీ అసంతృప్తే. సంతృప్తిగా ఉన్నట్టు చెప్పే వ్యక్తులు, చిన్న సమూహాలు ఏవైనా ఉంటే ఉండవచ్చు కానీ, సార్వత్రిక రూపంలో చూసినప్పుడు అంతటా అసంతృప్తే.
వీటన్నింటి మధ్య ప్రజలు మరొకటి గుర్తిస్తున్నారు. ప్రజల అసంతృప్తిని గ్రహించిన ముఖ్యమంత్రి దానిని మరిపించేందుకు ఎప్పటికప్పుడు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. అందుకు సరికొత్త ఉదాహరణ యూరియా కొరతకు కారణం ఉక్రెయిన్ యుద్ధం, పాకిస్థాన్‌తో యుద్ధం అనటం. ఈ విధమైన మాటలు రైతులు సమస్యను మరిచిపోయేలా చేయకపోగా, వారికి పుండుపై కారం చల్లుతున్నాయి.
ఇదిగాక వరుసగా అబద్ధాలు చెప్తున్నారు. అవే అబద్ధాలు మళ్లీ, మళ్లీ. గత 20 నెలలుగా ప్రతి సమస్య విషయంలోనూ ఇదే కనిపిస్తున్నది. తొలిదశ అభిప్రాయం ఈ తీరున మలిదశలోనూ బలపడుతున్నప్పుడు ఇక ఆ తొలిదశ అభిప్రాయం మారదన్నది రేవంత్ కోసం చెప్తున్న థియరీ. రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మొత్తంగా తమ మ్యానిఫెస్టో హామీలను అమలు చేయకపోవటంపై ప్రజల అసంతృప్తిని, మధ్య మధ్య అదనంగా వచ్చే యూరియా వైఫల్యం వంటివి మరింత తీవ్రం చేస్తున్నాయి.
ఆయన కేసీఆర్ నోటిఫికేషన్లకు తాను ఉద్యోగాలివ్వటం, రేషన్ కార్డులు, సన్నబియ్యం, కొద్దిమందికి ఇళ్ల వంటి కార్యక్రమాలు కొన్ని చేస్తున్నా, మౌలికమైన స్థాయిలో విస్తృతంగా అన్నివర్గాలలో ఏర్పడిన అసంతృప్తిని వెనుకకు మళ్లించేందుకు అవి సరిపోవటం లేదు. అవి సరిపోగలవన్నది ఆయన ఆశాభావం కావచ్చు. కానీ, పైన చెప్పుకున్నట్టు, ఆ తరహా చర్యలు భారీస్థాయిలో జరగటం, మ్యానిఫెస్టో డిక్లరేషన్లు, గ్యారెంటీలు అమలవటం అన్నివర్గాల వారికి స్పష్టమైన రీతిలో కనిపిస్తే తప్ప, ఆ వైఫల్యాల ముందు ఈ అరకొర చర్యలు వెలవెలబోతాయి. అదే జరుగుతున్నది. ఇది ఏ పాలకుని విషయంలోనైనా, ఎక్కడైనా వర్తించే జనరల్ థియరీ. అది రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుంది.
– టంకశాల అశోక్