కొలువుల కోసం నిరుద్యోగ యువకులమైన మేము ఎవరేం చెప్పినా నమ్మినాం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నమ్మినం. రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా తిరిగి ‘చేయి గుర్తుకు ఓటు వెయ్యి’మని రెండు చేతులెత్తి ప్రజలను వేడుకున్నాం, వారిని ప్రాధేయపడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, రాదో అన్న అనుమానం సొంత పార్టీ నేతల్లోనే ఉండేది. కానీ, ఆ సమయంలో నిరుద్యోగులంతా ఏకమై ఆ పార్టీకి మద్దతునిచ్చి అధికారంలోకి వచ్చేలా కృషిచేశాం. ఇది నిరుద్యోగుల ప్రభుత్వమని, మా ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగులదే పెద్ద చేయి అని సంబురపడ్డాం. ఇక మాక్కూడా కొలువులు దక్కుతాయనే నమ్మకం పెరిగింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ద్వారా ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకుందామని ప్రభుత్వం ప్రకటిస్తే మా ఆశలకు రెక్కలు తొడిగాయి. స్వయంగా రాహుల్ గాంధీ ‘ఇది నా గ్యారెంటీ’ అని హామీ ఇవ్వడం, ‘ఈ హామీలు అమలు చేయకపోతే మాపై పోరాడండి’ అని ప్రియాంక గాంధీ చెప్పడంతో మాకు కొండంత భరోసా కలిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ‘మా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం’ అని చెప్పడంతో కాంగ్రెస్ మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వమనుకున్నాం. ఆ మాట నిరుద్యోగుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ అమలుచేసి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తుందనే నమ్మకం పెరిగింది. మేము అనుకున్నట్టుగానే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను శరవేగంగా భర్తీచేసి కొత్త సంవత్సరంలో పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టీజీపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం పూర్తి కాకముందే కొత్త చైర్మన్‌ను నియమించడంతో నిరుద్యోగుల ఆశలకు రెక్కలు తొడిగాయి. కోచింగ్ సెంటర్ల దోపిడీ నుంచి గ్రామీణ పేద విద్యార్థులకు ఇక విముక్తి కలుగుతుందని సంతోషపడ్డాం. తల్లిదండ్రులకు లక్షల కోచింగ్ ఫీజు భారం తగ్గిందని ఊపిరి పీల్చుకున్నాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని ఎదురుచూస్తున్నాం. కానీ, ఆ హామీ ఇంకా అమలు కావడం లేదు. అంతేకాదు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన కోచింగ్‌ను అందిస్తుందని ఆశపడ్డాం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా అశోక్‌నగర్ వచ్చి నిరుద్యోగుల బాధలను కండ్లారా చూసి చలించిపోయి, ఏడాది తిరిగేలోగా ఉద్యోగాల భర్తీ, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, 25 వేల టీచర్ ఉద్యోగాలతో మెగా డీఏస్సీ, రూ.4 వేల నిరుద్యోగభృతి, పరీక్ష ఫీజులు వసూలు చేయబోమని, లైబ్రరీలను అభివృద్ధి చేస్తామని, పరీక్ష పరీక్షకు తగినంత సమయం ఇస్తామంటూ అనేక హామీలు ఇవ్వడంతో మాకు మంచిరోజులు వచ్చాయనుకున్నాం. ఇగ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది కాబట్టి మాకు కొలువుల పండుగే అనుకున్నాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత కేవలం 12 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. ఇంకా 2 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తుందో అర్థం కావడం లేదు.
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం కాంగ్రెస్ పార్టీకి సరికాదు. అంతేకాదు, ఈ ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని పెంచదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచబోతున్నదని వార్తలు వస్తున్నాయి. దీంతో నిరుద్యోగుల్లో నిరాశ ఆవహించింది. ఒక వేళ ఆ నిర్ణయం అమల్లోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టే. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని, మరుసటి నాడే భర్తీ చేసేలా కృషిచేయాలి. ప్రభుత్వం ఇచ్చే వందల ఉద్యోగాలకు లక్షలమంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పరిమితంగానే ఉంటాయి. కాబట్టి, ప్రైవేట్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలి. ప్రోత్సాహాకాలను అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నియామకాల కోసం కాబట్టి, ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.
పరిశ్రమలకు కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి, నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాలను అందివ్వాలి. అందుకు తగ్గట్టుగా ప్రతి మండలంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేయాలి. పరిశ్రమలు కోరుకుంటున్నట్టు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలి. ముఖ్యమంత్రి ప్రతి నెల ఏదో ఒక యూనివర్సిటీని తప్పకుండా సందర్శించాలి. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఏటా బడ్జెట్లో 3 శాతం నిధులను ప్రత్యేకంగా కేటాయించాలి. నిరుద్యోగ యువతీ, యువకులకు వ్యాపారం చేసుకునేందుకుగాను ప్రభుత్వం ఉదారంగా రుణాలను అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.