విధ్వంసం తర్వాత గల్లీలోని మనుషులు ఎక్కడికి నడిచిపోయారో ఆ అడుగులు కనపడవు మట్టిపెళ్లల మధ్య కొద్దిసేపు ఏడ్చి భుజం మీద బిడ్డ నెత్తి మీద జీవితాన్ని నడిపించే పొయ్యిని పెట్టుకొని కదిలిపోతుంటే ఇంటి పడుచు కమిలిన ముఖంతో సొట్టలు పడ్డ బిందెను రొండి మీద పెట్టుకొని భర్త వెంట కూలిన ఇంటి ఆనవాళ్ల నీడలను దాటిపోతుంది
ఇంటి కల బుసలుకొట్టే అప్పుతో తీరినట్టే అనుకున్నా ఈఎంఐ వెంటాడేది అప్పుడు ఇప్పుడు కన్నీళ్లను ఖాతాలో జమ చేయగలమా జ్ఞాపకాలను మనసులో దాచుకొని పోవచ్చు కానీ ఆ కాసింత జాగని చాపలా చుట్టేసుకోలేము
అమ్మినవాళ్లు చెరువు నీళ్లలో చేపలాగా ఎక్కడో జారుకుంటారు కొన్నవాళ్లు రోడ్డు మీద ముక్కలైన కలల దేహాలతో నిలబడతారు జలాశయాలన్నీ జనాశ్రయాలు కాదు నిజమే నేరం పొక్లెయినర్ పండ్లల్లో బందీ అవుతుంటే హోదాలు పెంచుకున్న పెద్ద మనుషుల భవంతులు నీటి అలల మీద పడవల్లా తేలిపోతుంటాయి అక్కడిదాకా చేతులు సాగవు
వాళ్లు మీ నీడలను వెతుక్కుంటూ తప్పక వస్తారు మరో కలని భరోసా ఇవ్వడానికి కాదు ఆ రెండు ఓట్లు అడగడానికి