2018, జనవరి 1 చరిత్రాత్మకమైన రోజు. నూతన సంవత్సర ప్రారంభ వేడుకల్లో పడి క్యాలెండర్లో మరుగున పడిపోయే మామూలు రోజు కాదు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం చిరకాల స్వప్నం అయిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటనే పల్లకిని మోసుకొచ్చిన పర్వదినం. బోరు మోటార్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు.
2014కు పూర్వం దశాబ్దాల తరబడి కరెంటు కోతలతో, లో ఓల్టేజీ సమస్యలతో తెలంగాణ ప్రాంతం అంధకారమైంది. ఎండిన పంట పొలాల సాక్షిగా వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి కరెంటు వల్ల ప్రమాదాలు, పాముకాట్లకు రైతులు, విద్యుత్తు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన గడ్డు రోజులు. ఓ దిక్కున పంట పొలాలు ఎండిపోతుంటే, మరోపక్కన రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపించేది. ప్రజల అసంతృప్త జ్వాలలు, సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు, చీటికిమాటికి రాస్తారోకోలతో భీతావహ వాతావరణం ఉండేది.
పండుగలకు, గ్రామాల్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు లేదా ఎవరైనా చనిపోయినా అంత్యక్రియల అనంతరం స్నానపానాదుల నిమిత్తం పగటిపూట అరగంట కరెంటు ఇవ్వడానికి ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ ప్రజల మనసుల్లో స్పష్టంగా ఉన్నది. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 22 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి కావాల్సిన అదనపు సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపునకు కావాల్సిన నిధులు కేటాయించి తగిన ఆదేశిలిచ్చారు.
అంతకుముందు విడతలవారీగా వ్యవసాయ ఫీడర్లను విభజించి పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు కరెంటు ఇచ్చేవారు. ఒకేసారి అన్ని ఫీడర్లకు ఏకబిగిన విద్యుత్తు సరఫరా చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి భారీ కసరత్తు చేయడంతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సాధ్యపడింది. అందుకుగాను సుమారు రూ. 12,610 కోట్లను ఖర్చు చేసినట్టు అంచనా.
మొదటగా 2016, జూలై నుంచి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల రైతులకు ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్తును సరఫరా చేశారు. అనంతరం అదే ఏడాది నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 22 లక్షల 60 వేల వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల సరఫరా విజయవంతంగా అందించడం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2018 జనవరి 1 నుంచి రైతులందరికీ ఉచితంగా 24 గంటల కరెంటు అందివ్వడమనే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది.
అదొక సంచలన నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మినహా భారతదేశంలోని మరే రాష్ట్రంలోనూ నేటి వరకు రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో 9 గంటలు, గుజరాత్లో 8 గంటలు, మధ్యప్రదేశ్‌లో 9 గంటలు మాత్రమే ఇస్తున్నా రు. ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ మాత్రం ఉచితంగా ఇస్తున్నాయి. మిగతా రాష్ర్టాలు రైతుల నుంచి చార్జీలను వసూలు చేస్తున్నాయి.
24 గంటల ఉచిత విద్యుత్తు అందుతున్న క్రమంలో రైతులు తప్పనిసరిగా ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించకుంటే భూగర్భ జలాలు వృథా అవడమే కాకుండా విద్యుత్తు నష్టం కూడా జరుగుతుంది. భూగర్భ జలాల మట్టం పడిపోవడమే కాకుండా లోతు తక్కువగా ఉన్న బోర్లలో నీరు ఇంకిపోయే ప్రమాదం ఉంది. అవసరమైన మేర మాత్రమే నీటిని వాడుకుంటూ పర్యావరణాన్ని, ప్రకృతిని, నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతాంగంపై ఉన్నది. దేశంలోనే అత్యధిక పంటదిగుబడులు సాధించడానికి ప్రధాన కారణమైన వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్తు పథకం కొనసాగడం అనివార్యంగా పరిణమించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
-తుల్జారాంసింగ్ ఠాకూర్ ,78930 05313