తెలంగాణ రాష్ట్రం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని చాటుకున్నది. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ నెల 4, 5వ తేదీల్లో సమితి అనుబంధ సంస్థ అయిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సదస్సుకు మన రాష్ర్టాన్ని ఆహ్వానించింది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల ప్రతినిధులు, విత్తన నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. ఇప్పటికే ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన తెలంగాణకు ప్రపంచ గుర్తింపు దక్కటం విశేషం. తెలంగాణ నేలలు, వాతావరణ పరిస్థితులు విత్తనాల సృష్టికి అనుకూలంగా ఉన్నాయనీ, దీన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూనే ఉంటారు. దీన్ని రైతులు, పారిశ్రామికులు అందిపుచ్చుకోవడం అభినందనీయం. వ్యవసాయరంగ అధికారులు, నిపుణులకు కూడా ఈ ఘనత దక్కుతుంది. మన రాష్ట్రం పరిపరివిధాల అభివృద్ధి చెందుతున్నదనడానికి ఇది మరొక ఉదాహరణ.
పరాయి పాలనలో ఉన్న నాటికి, నేటి స్వయం పాలనకు ఎంత తేడా! ఒకప్పుడు రైతులు విత్తనాల కోసం బారులు తీరేవారు, లాఠీదెబ్బలు తినేవారు. తమ బాధను చెప్పుకొనే దిక్కు లేదు. కానీ నేడు మన రైతులే దేశ విదేశాలకు విత్తనాలను సరఫరా చేస్తున్నారు. తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించి మౌలిక వసతుల కల్పనకు కృషిచేసింది. సాగునీటిరంగ ప్రాజెక్టులను చేపట్టి, ఉచిత విద్యుత్తును అందించి దండుగన్న వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. ఈ నేపథ్యంలోనే కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించి రికార్డు స్థాయిలో వరిధాన్యాన్ని పండించి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర అవతరణ తర్వాత ఏడేండ్ల కాలంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనే కాదు, విత్తనోత్పత్తిలోనూ ప్రపంచస్థాయి గుర్తింపు రావటం గర్వకారణం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనావిధానాన్ని అందిపుచ్చుకోవడమే మన రైతుల విజయ రహస్యంగా చెప్పవచ్చు. అయితే వ్యవసాయరంగ సంస్కరణ ఇంతటితో అయిపోలేదు. ఇతర రంగాల మాదిరిగానే వ్యవసాయరంగంలోనూ ముఖ్యమంత్రికి సుదీర్ఘ ప్రణాళిక ఉన్నది. కేసీఆర్ ఆలోచనలన్నీ అంతర్జాతీయ శ్రేణిలో ఉంటాయి. పారిశ్రామిక దేశాలతో పోలిస్తే మన వ్యవసాయరంగం చాలా వెనుకబడే ఉన్నది. ఆహార వాణిజ్య పంటలలోనూ, ఆహార ప్రసంస్కరణ రంగంలోనూ, వ్యవసాయాధార పరిశ్రమలలోనూ, ఎగుమతులలోనూ మనం సాధించవలసిన అభివృద్ధి ఎంతో ఉన్నది. ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా సంస్కరణలను చేపడుతుంటారు. తదనుగుణంగా రైతులు తమ వ్యవసాయ విధానాలను మార్చుకోవాలి. తెలంగాణ రైతులు అత్యంత ధనవంతులనే స్థాయికి మనం చేరుకోవాలి.