ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నా…
అదృశ్యమైన ఆనందాల తాలూకు మెరుపులేమైనా
ఆవిష్కృతం అవుతాయేమోనని…!
ఆప్యాయతలు అందుకోవాలని అనుక్షణం
పరితపించే హృదయానికి ఒక చిన్న
కలగానైనా రూపుదాల్చితే ఎంతబాగుంటుందో…!!
ఆశలు ఎప్పుడూ అడియాసలే
ఆలోచనలు నిరంతరం ఎడతెగని ప్రవాహాలే
మనసు పెట్టి ఏదైనా చేయలనుకుంటానా…
మదిని మెలిపెడుతూ…
ఏవో అవాంతరాలు, నిత్య సమస్యలు
వెంటాడుతుంటాయి.
చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు అనుకోవడమే
నా తొలి తప్పిదమా?
అందరూ మంచి వాళ్ళు అని నమ్మటమే
నేను చేసిన మొదటి నేరమా?
ఏమో…! కాలం ఖరీదైనది…
అదిచ్చే సమాధానం అమూల్యమైనది.
మనసులో రాక్షసత్వం నిండిన కొందరు
బయటికి మాత్రం మానవత్వం ఒలకబోస్తుంటారు
వింత సమాజం, వికృత మనుషులు
కొందరు ఆర్థికంగా వెన్నువిరిస్తే…
మరికొందరు హార్దికంగా ఉన్నట్టే నటిస్తూ
నట్టేట్లో ముంచేసి పోతారు…
చెట్టుకు చీర చుట్టినా చొంగ కార్చే
కామాంధులకు ఇక్కడ కొదువ లేదు.
చుట్టూ పువ్వుల మనసులు అనుకుంటే…
వికృత కర తుమ్మ ముల్లుల తాకిడితో
రక్తం ఒడ్డుతోంది…!
హార్దికాలన్నీ ఆర్థికాలై పరిహసిస్తున్నై…!!
బలి కాకముందే నిద్ర లేవాలి.
– ఎన్.లహరి; 9885535506