 
                                                            జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఇవి కేవలం ఒక నియోజకవర్గ భవిష్యత్తుకే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల భవితవ్యానికి పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఒక దిశలో ఆశల దీపాలు ఆరిపోయిన చీకటి, మరో దిశలో వాగ్దానాల మోసం, ఇంకోవైపు భయంతో నిండిన పరిస్థితులు. ఈ మూడు దిక్కుల్లో ప్రజాస్వామ్యం అడుగులు వణుకుతున్న వేళ జూబ్లీహిల్స్ ప్రజలు తీసుకునే నిర్ణయం తెలంగాణ భవిష్యత్తును ముందే రాస్తోంది.
22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితం ఎటు సాగిందో అందరికీ అర్థమవుతోంది. ప్రభుత్వం మీద ప్రభుత్వానికే నమ్మకం లేని స్థితి వచ్చిందంటే ఈ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది. ప్రభుత్వం నడుస్తుందో లేదో, అభివృద్ధి ఎక్కడుందో, ఆశావహంగా ఓటేసిన జనాల జీవితాలు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా విమర్శలు దంచికొడుతున్నారు. ‘లక్ష కోట్ల అప్పు చేసి ఏం చేస్తున్నారు? మా నియోజకవర్గానికి ఒక్క పైసా ఇవ్వలేమంటున్నారు. ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా కూడా చూడటం లేదు’.. స్వయానా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన మాటలివి. ఇవి ప్రత్యర్థుల మాటలు కావు, ప్రభుత్వంలో నుంచే బయలుదేరిన నిజాలు.
‘నిధుల కోసం ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాయాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది’ అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చెప్పడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ‘మా ప్రాంతానికి ఒక్క రూపాయి రావడం లేదు. మొత్తం నిధులు ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయ’ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బహిరంగంగానే ఆరోపించడం కాంగ్రెస్ పాలనలోని వివక్షను బయటపెడుతోంది. ‘ముఖ్యమంత్రి, మంత్రులు తన నియోజకవర్గానికి న్యాయం చేయడం లేద’ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం నీళ్లు ముందుగా తమ నియోజకవర్గానికి రావాల’ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ కేకలు వేస్తున్నారు. సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేలకు నమ్మకం లేనప్పుడు ప్రజలు ఎలా నమ్మాలి?
కంటోన్మెంట్ ఉపఎన్నికలో తగిలిన మోసపూరిత గాయం ఇప్పటికీ రక్తమోడుతూనే ఉంది. అక్కడి ప్రజలు చెప్తున్న మాట ఒక్కటే.. ‘మమ్మల్ని పూర్తిగా మోసం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు మీరూ మాలాగా మోసపోకండి’ అని.
అదే మాయా రాజ్యం, అదే మోసం, అదే పాత ముఖాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నాయి. ఇది కేవలం ఓటు కాదు, భవిష్యత్తు కోసం తెలంగాణ సలుపుతున్న పోరు. అభివృద్ధిని ఆపేసి, ప్రజలను భయపెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. ఇది ఏ పాలనలోనూ చూడని దృశ్యం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి మీడియా ముందే ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునే మంత్రులున్న ప్రభుత్వం వల్ల ప్రజలకు ఉపయోగం ఏమిటి? పొన్నం, కొండా సురేఖ, జూపల్లి, పొంగులేటి, అడ్లూరి.. అందరిదీ వేర్వేరు రాజకీయం, వేర్వేరు లాబీలు. కానీ, లక్ష్యం ఒక్కటే అదే కమీషన్. మొత్తం ప్రభుత్వం అయోమయంలో ఉండగా, ప్రజల జీవితాలు అగాధంలో కూరుకుపోతున్నాయి.
తెలంగాణకు అభివృద్ధి దిశను చూపిన పథకాలు నిలిపివేసి, ఉపాధి అవకాశాలకు గండికొట్టి విద్యార్థులు, యువత ఆశల్ని ఛిద్రం చేస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణను నాశనం చేసే దిశగా నడుస్తోంది. అదీ కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం. ‘మేం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే మా ప్రాంతం టార్గెట్ అవుతుందా?’ అని జూబ్లీహిల్స్ ప్రజల్లో భయముండటం సహజమే. కానీ ఇది భయపడాల్సిన సమయం కాదు, భయాన్ని ఓడించాల్సిన సమయం. జూబ్లీహిల్స్ ఓటర్లారా.. మీ ఓటు తెలంగాణకు శ్వాస, మీ ఓటు అహంకార పాలనకు చెక్, మీ ఓటు ప్రజాస్వామ్యాన్ని రక్షించే శక్తి. తెలంగాణ ప్రజలను ఇంతలా చిన్నచూపు చూసిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదు. తమ ఎమ్మెల్యేలనే ఇంతగా అణగదొక్కిన పాలన తెలంగాణ చరిత్రలో లేదు. ఇంకా మౌనంగా ఉండటం అంటే మోసానికి మద్దతివ్వడం, అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే. జూబ్లీహిల్స్ గెలుపు అంటే తెలంగాణ గెలుపు. జూబ్లీహిల్స్ తీర్పు అంటే తెలంగాణకు కొత్త దిశ. ఈ ఎన్నికల్లో మీ ఓటు ప్రజాస్వామ్యం మళ్లీ పుట్టాలన్న ఆకాంక్ష.. నమ్మకం తిరిగి రావాలన్న ఆశ.. భవిష్యత్తు బాగు కావాలన్న సంకల్పం. ఇది రేపటి తెలంగాణ కోసం, మన పిల్లల నవ్వుల కోసం, అభివృద్ధి మళ్లీ పుంజుకోవడం కోసం.
ఈసారి మీ తీర్పు చరిత్రను మార్చాలి. కాంగ్రెస్ పోతేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడే, ఇక్కడే జూబ్లీహిల్స్ నుంచే ఆ ప్రారంభం కావాలి! మీ ఓటు తెలంగాణ డెస్టినీని రాస్తుంది. మీ ధైర్యం తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అభివృద్ధి మార్గం మళ్లీ మొదలవ్వాలి. ప్రజల సమ్మతి గెలవాలి. ప్రజాస్వామ్యాన్ని పునఃస్థాపించాలి.
(వ్యాసకర్త: ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి)
– రాజేష్ నాయక్
9603579115
 
                            