ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీని నిర్మించగలమని కేసీఆర్ ఈ నెల 24న అన్నారు. ఈ మాట ఆయన మనసులో 2015 నుంచి మెదులుతున్నదే. పలు కారణాలతో వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు నాయకత్వం సెప్టెంబర్ నెలాఖరు షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ‘వారధి’గా మారే పార్టీ ఏమి చేయగలదన్నది కూడా వివరించినందున, పార్టీ పురోగమనంలో ఇదొక కొత్త అధ్యాయం కాగలదని భావించాలి.
చర్చలోకి వెళ్లేముందు, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏమి చెప్పిందీ ఒకసారి చూద్దాం. దాని సారాంశాన్నంతా రెండు మాటలలో చెప్పాలంటే.. మొదటిది-ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించటం. రెండవది-వీటిపై వివిధ వర్గాలు చేసే అసత్య ప్రచారాలను, సృష్టించే అపోహలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టడం. ఇది కేసీఆర్ క్లుప్తంగా అన్నారు గాని, ఇందులో చెప్పుకోవలసింది చాలా ఉంది.
ప్రస్తుత సందర్భంలో ముఖ్యమంత్రి ‘దళితబంధు’ను ఉదాహరించారు. ఈ పథకాన్ని రాష్ట్రమంతటా అమలు పరచగలమని, దశలవారీగా వర్తింపజేయగలమని చెప్పటం ఒకటి. పేదలు ఇతర కులాలలోనూ ఉన్నా, అంటరానితనంతో, తీవ్రమైన సామాజిక వివక్షతో వేల సంవత్సరాలుగా పీడనకు గురవుతున్నది దళితులు అయినందున వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, అది మానవత్వం అవుతుందనటం రెండవది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక పథకాలు చేపట్టడం జరిగిందని, అవి ఇతరకులాల పేదలకు కూడా ఉపయోగపడుతున్నాయని, మునుముందు ‘దళితబంధు’ వంటిది సైతం వారికి లభించగలదన్నది మూడవది. క్రమంగా సంపదలను సృష్టించటం, వాటిని పేదలకు, బడుగులకు పంపిణీ చేస్తూ పోవటం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పటం నాల్గవది.
వాస్తవానికి కేసీఆర్ ఈ మాటలు కేవలం ‘దళితబంధు’ సందర్భంలోనే అనటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటున్నారు. అమలుచేసి చూపుతున్నారు. ఆ జాబితా అందరికీ తెలిసిందే అయినందున ఇక్కడ రాయనక్కరలేదు. ముఖ్యమంత్రి చెప్తున్న పై నాలుగు విధాలైన మాటలలో అర్థం కానిది గాని, మళ్లీ ప్రత్యేకంగా వివరించవలసింది గానీ ఏమీ లేదు. భారీ ఖర్చుతో కూడిన రైతుబంధు పథకం ఇప్పటికే అందరికీ ఒకేకాలంలో అమలవుతున్నది. అంతకు కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చయ్యే ‘దళితబంధు’ ఒకేసారి అందరికీ అమలుపరిచే ఆర్థికశక్తి మనకున్నదా? పైగా దళితులకే గాక అన్ని కులాల వారికి? పైన పేర్కొన్న నాలుగు అంశాలలో ఇదొక్కటే గాక, తక్కిన మూడు కూడా ఇంతే తేటతెల్లంగా కనిపిస్తున్నాయి.
అయినప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనం కోసం సినికల్ మేధావులు ‘తిరుగుబాట్లు’ తేవటానికి ఆధా ర రహితమైన విమర్శలు చేస్తూనే ఉంటారు. దళితబంధు గురించి చేసే విమర్శలు, డిమాండ్లు వారు గత ఏడేండ్లలో ప్రతి దానిగురించి చేస్తూనే రావటం లేదా? ఇకముందు చేయబోరా? తమ విమర్శల్లోని వాస్తవవేమిటో వారికి నిజంగానే తెలియనిదా? అవి ప్రజలకు మాత్రం తెలియనివి గనుకనా? ఆ విధంగా చూసినప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అధికార పార్టీ యం త్రాంగం ఒక వారధిగా మారి పనిచేయవలసిన అవసరమే ఉండదు.
అయినప్పటికీ మరొకస్థాయిలో ఆలోచించినప్పుడు అటువంటి వారధి అవసరం. ఒక తప్పనిసరి అవసరం. ఈ విషయం గ్రహించకుండా కేసీఆర్ 2015 వంటి తొలిదశలోనే వారధి ప్రస్తావన చేసి ఉండేవారు కాదనాలి. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించటం, ప్రతిపక్షాల విమర్శలను వెల్లడిచేయటం గాక, ఈ విషయమై ఆయన పూర్తి ఆలోచనలు ఏమిటో మనకు తెలియదు గాని, చెప్పుకోవలసినవి రెండున్నాయి. పైన పేర్కొన్న నాలుగు అంశాలు ఎంతో అర్థవంతమైనవి. వాటిని ముఖ్యమంత్రి ప్రస్తావించటం, ఇతర నాయకులు వేదికలపై నుంచి ప్రసంగధోరణిలో హోరుగా మాట్లాడటం మినహా కార్యకర్తలు తగిన శిక్షణలతో నేరుగా ప్రజలవద్దకు వెళ్లి విడమరిచి చెప్పటం జరుగుతున్నదా? లేదు. ఇకనుంచి ఆ పని జరిగితే ప్రజలకు సమాచార లోపం, అవగాహన లోపం ఉండవు. ఆ పనివల్ల పార్టీ ఎన్నికల కాలపు యుద్ధపార్టీగా మిగలక, రెండు ఎన్నికల మధ్య శాంతికాలపు పార్టీగా, నిర్మాణాత్మక పార్టీగా రూపు తీసుకుంటుంది. ప్రజల నుంచి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది.
రెండవది, దీనంతటి ఫలితంగా మళ్లీ కేసీఆర్ ఈ నెల 24న అన్నట్లు, పార్టీ బలపడుతుంది. దానితో ప్రభుత్వం పటిష్టంగా మారుతుంది. ఈ సందర్భంగా ఆయన డీఎంకే పార్టీ వ్యవస్థ గురించి ప్రస్తావించటం గమనించదగ్గది. మన దేశంలో అన్ని పార్టీలకు యంత్రాంగాలున్నా యి గాని అవి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా నిరంతరం పనిచేసే ఉదాహరణలు అతితక్కువ. ఆ పని సైంటిఫిక్గా జరిగితే మాత్రం ఇక ఆ పార్టీకి తిరుగుండదు. అదేరోజున టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తెలంగాణకు స్వీయ రాజకీ య అస్తిత్వం అవసరమని కీలకమైన మాట అన్నారు. అది సమకూరేది ఫెడరలిస్టు ప్రాం తీయ పార్టీ వల్లనే. అది సాకారం కావటంలో వారధి పాత్ర చాలా ఉంటుంది.
–టంకశాల అశోక్