రాట్నం మీద కండెలు చుడుతూ అమ్మ
అలా తలతిప్పుకోగానే
మగ్గం నేస్తూ నేస్తూ నాయిన ఇలా
తాటికల్లుకు పిట్టలా ఎగిరిపోయెటోడు
రాట్నం తిప్పుడు ఆపి డ్యూటీ దిగినట్టు
అమ్మ వంటింట్లోకి జారుకునేది
ఇంత తాగి కల్లు ముంత పట్టుకొస్తుంటే
అమృతం సాధించిన వీరుడిలా
నాయిన ముఖం నవ్వు పువ్వులా పూసేది
కల్లు తాగిన మీసాలు దువ్వుతూ
కల్లు తెచ్చిన రార్రా అన్నప్పుడల్లా
చిన్న పెద్ద గ్లాసుల కొట్లాట
పండుదాడు కల్లు పెయ్యికి మంచిదని
పరుపుదాడు కల్లు పరగడుపున తాగమని
ప్రాణంగా పట్టుకొచ్చిన పోద్దాడు కల్లు
వేప చెట్టుకు ఇంత పోచమ్మకు ఇంత సాక పోసి
తల్లి పిల్లలకు తాగించి అనాథ అయ్యేటోడు
అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని
తాటి పండ్లు తెచ్చి పాతరవోసి
తాత నాటిన విత్తనంలా మరచిపోయేటోడు
మళ్లీ ఎప్పుడో యాదికొచ్చి
దుంపగడ్డలు ఏవో తవ్వుతున్నట్టు
తొవ్వి తీసి త్యేగలని తిన పలికెటోడు
పడమటి తాళ్లు నాయిన సోపతిగాళ్లు
అటువైపు మనసు లాగినప్పుడల్లా
నాయిన యాదికొచ్చే జ్ఞాపకాలు
దూపగాళ్ళు కల్లు అని అంటే
తాటి తీర్థమను నాయిన కనబడితే
తాటిచెట్టు లొట్టెడు వెన్నెల ధార వొంపుతుంది
అమ్మతో పంచుకోలేని విచారాలకు
ఓదార్పు ఔషధాలు చుట్టం వచ్చినపుడల్లా
చౌకగ సాగనంపే మర్యాద దుకాణాలు
తాటి వనాలు నాయిన మెచ్చిన
పగడపు దీవులు
గాలిమార్పు కోసం నాయిన
ఎంచుకున్న పార్కులు
అడవి తల్లి ఒడిలో ఊయల ఊగుతున్నట్టు
నాయిన చెట్టు పాలు తాగే పసి బాలుడు.
గజ్జెల రామకృష్ణ: 89774 12795