పేద ప్రజలకు మేలు చేయాలనుకుంటే వాళ్లు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. పేదలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే వాళ్లు తరచూ అడ్డుపడుతుంటారు. ఇది బీజేపీ నేతల తీరు. గత పాలనలో వివక్షకు గురై అణచివేయబడిన వారిని అన్నివిధాలుగా అభివృద్ధి వైపు మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే దళిత సాధికారత కోసం ‘దళిత బంధు’ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించే ఈ పథకం దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం.
రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకం కోసం ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గానికి రెండు వేల కోట్లు విడుదల చేసింది. తాజాగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి 100 కోట్లు, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి 50 కోట్లు, అచ్చంపేట నియోజకవర్గంలోని రాచగొండ మండలానికి 50 కోట్లు, అలాగే జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి 50 కోట్ల రూపాయలు విడుదల చేయటం ముదావహం.
‘దళితబంధు’ పథకంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. అందుకోసమే ఈ పథకాన్ని ఆపేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాంతో ‘దళితబంధు’ పథకాన్ని నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ‘దళితబంధు’ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న దళిత వర్గాలకు బీజేపీ పుణ్యమాని నిరాశే మిగిలింది.
అలాంటి బీజేపీ నాయకులు దళితవర్గాల ఉన్నతి, సంక్షేమం గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం! కాబట్టి ద్వంద్వ వైఖరి అవలంబించే బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దళితుల నోటికాడి బుక్కను లాక్కుపోయిన బీజేపీ పార్టీని తెలంగాణ పొలిమేర దాకా తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నది.
దళితుల సమగ్రాభివృద్ధిలో భాగంగా ఆర్థిక అసమానతల నుంచి వారిని దూరం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అం దులో భాగంగానే ‘దళిత బంధు’కు రూపకల్పన చేశారు. ఆర్థిక వనరులు సమకూర్చుతూ పారిశ్రామిక రంగంలో దళితులు సైతం రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలు తమ ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నదన్న అభద్రతాభావనతో ప్రభుత్వంపై, పథకాలపై విష ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కోవడం చేతకాక, దొడ్డిదారిన సంక్షేమ పథకాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
ఉద్యమకాలం నుంచి ఈటల టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. మెదక్ పట్టణానికి సమీపంలో ఉన్న హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో వందల ఎకరాల భూమిని అక్రమంగా దళితుల నుంచి సొంతం చేసుకున్నారు. నేడు ఆ భూము లు దళితుల ఆధీనంలో ఉంటే వారెంతో ఆర్థికంగా ఎదిగేవారు. వ్యవసాయ భూములు కోల్పోయి, చేసుకునేందుకు ఉపాధి లేక దళితులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతటితో ఆగకుండా నీతిమాలిన వ్యక్తిగా అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీ పంచన చేరాడు. ఈ నేపథ్యంలో ‘దళితబంధు’ను అడ్డుకున్న వారి రాజకీయ భవిష్యత్తును సమాధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకోసం దళిత సమాజం కంకణబద్ధులై ఉండాలి. పగటి వేషగాళ్ల నేతల పనిపట్టేందుకు పల్లెలన్నీ కాపుగాయాలి. దళితులకు సంక్షేమ పథకం అందకుండా అడ్డుకున్న పార్టీలకు ‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’ అన్న కాళోజీ మాటల స్ఫూర్తితో తగిన బుద్ధి చెప్పాలె.
(వ్యాసకర్త: రాష్ట్ర ఉపాధ్యక్షులు,
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ )
–గుండెకారి రంగారావు ,99493 04591