పునాదులు పడ్డ నాటి నుంచీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు, కేసీఆర్ వ్యతిరేకుల నుంచి కాళేశ్వరం విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటున్నది. ఆ విమర్శలు, ఆరోపణలను చూస్తుంటే, ఈ ప్రాజెక్టును అపఖ్యాతి చేయడమే వారి ముఖ్య ఉద్దేశమని స్పష్టమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో నిర్మించిన, నిర్మిస్తున్న అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో చాలా పొరపాట్లు జరిగాయి. ఈ పొరపాట్లు, తప్పులకు స్పష్టమైన ఆధారాలున్నాయి. అయినప్పటికీ కాళేశ్వరంపై జరిగినంతగా దుష్ప్రచారం మరే ఇతర ప్రాజెక్టు విషయంలో జరగలేదు. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల వాదనలు దాదాపు ఒకేలా ఉండటం ఆసక్తికరం.
సాధారణంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు ఇటువంటి పొరపాట్లను రాజకీయం చేయవు. ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో. అందులోనూ, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి స్పందిస్తాయి. ఇటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల్లో కూడబలుక్కొని ధైర్యంగా రాజకీయం చేయగలగడానికి ప్రధాన కారణం తెలంగాణ రైతు సమాజం ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగకపోవడమే.
తెలంగాణ రైతు సమాజం సాగునీటి వనరులపై ఇంకా సరైన అవగాహన పెంచుకోలేదు. దీనికి ఉదాహరణ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. తలాపున ఉన్న నీళ్లు దారిమళ్లిపోతున్నా కృష్ణా బేసిన్ రైతులు ఆయా రాజకీయ పార్టీలను నిలదీయడం లేదు. కావేరి నీటి విషయంలో గాని, నాగార్జునసాగర్ కుడి కాలువ జలాల విడుదల విషయంలో గాని ఆయా ప్రాంతాల్లోని రాజకీయ పార్టీలన్నీ రైతు ఎజెండా లక్ష్యంగా ఉద్యమిస్తాయి. కానీ, తెలంగాణలో మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు ఈ జల దోపిడీని అడ్డుకోవడానికి ఉద్యమించడం అటుంచి, ఎన్నికల్లో చర్చించదగిన అంశంగా కూడా గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. ఇక్కడ రెండు వైపులా పొరపాట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, రైతులు సంఘటితమై గట్టిగా నిలదీస్తే రాజకీయ పార్టీల్లో చైతన్యం రావొచ్చు. అది జరగడం లేదు. రెండవది, రాజకీయ పార్టీలు ఈ జల దోపిడీని ఎన్నికల అస్త్రంగా మార్చుకొని రైతులను చైతన్యం చేయవచ్చు. కానీ, అసలు దీన్నొక ఎన్నికల అంశంగా కూడా ఎవరూ గుర్తించడం లేదు. తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల దౌర్భాగ్యం ఏమిటంటే.. అవి ఇంకా పక్క రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా ఉన్న రాజకీయ పార్టీల జెండా కిందే పనిచేస్తున్నాయి.
కాళేశ్వరంపై అసంబద్ధ, నిరాధార ఆరోపణల ప్రచారం వల్ల ప్రధానంగా బలవుతున్నది తెలంగాణ రైతులే. తమ జీవనోపాధికి సాగునీటి కోసం కలలుగంటున్న తెలంగాణ అన్నదాతలే నష్టపోతున్నారు. సోషల్ మీడియా యుగంలో తప్పుదోవపట్టించే సమాచారం సత్యం కంటే వేగంగా వ్యాపిస్తుంది. సోషల్ మీడియాలో కుట్రపూరిత ప్రయోజనాలకు అనుగుణంగా కథనాలు రూపొందుతాయి. కాళేశ్వరంపై ఇలాంటి తప్పుడు కథనాలు ఎన్నో ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ సంస్థల నివేదికల ఆధారంగా తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నమే ఈ వ్యాసం.
కాళేశ్వరం ప్రాజెక్టు 2019 జూన్‌లో ప్రారంభమైంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. తెలంగాణను దాటి కిందికి పరిగెత్తుతున్న గోదావరి నదీ ప్రవాహాన్ని ఎత్తిపోసి, చారిత్రకంగా కరువుపడిన వ్యవసాయ భూములను సేద్యానికి అనుకూలంగా మార్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు 1,832 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 203 కిలోమీటర్ల మేర వాగులు, భారీ జలాశయాలు, కాలువలు, పంప్ హౌస్‌లు ఇందులో భాగం. సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మ సాగర్‌కు (15 టీఎంసీలు) కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని లిఫ్ట్ చేస్తుంది. దారిలో మధ్యమానేరు (25 టీఎంసీలు), అన్నపూర్ణ (3.5 టీఎంసీలు), రంగనాయకసాగర్ (3 టీఎంసీలు), మల్లన్నసాగర్ (50 టీఎంసీలు) లాంటి జలాశయాలను కాళేశ్వరం నింపుతుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. 18 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించడమే కాకుండా, 27 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ కాళేశ్వరం లక్ష్యం. పరోక్షంగా, 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పలు చెక్‌డ్యామ్‌ల కింద సుమారు 20 లక్షల ఎకరాలను సేద్యానికి అనుకూలంగా మార్చారు.
కాళేశ్వరం సాధారణ సాగునీటి ప్రాజెక్టు కాదు. వాస్తవానికి భారతదేశంలో ఎక్కడా, ఎటువంటి ప్రాజెక్టులతో పోల్చలేనటువంటి అసాధారణమైన ఇంజినీరింగ్ నమూనా దీని సొంతం. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రైతుల దీర్ఘకాలిక నీటి సమస్యలను పరిష్కరించటమే కాక వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా
నిలబడిన గొప్ప కట్టడం కాళేశ్వరం.
ప్రత్యేక సమస్యలకు మూస పద్ధతిలో పరిష్కారం కనుగొనలేం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ భావాన్ని అద్భుతంగా ఆచరణలోకి పెట్టింది. తెలంగాణ సోయిలేని కొందరు ఇంజినీర్లు, రాజకీయ నాయకులు సూచించినట్టుగా గోదావరి-ప్రాణహిత సంగమంలో భారీ డ్యామ్‌ను నిర్మించడానికి పూనుకుంటే ఇంకో మూడు దశాబ్దాలైనా ఆ ప్రాజెక్టు పూర్తికాకపోయేది. ఎందుకంటే, అలాంటి డిజైన్ వల్ల అంతర్రాష్ట్ర జలవివాదాలు, పర్యావరణ, ముంపు సమస్యలు ఏర్పడే అవకాశం ఉండేది. అలా కాకుండా కొత్త దారిలో నడిచిన కాళేశ్వరం వినూత్న పరిష్కారాన్ని అందించింది. గోదావరిపై నిర్మించిన వరుస బ్యారేజీలకు నీళ్లను లిఫ్ట్ చేయడం వల్ల నదినే జలాశయంగా ఉపయోగించుకునే వెసులుబాటు లభించింది. తద్వారా ఇది ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచింది.
పరీవాహక ప్రాంతంలో పునరావాస సమస్యలు లేకుండా గోదావరి నదిని పునరుజ్జీవింపజేసే విధంగా 38 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తోడ్పడ్డాయి. ఈ విభిన్న ఆలోచనా విధానం ప్రధాన సవాళ్లను అధిగమించడమే కాక, అతి తక్కువ కాలంలో ఎగువ జిల్లాలకు నీటిని అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసి చూపే ప్రయత్నంలో విమర్శకులు కాగ్ నివేదికను ఉటంకిస్తూ 2022 మార్చి నాటికి 40,888 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ, వారి వాదనను 2022 మార్చి నాటికి వరి సాగు డేటాతో పోల్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.
2023 జనవరి 15న ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన (గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్పై నిందలను ప్రచారం చేసింది ఈ పత్రిక. ఆ ప్రచారాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నది) కథనం ప్రకారం.. 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి 2023 జనవరి 11 నాటికి 17,98,466 ఎకరాల్లో వరి సాగైంది. ఇది ఆ కాలానికి అంచనా వేసిన సాగు విస్తీర్ణం (8,29,279 ఎకరాలు) కంటే రెండు రెట్లు అధికం కాగా, 2021-22లో అదే సమయంలో సాగు విస్తీర్ణం (3,85,106 ఎకరాలు) కంటే నాలుగు రెట్లు ఎక్కువ. 2018-19 నుంచి 2023-24 మధ్యకాలంలో వరి కొనుగోళ్లు సుమారు 55 శాతం పెరిగాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి లభ్యత పెరిగి, తద్వారా ధాన్యం ఉత్పత్తి పెరిగినట్టు ఈ డేటా సూచిస్తున్నది. అందువల్ల విమర్శకుల ఆరోపణలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అంతేకాదు, విమర్శకులకు డేటాపై సరైన అవగాహన లేదని వారి ఆరోపణలు తెలియజేస్తున్నాయి.
పంట దిగుబడులే కాకుండా, భూగర్భ జల స్థాయులను మెరుగుపరిచి పర్యావరణ సమతుల్యతకు కూడా కాళేశ్వరం దోహదపడింది. జలాశయాలను నింపడం ద్వారా భూగర్భ జల నిల్వలు సగటున 4 మీటర్ల కంటే ఎక్కువ పెరిగాయి. దీని వల్ల బోర్లు, బావుల ఆధారిత సాగు విస్తృతంగా పెరిగింది. సాగునీటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతు ఆత్మహత్యలను తగ్గించేందుకు కాళేశ్వరం కృషి చేసింది. ఫలితంగా వ్యవసాయ స్థిరత్వానికి దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. భారతదేశపు ‘రైస్ బౌల్’గా, స్థిరమైన అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణను ప్రపంచానికి కాళేశ్వరం పరిచయం చేసింది.
కాళేశ్వరంప్రాజెక్టు ప్రయోజనాల లోతును అర్థం చేసుకోవడానికి ఈ చర్చను చారిత్రక నేపథ్యంతో చూడడం అవసరం. చారిత్రకంగా 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. గోదావరి జలాలను తెలంగాణ కోసం వినియోగించలేదు. గోదావరి బేసిన్లో 75 శాతం విశ్వసనీయతతో 4,158 టీఎంసీల నీటి వార్షిక ఉత్పత్తి అంచనా వేయబడింది. ఈ నీటిని ఉత్తర తెలంగాణలోని కరువు జిల్లాలకు మళ్లించవచ్చు. కానీ, అప్పటి ప్రభుత్వాలు అలా చేయలేదు. 1963లో నిజామాబాద్‌లో గోదావరి మీద నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణ సాగుకు ఉపయోగపడాల్సింది. కానీ, నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమై ప్రాజెక్టు మరుగునపడ్డది. కర్ణాటక, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా, పూర్తికాని కాలువల వల్ల ఈ ప్రాజెక్టు ఆయకట్టు ఉనికిలో లేకుండాపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కోస్తాంధ్ర సాగునీటికి ప్రాధాన్యతనివ్వగా, గోదావరి నీటిని తెలంగాణ కోసం అస్సలు వినియోగించలేదు. అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ప్రాజెక్టు ఖర్చులు, భౌగోళిక సమస్యలు గోదావరి జలాల వినియోగాన్ని సంక్లిష్టం చేశాయి.
కాళేశ్వరం నీళ్లు తెలంగాణలోని అత్యంత ఎత్తయిన ప్రాంతాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి గురుత్వాకర్షణ శక్తి ద్వారా అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేశాయి. హల్దీవాగు, కూడెల్లి వాగు వంటి చిన్నవాగులు కూడా పునరుజ్జీవనం పొందాయి. పాత బావుల్లో ఊటలు పెరిగాయి. మరుగునపడిన బోర్లు మళ్లీ నీళ్లు పోయడం ప్రారంభించాయి. కాళేశ్వరం ప్రారంభమైన తర్వాత తెలంగాణ గ్రామాల్లో బోర్వెల్ బండ్ల రాక బంద్ అయ్యింది. దీని వల్ల తెలంగాణలోని ఒక గ్రామం ఏడాదికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆదా చేసుకుంటున్నది.
కాళేశ్వరం జలాలు రైతుల మనోధైర్యాన్ని పెంచాయి. హైదరాబాద్, ముంబై, దుబాయి వంటి సుదూర నగరాలకు వలసవెళ్లిన చాలా మంది రైతులు స్వగ్రామాలకు తిరిగివచ్చి మళ్లీ వ్యవసాయాన్ని చేపట్టారు. నిరాశ నుంచి ఆశ వైపు మార్పు స్పష్టంగా కనిపించింది. రైతుల్లో భవిష్యత్తుపై భరోసా ఏర్పడింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగంలో ఒక స్వర్ణయుగాన్ని తీసుకువచ్చింది నాటి సర్కారు. దీని ద్వారా అతి తక్కువ కాలంలోనే ‘బంగారు తెలంగాణ’ సాకారమైంది.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సాగునీరు సహాయపడింది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మిషన్ భగీరథ ద్వారా కోటి మందికి పైగా తాగునీటిని అందించింది. తద్వారా మహిళలకు శ్రమ తగ్గింది. ఇది స్థిరమైన అభివృద్ధికి దోహదపడింది. సాగునీరు అందించడం, భూగర్భజల పునరుద్ధరణ మాత్రమే కాదు, 2014-15 నుంచి 2023-24 వరకు చేపల ఉత్పత్తిని 70 శాతం పెంచుతూ, 2024 నాటికి రూ.7 వేల కోట్ల వార్షిక ఉత్పత్తి విలువనూ కాళేశ్వరం సాధించింది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ విధంగా గ్రామీణాభివృద్ధికి కాళేశ్వరం ఊతమిచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రత్యక్షంగా గుర్తించిన పలువురు రాజకీయ నాయకులు దాన్ని
అపఖ్యాతి పాల్జేసే కుట్రలో క్రియాశీలంగా పని చేశారు. ఇది అత్యంత దుర్గార్మం. అభివృద్ధి ఎప్పుడూ రాజకీయ ఆకాంక్షలకు మించి ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తు వ్యక్తిగత ప్రతీకారాలకు, రాజకీయ ప్రేరేపణలకు కాళేశ్వరం బలవుతున్నది.
కొందరు నాయకులు వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవాలని చేసిన ప్రయత్నం చివరికి ఒక పెద్ద రాజకీయ దుమారం ఏర్పడటానికి కారణమైంది. ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తరతరాలు అభివృద్ధికి నోచుకోలేదు. దీని వల్ల సామాజిక, ఆర్థిక నష్టం జరిగింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయ డం ప్రభుత్వ రాజ్యాంగపరమైన బాధ్యత. అందువల్ల కాళేశ్వరాన్ని సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా సామాజిక సంక్షేమ, అభివృద్ధి ప్రాజెక్టుగా చూడాలి. ఖర్చు-లాభ నిష్పత్తిని పరిమిత దృష్టితో కాకుండా చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడం, వెనుకబడినవర్గాల అ భ్యున్నతి, పేదరికం దుష్పరిణామాలను అధిగమించడమనే కోణంలో కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాజెక్టు ఖర్చు అధికమే కావ చ్చు. కానీ, గతంలో తెలంగాణ రైతుల పట్ల జరిగిన నిర్లక్ష్యం ఖర్చు కూడా తక్కువ కాదు.
(వ్యాసకర్త: ప్రొఫెసర్, సమాజ శాస్త్ర విభాగం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
– చంద్రి రాఘవరెడ్డి