వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన విద్యావ్యవస్థలోనే విప్లవాత్మక మార్పునకు నాంది కాబోతున్నది. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ సాధనలో వెనకబడి ఉన్న వర్గాల విద్యార్థులకు ఇది వరం లాంటిది. బడుగు బలహీనవర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ‘ఆంగ్ల విద్య’ ఒక సోపానం అనక తప్పదు.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో విద్యాబోధన ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల దిక్కు చూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు మోస్తున్న ఫీజుల భారాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు ఉండాలన్న తపనతో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా పాఠశాల విద్యావ్యవస్థ రూపురేఖలే మారిపోనున్నాయి. ఈ నేపథ్యంలో చాలామందికి అనేక అనుమానాలు, అపోహలున్నాయి. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులతో ఆంగ్ల విద్యాబోధన సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికిది సులువైనదే. తెలుగు మాధ్యమంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలోనూ ఒక్కటే ఉంటాయి. గణితం దాదాపు ఒకేవిధంగా ఉంటుంది. భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం తెలుగు మాధ్యమంలో చెప్పే ఉపాధ్యాయులకు, ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన కొంత ప్రయత్నంతో బోధనలో న్యాయం చేయవచ్చు. దీనికిగాను తగిన శిక్షణ ఇస్తే సులభంగా బోధించడానికి అవకాశం ఉంటుంది.
2012లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సక్సెస్ స్కూల్స్ పేరిట ఆంగ్ల మాధ్యమంలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రారంభించింది. అప్పుడు ప్రత్యేక శ్రద్ధతో పాఠశాల ఉన్న సంబంధిత బస్తీల్లో తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించి ఇంగ్లీష్ మీడియంలో మంచి ప్రవేశాలను సాధించిన అనుభవాలున్నాయి. అలాగే విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఉదాహరణకు హైదరాబాద్, బండ్లగూడ మండలంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఇప్పుడు 360కి పైగా విద్యార్థులున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో అనేకమంది ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సక్సెస్ పాఠశాలలను విజయవంతంగా నడిపిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆదరాభిమానాలను పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభిస్తే ఉపాధ్యాయుల పిల్లలతో పాటు సమాజంలోని అన్నివర్గాల వారు కూడా చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కచ్చితంగా చదువాలనే నిబంధనలు పెడితే గతంలో లాగా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడానికి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన ఉండటానికి ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ప్రారంభించటం హర్షణీయం.
(వ్యాసకర్త: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, రాష్ట్ర కార్యదర్శి)
డాక్టర్ ఎస్.విజయభాస్కర్
92908 26988