ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో ఓ హాస్పిటల్‌పై జరిగిన క్షిపణి దాడిలో 500 మందికి పైగా మరణించిన ఘటన ప్రపంచాన్ని కలచివేసింది. ప్రధాని మోదీతో సహా ప్రపంచదేశాల అధినేతలు దాడిని ఖండించి గాజా ప్రజలకు సానుభూతి తెలిపారు. ఘటనపై ఇజ్రాయెల్, పాలస్తీనా వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. హమాస్ జరిపిన మెరుపు దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర జరుపుతున్న సంగతి తెలిసిందే. సహజంగానే అందరూ హాస్పిటల్‌పై దాడి ఇజ్రాయెల్ పనే అని మొదట్లో భావించారు.
హమాస్ రాకెట్ దారితప్పి దవాఖానపై పడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ‘అవతలి టీం’ వాళ్ల పనే అన్నారు. అంటే హమాస్ అని అర్థం చేసుకోవాలి. ఆ సంగతి అలా ఉంచితే, పనిలోపనిగా బైడెన్ ఇజ్రాయెల్‌కు ఓ సలహా ఇచ్చారు. గాజాలో సామాన్య ప్రజలకు సహాయం అందించే అవకాశం ఏ మాత్రం ఉన్నా ఇజ్రాయెల్ అందుకు తప్పక చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఆగ్రహావేశాల వల్ల తప్పిదాలు చేసిందని, ఇజ్రాయెల్ అలాంటివి చేయకుండా ఉండాలని ఆయన చెప్పడం గమనార్హం.
గాజా యుద్ధంపై మారుతున్న ప్రపంచ వైఖరికి బైడెన్ మాటలు ఓ సూచికగా నిలుస్తాయి. వైట్‌హౌజ్‌ను ముట్టడిస్తున్న పాలస్తీనా అనుకూల ఆందోళనకారులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ మాటలు అని ఉండొచ్చు. కానీ, గాజా ప్రజల విషయంలో అమెరికాకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపే ఘటన ఐక్యరాజ్యసమితిలో జరిగింది. బహిరంగ జైలు లాంటి గాజా పరిస్థితి ప్రస్తుత యుద్ధంతో పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది.
గాజా ప్రజలు పడుతున్న కష్టాల గురించి చెప్పేందుకు మానవీయ సంక్షోభం అనే మాటలు కూడా సరిపోవడం లేదు. గాజాలో యుద్ధం ఇజ్రాయెల్, హమాస్ మధ్యన జరుగుతున్నప్పటికీ దానివల్ల నలిగిపోతున్నది అక్కడి సామాన్య ప్రజలే. ఓ వైపు లక్షల సంఖ్యలో ప్రజలను గాజా ఖాళీచేసి వెళ్లాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. మరోవైపు కరెంటుతోపాటు కనీస అవసరాల సరఫరాను నిలిపివేసింది. యుద్ధం కారణంగా ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు అవుతున్నారు. ఇండ్లు బూడిద కుప్పలవుతున్నాయి. ఈ నేపథ్యంలో హాస్పిటల్ ఘటన జరగడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. గాజా ప్రజలను ఆదుకునేందుకు ఏదైనా చేయాలనే ప్రయత్నాలు ఐక్యరాజ్య సమితిలో మొదలయ్యాయి.
బాధితులకు తక్షణ సాయాన్ని అందించేందుకు యుద్ధానికి ‘మానవీయ విరామం’ కల్పించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బ్రెజిల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటోతో ఎగరగొట్టింది. అందుకు అమెరికా చూపుతున్న కారణాలు కుంటిసాకులుగానే కనిపిస్తున్నాయి. ‘ఇజ్రాయెల్ ఆత్మరక్షణ’ అనే మాటలు లేనందున తీర్మానం తమకు ఆమోదయోగ్యం కాదని అమెరికా అంటున్నది. బైడెన్ దౌత్యం సాఫల్యత పొందడానికి తగిన సమయమూ ఇవ్వాలట. సాయం విషయంలోనూ ఆధిపత్యం కావాలనేది అమెరికా ధోరణిలా కనిపిస్తున్నది. ప్రపంచం ఇలా మీనమేషాలు లెక్కిస్తుంటే అటు గాజా ప్రజలు దిక్కులేని పరిస్థితుల్లో ఊరట కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తూనే ఉన్నారు. రెండేండ్లుగా కొనసాగుతున్న యుద్ధంతో పాటు పశ్చిమ ఆసియాలో తాజా సంక్షోభం ప్రపంచాన్ని కుతకుతలాడిస్తున్నది.