పచ్చదనం హరించుకుపోయి భూమికి జ్వరం వస్తున్నదని మనిషి గ్రహించేసరికే కాలయాపన జరిగిపోయింది. గొడ్డళ్లు తమ పని కానిచ్చాయి. చెట్లు కూలుతున్న దృశ్యం భూతల్లి నిరంతర పీడకలగా మారింది. శిథిల వనాల సాక్షిగా ఎన్నో జీవజాతులకు మరణశాసనం లిఖించబడింది. అవతారం చాలించి అంతర్థానమయ్యాయి. భూమిని ఉగ్రతాపం ఉడికిస్తున్నది. మంచుకొండలు కరిగి ఎడారుల్లోకి ఇంకిపోతున్నాయి. ఒడిలో ఆడుకునే పాప రేపటి వసంతం, గ్రీష్మంలో మాడిపోతున్నది. ఇలాంటి దుర్భర, దుస్సహ వాతావరణంలో చెట్టు భుజం తట్టినవాడు ‘వనజీవి’ రామయ్య. నిలువెల్లా హరిత సందేశాన్ని మోసిన ‘పావనజీవి’ రామయ్య.
మొక్కలు నాటడమే మనిషికి మోక్షమార్గమని చాటిన హరిత తపస్వి వనజీవి రామయ్య. ‘ఎవరో తోడు వస్తారని’ ఆయన ఎన్నడూ ఎదురుచూడలేదు. ‘నాతో ఏమవుతుందిలే’ అని ఆయన ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. ‘ఏక్లా చలోరే’ అంటూ ఒంటరిగానే సాగిపోయాడు. తన వేళ్ల సత్తాను నమ్ముకున్నాడు. మట్టిని బుజ్జగించి, విత్తును లాలించి, కాలచక్రాన్ని వెనుకకు తిప్పే సాహసానికి పూనుకున్నాడు. బతుకుబాట పొడవునా పచ్చదనాన్ని పరిచాడు. ముడుచుకుపోతున్న హరితావరణాన్ని ‘భయం లేదు.. నేనున్నాన’ని వేలుపట్టి ముందుకు నడిపించాడు. చెట్టుకు మనిషి చేసిన గాయానికి కట్టు కట్టాడు. సిసలైన చుట్టమయ్యాడు. తానే ఒక చెట్టయ్యాడు. తన అడుగుజాడలను చెట్ల నీడలు వెంబడించాయి. మట్టిలోకి తన వేళ్లను పంపించి, శాఖల్ని ప్రసరించి, ఆకుపచ్చని జెండాలను ఎగురవేశాడు. చెట్టుకు పెట్టని కోటగోడగా మారినవాడు రామయ్య. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చాటినవాడు వనజీవి రామయ్య.
రామయ్యకు ‘వనజీవి’ అనేది ఎవరో తొడిగిన కీర్తి కిరీటం కాదు. మట్టిలో నుంచి విత్తు మొలకెత్తినంత సహజంగా అమరిన పచ్చని ఆకుల తలపాగా అది. ఆయన దండల కోసం, దండాల కోసం ఆగిచూసే రకం కాదు. బిరుదుల కోసం వెంపర్లాడని అరుదైన జాతిమొక్క. అయినా అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. తమనుతాము గౌరవించుకున్నాయి. ఇన్ని చేసిన రామయ్య ఓ అతి సామాన్యుడు. నీలాంటి, నాలాంటి మామూలు మనిషే. కానీ, కార్యదక్షతలో అసామాన్యుడు. హరిత దీక్షలో ఆదర్శమూర్తి. అవును, ఇప్పుడు రామయ్య లేడు. ప్రకృతి నేర్పిన గుణపాఠాన్ని తిరగరాసే ‘బడిపాఠ’మయ్యాడు. మన చేతిలో మొక్కను పెట్టి ఆయన వెళ్లిపోయాడు. దానిని ఎలా చూసుకోవాలో తన జీవితమే పాఠంగా మనకు బోధించినవాడు. ప్రకృతి ప్రేమికుడు వనజీవి కృషిని అర్థం చేసుకుని అందరమూ ఆచరిస్తే అదే తనకు అసలైన నివాళి. భూమినిండా ఆకుపచ్చని జ్యోతులను వెలిగిద్దాం పద. భూమాతకు హరితహారాలు వేద్దాం ఇక. చెట్టే తన శ్వాస. చెట్టే తన సందేశం. అతడిప్పుడు భూమిని చీల్చుకొని మొలకెత్తుతున్నాడు. ఆకుల నవ్వుల్లో గలగలలాడుతున్నాడు. ధన్యజీవి రామయ్య.