బడేభాయ్ నుంచి ఛోటేభాయ్ ట్రిలియన్ ఎకానమీ మంత్రాన్ని పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ కోసం ఇటు రాయి దీసి అటు పెట్టని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం బడాయి బాబు ఎచ్చులను బలాదూర్ చేసేలా ఉంది. రాష్ర్టాన్ని పదేండ్లలో లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్తామని ఆయన అంటున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసి తెలంగాణను సమున్నతంగా నిలబెడితే, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా అంచుకు చేరుకున్నది. బీఆర్ఎస్ నేతృత్వంలో రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అతలాకుత లం చేసింది. జీఎస్డీపీ, తలసరి వృద్ధిరేటు నానాటికీ తీసికట్టవుతుండటమే నిదర్శనం. కాలు మోపిన నాడే తెలుస్తుంది కాపురం చేసే కళ అన్నట్టు రాష్ర్టాన్ని ఏడాదిన్నర కాలంలో అధోగతి పాలు చేసి, ఇప్పుడేమో అందలమెక్కిస్తామని ఊరిస్తున్నారు. పాలన వైఫల్యాల నుంచి, హామీల ఎగవేత నుంచి ప్రజల దృష్టి మరల్చడమే ఈ ఆడంబరపు మాటల వెనుకనున్న అసలు ఉద్దేశం అని తెలిసిపోతూనే ఉన్నది.
కేసీఆర్ హయాంలో 2023-24 జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ 3వ ర్యాంకుకు ఎదిగితే, కాంగ్రెస్ పాలనలో ఏడాది కాలంలోనే 14కు దిగజారింది. ఇక తలసరి ఆదాయంలో రాష్ర్టాన్ని కేసీఆర్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడితే రేవంత్ సర్కారు దాన్ని 11వ స్థానానికి పడగొట్టింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ సర్కార్ అప్పుచేసి పప్పుకూడు దారిలో పబ్బం గడుపుకొంటున్నది. అప్పులు పుట్టడం లేదని ఇల్లెక్కి కూసిన ఘనతను దక్కించుకున్నారు సీఎం రేవంత్. అందరూ తలో చేయి వేయమని తన చేతకానితనాన్నీ చాటుకున్నారు. ఇప్పుడాయనే అద్దంలో చందమామను చూపిస్తున్నారు. తెలంగాణను అన్నిరంగాల్లో దిగదుడుపు చేసి రేపు ఎప్పుడో నంబర్ వన్ చేస్తానని డాంబికాలు పలుకుతున్నారు. ఉన్నది ఊడగొట్టి లేనిది తెస్తానని అంటున్నారు. ఆస్తుల కల్పన జరగడం లేదు. సంపద పెంచడం రాదు. పంచడం అసలే రాదు. ఆ మాటకు వస్తే ఆర్థికవ్యవస్థ పనితీరు సరిగా అర్థమైందా? అంటే అదీ సందేహాస్పదమే. అడ్డగోలుగా దంచిన హామీలను అటకెక్కించి, ప్రజలకు తక్షణావసరమైన సంక్షేమాన్ని పండబెట్టి ఏం అభివృద్ధి సాధిస్తారో, ఎవరి జేబులు నింపుతారో తెలియదు. ఆర్థికవ్యవస్థ పరిమాణం గురించి ఊదరగొట్టడం సరే, అందులో సామాన్యుడికి ఒరిగేదేమిటో చెప్తే బాగుండేది.
జూన్ 2 ప్రసంగంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ విజయాలంటూ ముఖ్యంగా రెండు పచ్చి అబద్ధాలను వల్లించారు. ఒకటి, ఏడాదిన్నర కాలంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చారట. రెండు, రైతులకు రుణమాఫీ ఉపశమనం కల్పించారట. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే, కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకటి కేసీఆర్ ప్రక్రియ అంతా పూర్తిచేస్తే, ఆ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకోవడం నైతికంగా దిగజారుడుతనం కాక మరేమిటి? ఇక అరకొరగా జరిగిన రుణమాఫీని ‘ప్రభుత్వ విజయమని’ చెప్పుకోవడం ఏమిటి? రైతులను అడిగితే తెలుస్తుంది ఆ బండారం!