నీళ్లు, నిధులు, నియామకాలు అనే ముప్పేట నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. మా న్యాయమైన వాటా మాకు దక్కాల్సిందే అనే డిమాండ్ దీని వెనుక ఉన్నది. స్వరాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో ఒక్కటొక్కటిగా అమలుచేస్తూ పోయారు. అయితే విద్య, ఉపాధి రంగాల్లో జోనల్ విధానం స్థానికులకు ప్రయోజనాలు దక్కకుండా అడ్డుపడుతుండటం గమనించిన సీఎం కేసీఆర్ అందుకు కారణభూతమైన రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ఎంతగానో పాటుపడ్డారు. రాష్ట్రంలో జరిగే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకే దక్కేలా ఎట్టకేలకు కేంద్ర ఉత్తర్వులు సాధించగలిగారు. ఈ ఘన విజయం ఫలితంగా నేడు తెలంగాణ బిడ్డలు లబ్ధి పొందుతున్నారు. స్థానికుల ప్రయోజనాలే లక్ష్యంగా ఏడు జోన్లతో, రెండు బహుళ జోన్లతో రూపొందించిన వ్యవస్థకు కేంద్రం యథాతథంగా ఆమోదముద్ర వేయడంతోనే ఇది సాధ్యమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా మెడికల్ సీట్లపై హైకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు ఓ శుభపరిణామం. స్వరాష్ట్ర సాధన తర్వాత సర్కారు వైద్యాన్ని ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే కృషిలో భాగంగా వైద్యవిద్యనూ సీఎం కేసీఆర్ తదేక దీక్షతో ప్రోత్సహించి అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాకో వైద్య కళాశాల స్థాపించే బృహత్తర లక్ష్యంతో ముందడుగు వేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం జారీచేసిన జీవో 72ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు విద్యార్థులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 72 చట్టబద్ధమేనని, 1974 జూలై 3వ తేదీ నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 5, 6 పేరాలకు విరుద్ధం కానే కాదని, ఆలిండియా కోటా 15 శాతం మినహా మిగిలిన కాంపిటెంట్ పూల్ కోటాలోని 85 శాతం సీట్లు స్థానిక తెలంగాణ విద్యార్థులకే చెందుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే కాదు, తెలంగాణ ప్రభుత్వ ఘనవిజయంగానూ అభివర్ణించవచ్చు.
తాజా పరిణామాల ఫలితంగా తెలంగాణ వైద్య విద్యార్థులకు ఏటా 1,820 మెడికల్ సీట్లు దక్కనున్నాయి. అంటే ఇవి దాదాపు 20 మెడికల్ కాలేజీలతో సమానం కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వానికి ఇది అదనపు బలం కాగా, విద్యార్థులకు అదనపు ప్రయోజనం అని చెప్పాలి. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నది. ఓ వైపు సర్కారు దవాఖానలను అభివృద్ధి చేస్తూ, మరోవైపున మల్టీస్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తూ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్ స్థానికంగా వైద్య విద్యాభివృద్ధికి వేస్తున్న పునాదులు ప్రశంసనీయమైనవి. అయితే రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్నది. బహుశా దేశ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టమని చెప్పవచ్చు.