రైతుకు ఉచిత సలహాలా?
తెలంగాణలో యాసంగి వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత సలహా ఇచ్చారు. నీటి కొరత తీవ్రంగా ఉన్నదని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నదని, ఎల్ నినో ప్రభావంతో రాబోయే కాలంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారవచ్చని ఆయన అంటున్నారు. నీటిని పొదుపు చేయాలని రైతులకు చెప్పే ప్రభుత్వం, అందుబాటులోకి వచ్చిన నదీ జలాలను ఒడిసి పట్టడానికి ఏం చేసింది?
తెలంగాణలో యాసంగి వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత సలహా ఇచ్చారు. నీటి కొరత తీవ్రంగా ఉన్నదని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నదని, ఎల్ నినో ప్రభావంతో రాబోయే కాలంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారవచ్చని ఆయన అంటున్నారు. నీటిని పొదుపు చేయాలని రైతులకు చెప్పే ప్రభుత్వం, అందుబాటులోకి వచ్చిన నదీ జలాలను ఒడిసి పట్టడానికి ఏం చేసింది? అనేది అసలు ప్రశ్న. వర్షాలు తక్కువగా పడితే అది ప్రకృతి వైపరీత్యం. అయితే అందుబాటులో ఉన్న నీటిని నిల్వ చేయకపోవడం, ఎత్తిపోతల పథకాలను సమర్థవంతంగా నిర్వహించకపోవడం, విద్యుత్తు అవసరాలను ముందుగానే అంచనా వేయకపోవడం సర్కార్ వైఫల్యం. దానికి ఇప్పుడు రైతులను బలిచేయడం దారుణం. ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి భారీ మొత్తంలో నీరు దిగువకు వెళ్లిపోయిందన్నది నూరుశాతం వాస్తవం. జూన్ 1 నుంచి గోదావరి నుంచి 750 టీఎంసీలకు పైగా, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు దిగువకు వెళ్లింది.
కాళేశ్వరం పరిధిలోని పంపుహౌస్‌లు, దేవాదుల, పాలమూరురంగారెడ్డి, కల్వకుర్తి వంటి పథకాలను అవసరానికి అనుగుణంగా నడిపి మరింత నీటిని వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ పొరుగు నీటిదొంగలకు సద్దిగట్టే ముఖ్యమంత్రి ఆ పని చేయలేదు. కక్షలతో కాళేశ్వరాన్ని పండబెట్టి, రైతుల పొలాలను ఎండబెట్టడం దుర్మార్గం. ఎల్ నినో ప్రభావం, వర్షపాతంలో లోటు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై వాతావరణ సంస్థలు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్న సమయంలోనే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వ లక్ష్యాలు నిర్ణయించడం, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమైన విద్యుత్తును సమకూర్చడం, చెరువులను నింపడం, భూగర్భ జలాల పరిస్థితిని పర్యవేక్షించడం వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది. అలా చేయకపోగా సంక్షోభం తీవ్రత స్పష్టమయ్యాకే హడావిడిగా సమీక్షలు, సమావేశాలు, హెచ్చరికలు అంటూ హంగామా చేయడం తెలిసిందే. ఎల్ నినో ఏం చేయబోతున్నదో, నీటి అవసరాలు ఎలాంటివో సర్కార్‌కు తెలియదా? సంక్షోభం వచ్చిన తర్వాత ప్రజలను చావుకబురు చల్లగా చెప్పడం కాదు, ముందుగానే వ్యవస్థలను సిద్ధం చేయడంలో సర్కారు దారుణంగా విఫలమైంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు తాగునీటిని కాపాడటం అవసరమే. కానీ ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నీటి లభ్యత మెరుగ్గా ఉన్న సమయంలో ఎంత నీటిని నిల్వ చేశాం? ఎన్ని చెరువులు నింపాం? ఎత్తిపోతల పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు వినియోగించలేదు? ఈ ప్రశ్నలకు సర్కార్ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
నేటి వ్యవసాయ సంక్షోభానికి మరో ముఖ్యమైన కారణం విద్యుత్తు కొరత. విద్యుత్తు ఉత్పత్తి, కొనుగోలు, బొగ్గు నిల్వలు, జలవిద్యుత్తు వినియోగం వంటి అంశాలపై ముందస్తు కార్యాచరణ లోపించడం వల్ల ఇది తలెత్తింది. విద్యుత్తు కొనుగోలు చేయడం తక్షణ పరిష్కారం కావచ్చు. కానీ ప్రతిసారీ అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది? రాష్ట్రంలోని అందుబాటులో ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తెచ్చారా? థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయా? నిర్వహణలో ఉన్న యూనిట్లను సకాలంలో సిద్ధం చేశారా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రైతుల భవిష్యత్తును ప్రభావితం చేసే మౌలిక ప్రశ్నలు ఇవి. యాసంగిలో వరి సాగు మానుకోవాలని ప్రభుత్వం అంటున్నది. మరి ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా ఉన్నదా? వరి సాగు చేయకపోవడం వల్ల వచ్చే ఆదాయ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు? రైతుకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు, విత్తనాల లభ్యత, నీటి సరఫరా గురించి సర్కార్‌కు స్పష్టత ఉన్నదా? ఎక్కడి నుంచి ఎక్కడికి పతనం? నెర్రెలు వారిన నేల దాహార్తి తీర్చేందుకు నీటిని కొండలెక్కించిన కేసీఆర్ ఎక్కడ? చేతగాని, చేవలేని పాలనతో నీటిని జారవిడిచిన పాలకులు ఎక్కడ? దండగన్న సాగును బాగుపరచడమే కాక, వరిసాగులో తెలంగాణను దేశానికే మకుటాయమానంగా నిలిపారు కేసీఆర్. ఇప్పుడా వరిసాగే వద్దని చెప్పే నడమంత్రపు నాయకత్వం వచ్చింది. నదుల్లో నీరు పారినా ఇప్పుడు సాగు బంద్‌పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాక మరేమిటి? నీరు లేదని రైతుకు చెప్పడం సులభం. వచ్చిన నీటిని ఎందుకు నిల్వ చేసుకోలేకపోయామో సంజాయిషీ ఇచ్చుకోవడం పాలకుల బాధ్యత. రైతులకు ఉపదేశాలు ఇచ్చే ముందు ప్రభుత్వం తన పనితీరుపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

