ఆత్మరక్షణ పేరిట ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడి ఎడతెగని యుద్ధంగా మారింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఇతరత్రా సాయం అందిస్తున్నాయి. రష్యాకు చైనా, ఉత్తరకొరియా వంటి దాని మిత్రదేశాలు తమవంతుగా తోడ్పాటు అందిస్తున్నాయి. యుద్ధం మొదలై రెండేండ్లు దాటినా ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై జరిగిన శాంతి శిఖరాగ్రసభ మిశ్రమ ఫలితాలనిచ్చింది. గత వారాంతంలో స్విట్జర్లాండ్‌లోని బర్జెన్ స్టాక్ విడిది కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలు, అనేక ఇతర దేశాల విదేశాంగ మంత్రులు, దౌత్యాధికారులు పాల్గొన్నారు. యుద్ధంలో ప్రధాన పాత్రధారి రష్యా గానీ, మిత్రదేశమైన చైనా గానీ హాజరు కాకపోవడం గమనార్హం.
పేరుకు ఇది శాంతి శిఖరాగ్ర సభ అయినప్పటికీ ఇది యుద్ధ పరిసమాప్తి కోసం ఏర్పాటైంది కాదనేది మొదటినుంచీ అందరూ భావిస్తున్నదే. కీలక అంశాలపై ఉమ్మడి దృక్పథం పేరిట సమావేశం చివరన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఉక్రెయిన్ అణుకేంద్రాల భద్రతపై అంతర్జాతీయ పర్యవేక్షణ, గోధుమల రవాణా నిరాటంకంగా సాగేందుకు వీలు కల్పించడం, కాందిశీకులు తిరిగి తమ ఇండ్లకు తరలివెళ్లడంలో తోడ్పాటు అందించడం అనే మూడు ప్రధాన లక్ష్యాలను పేర్కొన్నారు. ఈ ప్రకటనపై పశ్చిమ దేశాలకు అనుకూలమైన 82 దాకా దేశాలు సంతకాలు చేశాయి. సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన స్విస్ అధ్యక్షురాలు వయోలా ఆమ్హెర్డ్ దీనిని ‘భారీ మెజారిటీ’గా అభివర్ణించినప్పటికీ అనేక దేశాలు సంతకం చేసేందుకు నిరాకరించడం చర్చాంశమైంది. అందులో భారత్ కూడా ఉంది. రష్యా హాజరు కాలేదనే కారణంగా భారత్ ఉమ్మడి ప్రకటనకు దూరంగా ఉండిపోయింది.
రష్యాకు ఆహ్వానమే పంపకపోవడం, సమావేశాన్ని రష్యా ‘వృథాప్రయాస’గా కొట్టిపారేయడం తెలిసిందే. చైనాకు సన్నిహితంగా మెలిగే పాకిస్థాన్‌కు ఆహ్వానం వెళ్లినా ఆ దేశం తిరస్కరించింది. ప్రధాన పక్షాలు లేకుండా సమస్యకు పరిష్కారం సాధ్యం కాదనేది భారత్ వాదనగా ఉన్నది. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా తదితర దేశాలూ భారత్ బాటలోనే నడిచాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలన్న అంశం కూడా సదస్సులో విభేదాలకు కారణమైంది. ఐక్యరాజ్య సమితి కమిషన్ ముందు యుద్ధనేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ సదస్సుకు హాజరుకావడం, ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడాన్ని దక్షిణాఫ్రికా ఎత్తిచూపింది. శాంతి కృషి సఫలం కావాలంటే ఇరుపక్షాలూ హాజరుకావడం, చిత్తశుద్ధితో చర్చల్లో పాల్గొని, సందర్భాన్ని బట్టి రాజీపడటం తప్పనిసరి. భారత్ అభిప్రాయం కూడా అదే.