రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. అధికారుల మీద జనం తిరగబడుతున్నారు. మొన్న లగచర్ల, నేడు దిలావర్పూర్. స్థలకాలాలు వేరైనా సమస్య ఒక్కటే. సర్కారులో కొరవడిన మానవీయ స్పర్శ ప్రజల కోపానికి కారణమని చెప్పక తప్పదు. తమ కష్టం చెప్పుకొంటే సర్కారు వింటుందన్న నమ్మకం లేకపోవడంతో జనం ఎటూ పాలుపోక తమ దగ్గరకు వచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అసలు నేరం సర్కారుదైతే అధికారులు బలిపశువులుగా మారుతున్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణను వ్యతిరేకించిన రైతులు కలెక్టర్‌తో సహా అధికారగణాన్ని తరిమికొట్టారు. లగచర్ల ఓ వైపు రగులుతూ ఉండగానే.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిర్మల్ జిల్లా రైతులు రోడ్డెక్కడమే కాకుండా, పర్యవసానాల గురించి ఆలోచించకుండా అధికారుల బృందంపై తిరగబడటం గమనార్హం. ఆర్డీవోను బాధితులు ఘెరావ్ చేయడం, నిర్బంధించడం, ఓ ప్రభుత్వ వాహనంపై దాడి కూడా చేయడం లగచర్లను అనివార్యంగా గుర్తుచేసింది. నాలుగు గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు వంటావార్పూ చేస్తూ రోడ్డు మీదే బైఠాయించారు. వణికించే చలిలో అర్ధరాత్రి దాకా ఆందోళన కొనసాగించారంటే వారి తెగింపు ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
శాంతియుతంగా సాగాల్సిన నిరసనల్లో హింస తొంగిచూడటం సమర్థనీయం కాదు. అదేవిధంగా ఈ తరహా ఘటనలను ప్రభుత్వం కేవలం శాంతిభద్రతల సమస్యగానే చూడటమూ సరైనది కాదు. కానీ, సంయమనం లేని సర్కారు పోలీసు లాఠీనే ప్రయోగిస్తున్నది. గతంలో అల్లర్లు, లేదా దొమ్మీ జరిగినప్పుడు చిన్నచిన్న కేసులతో సరిపెట్టేది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హత్యాయత్నం నేరం మోపేదాకా పోయింది. అర్ధరాత్రి, అపరాత్రి ఇండ్లల్లో దూరి మనుషులను పట్టుకుపోతున్నారు. పోలీసు స్టేషన్లలో చిత్రహింసలు పెడుతున్నారు. ఇలా అడ్డూఅదుపూ లేకుండా పోలీసు రాజ్యం చెలాయిస్తుంటే వామపక్షాల మాటేమో గానీ కనీసం పౌరహక్కుల సంఘాలూ ముందుకువచ్చి ఇది అన్యాయమని, అమాయకులను కడగండ్లపాలు చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలకడం లేదు. ఈ పరిణామాలు గమనిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని విస్మయం కలుగకమానదు.
మాయదారి స్కీములు పెట్టి మోసకారి ఆఫర్లు ఇచ్చినట్టుగా గ్యారెంటీల పేరుతో ఊదరగొట్టి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ గుడ్డెద్దు జొన్నచేనులో పడ్డట్టుగా పాలన సాగిస్తున్నది. గమ్యం ఏమిటి? గమనం ఎలా ఉండాలి? అన్న ధ్యాస సర్కారుకు ఉన్నట్టు తోచడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది కావస్తున్నది. ఈ ఏడాది కాలంలో ఒక్క మంచి పని ఏదైనా చేశారా? అని గాలిస్తే మచ్చుకు కూడా కనిపించదు. హామీలు తుంగలో తొక్కి గ్యారెంటీలు గంగలో కలిపేశారు. ప్రజాసంక్షేమాన్ని పండబెట్టి, అభివృద్ధిని ఎండబెట్టారు. కాంగ్రెస్ మార్కు వసూళ్ల కోసం మూసీ నదిలో దేవులాడుతున్నారు. పేదరైతుల పచ్చని పొలాల్లో చిచ్చుపెడుతున్నారు. అనుభవం లేని, పాలన చేతగాని సీఎం రేవంత్ కుటుంబ పాలనకు తెరదీశారు. అన్న, తమ్ముడు, అల్లునికి రాష్ర్టాన్ని రాసిచ్చి ప్రజల పట్ల మాత్రం అయితే పరాకు కాకపోతే చిరాకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విసిగిపోయిన ప్రజలు తిరగబడుతున్నారంటే అందుకు బాధ్యత సర్కారుదే. విపక్షం రెచ్చగొట్టిందనే సాకులు ఎక్కువ కాలం నిలవవు. బీఆర్ఎస్ తన బాధ్యత మేరకు బాధితులకు సానుభూతి తెలిపి ఉండవచ్చు. సంఘీభావమూ ప్రకటించవచ్చు. కానీ, ప్రజాగ్రహం మాత్రం ఒకరు రెచ్చగొడితే వచ్చేది కాదు. పోలీసు లాఠీలు ఊపితే ఆగేది కాదు. అందలమెక్కించిన ప్రజలే అదను చిక్కితే కిందకు పడదోస్తారని కాంగ్రెస్ పాలకులు తెలుసుకోవాలి. నిప్పుతో చెలగాటమాడితే అసలుకే ముప్పు తప్పదని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.