అదానీ కుంభకోణం మీద జేపీసీ వేయాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.. మరోవైపు అదే ఢిల్లీలో వేలాదిమంది కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధనకు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. రెండింటి మీదా ప్రభుత్వానిది మౌనమే. కేంద్రంలోని బీజేపీ సర్కారు స్వభావాన్ని పట్టి చూపే అంశాలు ఇవి. అదానీ మీద అంత పెద్ద ఆరోపణలు వచ్చినా ఈగ వాలనివ్వకుండా జాగ్రత్త పడే మోదీ ప్రభుత్వం, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచాలని రైతులు, కూలీలు చేస్తున్న డిమాండ్లను పెడచెవిన పెడుతున్నది. నిజానికి అవి కొత్త కోరికలు కూడా కావు. వివాదాస్పద సాగుచట్టాల రద్దు కోసం ఏడాదిన్నర పాటు ఢిల్లీ వీధుల్లో రైతులు ఉద్యమించిన సమయంలో, యూపీ ఎన్నికల కోసం ఆ చట్టాలను ఉపసం హరించుకున్న ప్రధాని మోదీ ఎమ్మెస్పీపై స్వయంగా వారికి హామీ ఇచ్చారు.
ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. మధ్యలో కమిటీ పేరుతో కాలయాపన జరిగింది తప్పితే నికరంగా తీసుకున్న నిర్ణయాలు లేవు. అంతేకాదు, ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రైవేటుపరం చేయటానికి పావులు కదిపింది మోదీ సర్కారు. ప్రైవేటు వ్యక్తులను, సంస్థలను ధాన్యం సేకరణకు అనుమతిస్తామని గత ఏడాది ప్రకటించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు అంతోఇంతో భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపర్చటానికి కేంద్రం చేయని పని లేదు. బడ్జెట్లో భారీగా నిధులు తగ్గించారు. సంక్లిష్టమైన కొత్త నిబంధనలు తెచ్చారు. పనిదినాలను పెంచాల్సింది పోయి తగ్గించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సహకార సంఘాలను దెబ్బ తీసి, వాటిని ప్రైవేటు కంపెనీలకు, వ్యాపారులకు కట్టబెట్టటానికి వీలుగా కొత్త బిల్లులను, చట్టాలను తీసుకొచ్చారు. విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెచ్చారు. రైతుల మీద కేంద్రం కత్తిగట్టినట్లే వ్యవహరిస్తున్నది.
కర్షకులతో ఈ విధంగా వ్యవహరించిన కేంద్రం కార్మికులపైనా గుదిబండ మోపింది. దశాబ్దాలుగా అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసింది. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. పని గంటలు, వేతనం, సెలవులు, పని ప్రదేశాల్లో పరిస్థితుల పరంగా ఈ కోడ్లు కార్మికుల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయి. వీటిపై తొలి నుంచీ కార్మిక సంఘాలు, కార్మికులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు ప్రభుత్వం. బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ రైతులపై, కార్మికులపై కూడా అటువంటి విధానాలనే అమలు చేస్తున్నది. దీనిని ప్రతిఘటించాల్సిందే. నాటి రైతుల ఉద్యమానికి జడిసి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారు. సాగుచట్టాలను వెనక్కి తీసుకున్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని రెట్టించిన సమరోత్సాహంతో కార్మిక, కర్షకులు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమించాలి. ప్రజాస్వామ్యప్రియులు వారికి అండగా నిలవాలి.