e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఎడిట్‌ పేజీ ఆదిలోనే వివాదం

ఆదిలోనే వివాదం

ఆదిలోనే వివాదం

నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాస్తూ కేరళలో ఎల్‌డీఎఫ్‌ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం విశేషమే. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాత్రం తన మంత్రివర్గ కూర్పుతో ఆ ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖామంత్రిగా విశిష్ట సేవలందించిన కేకే శైలజకు ఈ సారి మంత్రిపదవి దక్కలేదు. దీంతో ఏ సేవాతత్పరత అయితే గత ప్రభుత్వానికి పేరుతెచ్చి అధికారంలోకి రావటానికి కారణమైందో దాన్నే చిన్నచూపు చూసినట్లయ్యింది. యువశక్తికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రెండోమారు అవకాశం ఉండదన్న సూత్రం ముఖ్యమంత్రి విజయన్‌కు కూడా వర్తిస్తుంది కదా అంటూ నెటిజన్లు విరుచుకుపడటంలో అర్థమున్నది. కొత్త ప్రభుత్వం ఆరంభంలోనే ద్వంద్వ ప్రమాణాలు, బంధుప్రీతిలాంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొనవలసి వస్తున్నది.
ఇరవై ఐదేండ్లుగా కేరళ అసెంబ్లీలో కేకే శైలజ సీనియర్‌ ప్రజా ప్రతినిధి. మత్తన్నూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 61 వేల మెజారిటీతో విజయం సాధించి, ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖా మంత్రిగా నిబద్ధమైన పనితీరుకు నిదర్శనంగా నిలిచారు.

కేరళలో వరుసగా వరదలు వచ్చినప్పుడు ఆమె ప్రదర్శించిన సమర్థత ఎన్నదగినది. నిపా వైరస్‌ను నిర్మూలించడంలోనూ ఆమె ప్రశంసలు పొందారు. వాస్తవానికి నిపాను ఎదుర్కొన్న అనుభవం మూలంగానే కరోనా వైరస్‌ కట్టడికి ముందుచూపుతో వ్యవహరించారు. మందులు, హాస్పిటల్‌ బెడ్లు, ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచటం వంటి ముందు జాగ్రత్త చర్యలు దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ ప్రశంసలందుకున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించటం గమనార్హం. కరోనా వైరస్‌ ఇంకా పేట్రేగుతున్న తరుణంలో ఆమెను కొనసాగించవలసింది.
పరిపాలనలో అనుభవజ్ఞులు, కొత్తవారి మధ్య సమతూకం పాటిస్తే బాగుండేది. కానీ ముఖ్యమంత్రి విజయన్‌ కొత్త మంత్రి వర్గంలో తాను తప్ప అంతా కొత్తవారే. ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పినట్లుగా కొత్త రక్తానికి చోటివ్వడం హర్షణీయమే. కానీ శైలజను దృష్టిలో పెట్టుకొని సమర్థతకు గుర్తింపు, గౌరవం దక్కాలనే వాదన బలంగా వినిపిస్తున్నది. కొత్త వారిలో విజయన్‌ అల్లుడు మహమ్మద్‌ రియాజ్‌ కూడా ఉండటం విమర్శలకు తావిస్తున్నది. విలువలకు ప్రాధాన్యమిస్తామని చెప్పే విజయన్‌ పైనే బంగారం స్మగ్లింగ్‌ ఆరోపణలొచ్చాయి. సీనియర్లను అందరిని తప్పించి తనకు ఎదురులేని పరిస్థితిని ఆయన కల్పించుకున్నారనేది స్పష్టం. సాధారణంగా బీజేపీ, వామపక్షాల వంటి సైద్ధాంతిక పునాది కలిగిన పార్టీలలో వ్యక్తి ఆధారిత రాజకీయాలు ఉండవని ప్రజలు భావిస్తారు. అధికారంలో ఉన్నవారు సీనియర్లను అణగదొక్కి మొత్తం అధికారాలు తన చేతిలో పెట్టుకోవాలని ప్రయత్నించడం దీర్ఘకాలికంగా శ్రేయస్కరం కాదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆదిలోనే వివాదం

ట్రెండింగ్‌

Advertisement