స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మెరుగైన విద్యనందించేందుకు అప్పటి ప్రభుత్వం గురుకులాల సంఖ్యను వెయ్యికి పెంచింది. నాటి సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకులాల వృద్ధి వెనుక అధ్యాపకుల కృషి మరువలేనిది. అందులోనూ అహర్నిశలు శ్రమించి గురుకులాల అభివృద్ధికి ఆలంబనగా నిలిచిన అతిథి అధ్యాపకుల కృషి ఎనలేనిది. ఒక్కమాటలో చెప్పాలంటే వారు గురుకులాలకు పునాదిరాయి లాంటివారు. 5 వేల మందికిపైగా ఉన్న వీరికి 3- 10 ఏండ్ల వరకు సీనియారిటీ ఉన్నది. ఎంతో నిబద్ధత గల వీరిని సీనియారిటీ లేదనే సాకుతో మహాత్మా జ్యోతిబా బీసీ గురుకుల సొసైటీ యాజమాన్యం తొలగిస్తుండటం శోచనీయం.
ఈ తొలగింపుల వెనుక కుట్ర దాగి ఉన్నదనే అనుమానాలు కలుగుతున్నాయి. అతిథి అధ్యాపకుల శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని, పన్నెండు నెలల వేతనాలు చెల్లించాలని, సీనియారిటీ ఉన్నవారిని రెగ్యులర్ చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉన్నది. ఈ డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే ఇప్పుడు తొలగింపులను సొసైటీ ముందటేసుకున్నదనే వాదన వినిపిస్తున్నది.
పలువురు ప్రిన్సిపల్స్, రీజినల్ కో ఆర్డినేటర్లు (ఆర్సీవో) ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ క్రమంలో రెగ్యులర్ అధ్యాపకుల బదులుగా డ్యూటీలు చేస్తామని హామీ ఇచ్చేవారిని, బంధువులను, అవినీతికి అంటకాగి గతంలో తొలగింపునకు గురైనవారిని, కులం, మతం ప్రాతిపదికన రిక్రూట్ చేసుకుంటున్న ప్రిన్సిపల్స్, రీజినల్ కో ఆర్డినేటర్లు (ఆర్సీవో).. సీనియర్లను తొలగిస్తున్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంజేపీటీబీసీ గురుకుల సొసైటీ సెక్రెటరీ, ఆయా జిల్లాల కలెక్టర్లకు అతిథి అధ్యాపకులు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
విద్యా వ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్ల సంఖ్య ఉండాలి. సాధారణంగా మన దేశంలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ప్రజాపాలన అని చెప్పుకొనే ప్రభుత్వం.. నియామకాలు చేపట్టాలే గానీ, ఇలా తొలగింపులు చేయడం సబబు కాదు. ఒకవేళ అనర్హులను తొలగించాలనుకున్నా శాస్త్రీయ పద్ధతిని అవలంబించాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా స్పందించి అతిథి అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి.
– కె.రేణుక, 90001 80941