ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక్కోరంగంలో తన బరువు, బాధ్యతల నుంచి తప్పుకోవడం సాధారణ విషయమైంది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం దగ్గరి నుంచి ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపును ఉపసంహరించుకోవడం వరకూ రకరకాల రూపాల్లో ఇది వ్యక్తమవుతున్నది. చివరికి ఈ ధోరణి భారతీయ రక్షణ దళాలపైనా ప్రభావం చూపింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఇందుకు ఓ ప్రముఖ ఉదాహరణ. ఈ పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన రక్షణ దళాల సిబ్బంది నియామకం జరుగుతున్నది. అగ్నిపథ్ కింద ఎంపికయ్యే జవాన్లకు అగ్నివీర్ అనే పేరు ఖాయం చేశారు.
సాధారణ సైనికులతో పోలిస్తే వీరికి లభించే జీతభత్యాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. పైగా సర్వీసు నాలుగేండ్లకు పరిమితం. భర్తీచేసే అగ్నివీర్లలో 25 శాతం మందికి మరో పదిహేనేండ్ల పాటు సర్వీసును పొడిగిస్తారు. మిగిలిన 75 శాతం మందిని బయటకు పంపిస్తారు. వారు బయట కొత్తగా ఉద్యోగాల వేటలో పడాల్సిందే. పైగా అగ్నివీర్లకు పింఛన్, గ్రాట్యుటీ ఉండవు. ఏకమొత్తంగా కొంత సొమ్ము చెల్లిస్తారు. ఆర్మీ క్యాంటీన్, వైద్య సౌకర్యం వంటివి కూడా అందుబాటులో ఉండవు. మాజీ సైనికులనే హోదా, సంబంధిత ప్రయోజనాలేవీ అగ్నివీర్లకు ఇవ్వరు. అగ్నివీర్లు అమరులైనా ప్రభుత్వం తనవంతుగా ఎలాంటి పరిహారం చెల్లించదు. బీమా సొమ్ము మాత్రమే కుటుంబానికి అందుతుంది.
ప్రభుత్వం జవాబుదారీతనాన్ని పూర్తిగా తగ్గించే ఈ పథకం మొదటినుంచీ వివాదాస్పదమవుతూనే ఉన్నది. ఈ పథకాన్ని రద్దు చేయా లనే డిమాండ్లు ఇటీవలి కాలంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. సియాచిన్‌లో అమరుడైన ఓ సైనికాధికారి కుటుంబసభ్యులు ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తెలిసిందే.
సైనిక సేవను ఉపాధి అవకాశంగా ఎంచుకునే యువతలో అగ్నిపథ్ తీవ్రమైన అసంతృప్తిని రాజేస్తున్నది. అత్యధిక సైనికభర్తీ జరిగే హర్యా నా వంటి రాష్ర్టాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. యూపీలో ఘోరంగా దెబ్బతినడానికి ఈ పథకం కూడా కారణమని బీజేపీ నేతలే అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిపోయి మెజారిటీ గీతకు దిగువన 240 వద్ద ఆగిపోవడానికి గల కారణాలపై ఆ పార్టీ జరుపుతున్న విశ్లేషణల్లో అగ్నిపథ్ కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా యూపీ, రాజస్థాన్ నేతలు దీన్ని పార్టీకి ప్రతికూలంగా పనిచేసిన అంశంగా ఎత్తిచూపుతున్నారు. ఉత్తరాదికి చెందిన ఎన్డీయే మిత్రపక్షాలూ అగ్నిపథ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
2022లో అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా సైన్యంలో చేరాలనుకునే యువతలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. అనేక చోట్ల అల్లర్లు, హింసాకాండ చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగింది. అగ్నివీర్లు అమరులైతే చెల్లించే పరిహారం అంశం లోక్‌సభ తొలి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అసహనానికి గురికావడం తెలిసిందే. అగ్నిపథ్ రక్షణ దళాల్లో రెండు రకాల శ్రేణులను సృష్టిస్తుంది. వీరు పొందే ప్రయోజనాల్లో అంతరం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉద్యోగార్థులకే కాకుండా దేశ భద్రతకూ ఈ తరహా విభజన అంత సానుకూలంగా ఉండకపోవచ్చుననే సందేహాలను పూర్తిగా కొట్టిపారేయలేం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండికి పోకుండా దేశ ప్రయోజనాలు, ఇటీవలి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అగ్నిపథ్‌పై పునరాలోచన జరపడం మంచిది.