గుట్టు రట్టయింది. మోసం బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకొని తెలంగాణ నీటి హక్కులను పాతరేసేందుకు పన్నిన కుటిల పన్నాగం జడలు విప్పుకొంది. ఆదివారం రోజంతా చర్చ. అర్ధరాత్రి ప్రకటన. సీబీఐ చేతికి తాళాలివ్వాలనే ఎత్తుగడ. చర్చలో నిలవలేనివారు సీబీఐ వెనుక దాక్కున్నారు. అబద్ధాలతో, అభూతకల్పనలతో రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. బీఆర్ఎస్ మీద, ముఖ్యంగా కేసీఆర్ మీద బట్టకాల్చి మీదేసే కార్యక్రమంలో ఘోరంగా విఫలమైంది పాలకపక్షం.
కాంగ్రెస్ సర్కారు బూటకపు వాదనలను మాజీ మంత్రి హరీశ్‌రావు బద్దలుకొట్టారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముసుగు తీసి కాంగ్రెస్ హస్తానికి ధాటిగానే చురకలంటించారు. జస్టిస్ ఘోష్ నివేదిక ట్రాష్ అని తేల్చిచెప్పారు. కానీ, కాంగ్రెస్ కుట్ర వేరే ఉంది. కాళేశ్వరం కూలిందని టాంటాం వేసి, అందుకు కేసీఆర్‌ను బాధ్యుడిని చేసి, రాజకీయ వేధింపులకు పాల్పడే కర్కోటక ప్రణాళికను బయటకు తీసేందుకు చర్చ ఓ సాకు మాత్రమే. కేసీఆర్‌పై విషం కక్కే చవకబారు, రొడ్డకొట్టుడు ప్రసంగం చివరన సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు.
తెలంగాణలో భవితవ్యం లేని మూడు పార్టీలు మన నీటి హక్కుల కు పెడుతున్న చిచ్చు ఇది. అటు గురువు, ఇటు శిష్యుడు, పైన బడేభా య్ ఆడుతున్న నాటకమిది. నీళ్ల కోసం నినదించి అద్వితీయ పోరాటం జరిపిన ఈ గడ్డ బిడ్డలను నిలువునా ముంచే కుట్ర ఇది. ఆంధ్ర జలదోపిడీకి అడ్డంగా వత్తాసు పలికే కాంగ్రెస్ మార్కు వెన్నుపోటు ఇది. నదినే ఎగరేసుకుపోవాలనే కేంద్రం ఎత్తుగడలకు మోకరిల్లే మరుగుజ్జుల దిగజారుడుతనం ఇది. తెలంగాణ సాధకుడు, ప్రగతి రథ చోధకుడు అయిన కేసీఆర్‌పై అక్కసు రాజకీయాల విపరీత పోకడలకు పరాకాష్ఠ ఇది. మనోడితో పరాయోడు ఆడిస్తున్న బొమ్మలాట ఇది. మన వేలితో మన కంటినే పొడుస్తున్న విపరీత విన్యాసం ఇది. కన్నంలో దొరికిన దొంగే ‘దొంగ దొంగ’ అని అరిచే దగుల్బాజీ దబాయింపు ఇది. అందుకు పవిత్రమైన చట్టసభను అడ్డంగా వాడుకోవడం విడ్డూరం. వాదన చేతకానివాడు తీర్పు చెప్తున్నాడు.
ఔను..! తెలంగాణకు ప్రతీక కేసీఆర్. కేసీఆర్ చెరగని సంతకం కాళేశ్వరం. యావత్ ప్రపంచం ప్రశంసలు పొందిన ఆ మహాజల సౌధంపై పగబట్టినవారే ఇప్పుడు పొగబెడుతున్నారు. ధర్మయుద్ధంలో గెలవలేమని తెలిసి ఆడుతున్న మోసకారి పాచికలాట. రెండు పియర్లు కుంగితే ఆకాశమే కూలిందన్నట్టుగా గాయిగాయి చేశారు. కల్లబొల్లి కబుర్లతో అధికారం దక్కించుకోగానే కమిషన్ అన్నారు. ఇప్పుడు సీబీఐ జపం చేస్తున్నారు. పిట్టపోరు పిట్టపోరు తీర్చమని ఢిల్లీ పిల్లి చేతికి తాళాలిచ్చారు. కాళేశ్వరంపై పొరుగునేత కపటనీతి తెలియనిదెవరికి? సీబీఐ ఏ పంజరపు చిలకో తెలియకనే ఇదంతా జరుగుతున్నదంటే ఎవరు నమ్ముతారు? తప్పుల తడక నివేదికతో తప్పులెన్నాలని చూసే ఈ వైపరీత్యం ఎప్పటికీ గెలువజాలదు. తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు. కేసీఆర్‌కు ఉద్యమించడం ఉగ్గుపాలతో పెట్టిన విద్య. ఆ మహానేత రాజకీయ ప్రస్థానంలో ఇది నూరున్నొకటవ పరీక్ష. ప్రజల అండదండలే శ్రీరామరక్ష.